ఇటలీ తప్పు.. మనం చేయొద్దు
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. మహమ్మారి పుట్టిన చైనాలో కంటే ఆ దేశంలోనే మృత్యుఘోష ఎక్కువగా ఉంది. శనివారం ఒక్కరోజే ఇటలీలో 793 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 4,825కు చేరింది. మరో 6,557 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 53,000 దాటింది. ఎక్కడ తప్పు జరిగింది. చైనా కంటే దుర్భర పరిస్థితి ఇటలీ ఎందుకు ఎదుర్కొంటోంది. అందమైన […]
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. మహమ్మారి పుట్టిన చైనాలో కంటే ఆ దేశంలోనే మృత్యుఘోష ఎక్కువగా ఉంది. శనివారం ఒక్కరోజే ఇటలీలో 793 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 4,825కు చేరింది. మరో 6,557 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 53,000 దాటింది. ఎక్కడ తప్పు జరిగింది. చైనా కంటే దుర్భర పరిస్థితి ఇటలీ ఎందుకు ఎదుర్కొంటోంది. అందమైన ఆ దేశంలో కరోనా కరాళ నృత్యం ఎందుకు చేస్తోంది.
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలు కాగానే ఇటలీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు, సూచనలు చేసింది. కానీ, ఆ దేశ ప్రజలు దీన్ని తేలికగా తీసుకున్నారు. సాధారణ వైరస్‌గా భావించారు. చైనా పరిస్థితి మనకెందుకు ఎదురవుతుందనుకున్నారు. సెలవులు వచ్చాయని విహారయాత్రలు, సినిమా హాళ్లకు వెళ్లారు. చిన్నచిన్న పార్టీలు చేసుకున్నారు. బజారులో చేరి గుంపులు గుంపులుగా ముచ్చట్లు పెట్టుకున్నారు. పర్యవసానం ఈరోజు ఆ దేశం మొత్తం అనుభవిస్తోంది. ప్రస్తుతం ఇటలీ మొత్తం క్వారంటైన్‌లో ఉంది. తప్పదారి ఎవరైనా వీధుల్లోకి వస్తే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. అయినా సరే.. రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ సూచనలను పాటించి ఉంటే ఇటలీకి ఈ పరిస్థితి ఎదురయ్యేదా?
మనం ఏం చేస్తున్నాం
మనమూ ఇటలీ దారిలోనే వెళ్తున్నామా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. కనీస సామాజిక బాధ్యత లేనట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇందుకు శనివారం ఒక్కరోజే ఎన్నో నిదర్శనలు కనిపించాయి. క్వారంటైన్‌లో ఉండాల్సిన దంపతులు నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యక్షమయ్యారు. తోటి ప్రయాణికులు గుర్తించి రైలును నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం వారిని గాంధీ హాస్పిటల్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైలో క్వారంటైన్‌లో ఉండాల్సిన ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. పశ్చిమగోదావరి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. తోటి ప్రయాణికులు అతని చేతిపై ఉన్న ముద్రను గుర్తించి అప్రమత్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడిని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించారు. ఇక స్కూళ్లకు సెలవులు ప్రకటించగానే ఆలయాలకు జనం పోటెత్తారు. దీంతో ప్రభుత్వం ఏకంగా ఆలయాలను మూసివేయాల్సి వచ్చింది. సెలబ్రిటీలు ఏమైనా తక్కువ తిన్నారా? అందుకు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ వ్యవహారమే చక్కటి ఉదాహరణ. లండన్ నుంచి వచ్చిన ఆమె క్వారంటైన్‌లో ఉండక పార్టీలకు హాజరైంది. అదే పార్టీలకు హాజరైన ఎంపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్వారంటైన్ ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా 184 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది. ఆయా దేశాల నుంచి వచ్చిన వారు ఆ మహమ్మారి బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకోసమే విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఈ విజ్ఞప్తి ఎందుకోసం.. ఎవరి కోసమని ఆలోచిస్తే విషయం బోధపడుతుంది. స్వీయ నిర్బంధంలో ఉండటం వల్ల మరొకరికి కరోనా సోకకుండా ఉంటుంది. దానివల్ల రెండో దశలోకి భారత్ వెళ్లదు. ప్రస్తుతం వచ్చే 15 రోజులు చాలా కీలకం. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలు జాగ్రత్త పడకున్నా ఆ మహమ్మారి రెండో దశలోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ప్రస్తుతం ఇటలీ ఎదుర్కొంటున్న పరిస్థితి మనమూ ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశంతో పోలిస్తే ఇటలీ చాలా చిన్న దేశం. అక్కడి జనాభా 6 కోట్లు మాత్రమే. మన దేశ జనాభా 130 కోట్ల పైమాటే. ఇటలీ పరిస్థితి మనకు తలెత్తితే భయానక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
రాష్ట్రపతి కంటే బిజీనా
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ హాజరైన పార్టీలో ఎంపీ దుష్యంత్‌సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కనికాకు పాజిటివ్ అని తేలగానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అలర్ట్ అయ్యారు. రాష్ట్రపతి భవన్ మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఏ పని లేక రాష్ట్రపతి క్వారంటైన్‌లోకి వెళ్లలేదు. దేశ ప్రజలకు కరోనా తీవ్రతను తెలియజేయడమే ఆయన ఉద్దేశం. మరోవైపు వారం రోజులుగా భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన ఇంటికి కూడా వెళ్లలేదు. నేరుగా గెస్ట్‌హౌస్‌కు వెళ్లి క్వారంటైన్‌లో ఉన్నారు. ఏం ఆయనకు భార్య, పిల్లలు లేరా? వారిని చూడాలని ఆయనకు ఉండదా? తన వల్ల కుటుంబం ఇబ్బంది పడకూడదని, సమాజాన్ని కరోనాకు బలి చేయకూడదని ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు సొంత అకాడమీ, మరోవైపు భారత బ్యాడ్మింటన్ కోచ్ బాధ్యతలు ఊపిరి తీసుకోనంత బిజీగా ఉంటారు పుల్లెల గోపిచంద్. ఆయన కంటే ఎవరు బిజీ.
ఒక్కసారి ఆలోచించండి..
కరోనా మహమ్మారి పోరాటం ఏ ఒక్కరిదో కాదు. దేశ ప్రజల అందరిది. మాస్కులు పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపించినా.. పరిశుభ్రత పాటించడంలో అలసత్వం ప్రదర్శించినా.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేయాలని అనిపించినా ఒక్కసారి ఇటలీని గుర్తుచేసుకోండి. ఆ భయానక పరిస్థితి మనకు అవసరమా? మనపైన ఎవరూ బండరాళ్లు ఎత్తడం లేదు. కనీస బాధ్యతగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలను పాటించండి. పార్టీలు, విందులు, వినోదాలు, పెళ్లిళ్లు వాయిదా వేసుకోండి. పండుగలకు దూరంగా ఉండండి. గుమిగూడకండి. ఒక్కచోట పెద్ద ఎత్తున చేరకండి. అంతే.. వీటిని పాటిస్తే చాలు ఆ మహమ్మారి ప్రబలకుండా ఉంటుంది.
Tags: coronavirus, effect, death toll in Italy, president ramnath kovind, badminton coach gopichand, indians negate, covid-19 second stage effect