కిడ్నాప్ కేసును 10 గంటల్లో ఛేదించిన ఎస్పీ
దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నాప్ కేసును 10 గంటల్లోనే ఛేదించి డైనమిక్ ఆఫీసర్‌గా ప్రశంసలు పొందుతున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్. యువ ఐపీఎస్ అధికారిణి అయిన ఈమె స్పందించిన వేగం, చొరవతోనే 5 రోజుల పసికందు కిడ్నాప్‌ను గంటల్లోనే తేల్చేసి.. నిందితులను కటకటాల్లోకి నెట్టేసింది. ఏపీలోని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగిన చిన్నారి అపహరణ కేసుకు ఆదివారం ఎండ్ కార్డు పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా, […]
దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నాప్ కేసును 10 గంటల్లోనే ఛేదించి డైనమిక్ ఆఫీసర్‌గా ప్రశంసలు పొందుతున్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్. యువ ఐపీఎస్ అధికారిణి అయిన ఈమె స్పందించిన వేగం, చొరవతోనే 5 రోజుల పసికందు కిడ్నాప్‌ను గంటల్లోనే తేల్చేసి.. నిందితులను కటకటాల్లోకి నెట్టేసింది. ఏపీలోని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగిన చిన్నారి అపహరణ కేసుకు ఆదివారం ఎండ్ కార్డు పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా, కారంపూడి మండలం, బట్టువారిపల్లికి చెందిన ఏరువ శ్రీరాములుకు ప్రకాశం జిల్లా మార్కాపూరం మండలం, మాల్యవంతునిపాడుకు చెందిన కోమలితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా గర్భం దాల్చిన కోమలి ఆగస్ట్ 23న మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరింది. 24న ఉదయం 7 గంటలకు కోమలి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పాపకు పుట్టు కామెర్ల వచ్చినట్టు గుర్తించిన వైద్యులు ఈనెల 27 నుంచి ఆసుపత్రిలోని ఫోటోథెరపీ గదిలో ఉంచి శిశువుకు చికిత్స అందిస్తున్నారు. కాగా 28న మధ్యాహ్నం సమయంలో బుర్ఖా ధరించిన ఉన్న ఓ గుర్తు తెలియని మహిళ శిశువును ఎత్తుకుని ఆస్పత్రి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మరోవైపు కోమలి దంపతులు చిన్నారి కోసం ఆస్పత్రిలో వెతికినా ఆచూకీ లభించలేదు. వెంటనే మార్కాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన మార్కాపూర్ రూరల్ ఎస్ఐ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. చిన్నారి జాడను గుర్తించడానికి, జిల్లాలోని ముఖ్యమైన జంక్షన్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దు జిల్లా చెక్ పోస్ట్‌లను అప్రమత్తం చేశారు. మరోవైపు ఎస్పీనే స్వయంగా జిల్లాలోని అన్ని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి పరిశీలించారు. అనుమానిత సీసీ కెమెరా ఫుటేజీల సమాచారాన్ని, అధికారులకు పంపుతూ, నిర్విరామంగా దర్యాప్తును కొనసాగించారు.
మరోవైపు చిన్నారి కిడ్నాప్ వార్త జిల్లాలో దావనంలా వ్యాపించడంతో కిడ్నాపర్ల వివరాలు పోలీసులకు అందాయి. ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు మార్కాపూర్ రూరల్ ఎస్ఐ తన సిబ్బందితో కంభం రోడ్డులోని, మధు చిల్డ్రన్ హాస్పిటల్‌పై దాడి చేశారు. అక్కడ అనుమానస్పదంగా ఉన్న దూదేకుల రెహనాను అదుపులోకి తీసుకుని విచారించగా.. కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. రెహనా తన దూరపు బంధువు హలీమా బేగంకు శిశువును విక్రయించేందుకు మరో బంధువు రహమతున్నీషా బేగం ద్వారా రూ.50 వేలకు బేరం కుదిరించుకున్నట్లు పోలీసుల ముందు అంగీకరించింది. రెహనా సమాచారంతో ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదుతోపాటు, బాండ్ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ మలికా గార్గ్ ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో కిడ్నాప్ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అపహరణకు గురైన 5 రోజుల శిశువును 10 గంటల్లోనే రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. ముగ్గురు నిందితురాళ్లను అరెస్ట్ చేసి, మార్కాపురం కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. అనంతరం ఘటన జరిగిన 10 గంటలలోపే కేసును చేధించిన పోలీసు సిబ్బందిని ప్రశంసించారు. వారికి రివార్డ్ ప్రకటించారు. ఈ సమావేశంలో మార్కాపురం డీఎస్పీ యం.కిషోర్ కుమార్. మార్కాపురం సీఐ బీటీ నాయక్, మార్కాపురం సర్కిల్ ఎస్సైలు జి.కోటయ్య, కె. నాగమల్లేశ్వరరావు, వై.నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.