అంధకారంలోకి భారత్? పొంచి ఉన్న భారీ ముప్పు

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొన్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఆంక్షలు మొదలుకానున్నాయి. ఢిల్లీ నగరంలో వినియోగదారులకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలంటూ మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్‌లు వెళ్తున్నాయి. తెలంగాణలో సైతం విద్యుత్ కోతలు తప్పేలా లేవు. విద్యుత్ కోతలతో నేషనల్ గ్రిడ్ దెబ్బతినకుంటా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. మెట్రో నగరాలు మినహా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు త్వరలో అనివార్యం కానున్నాయి. అంతర్జాతీయంగా బొగ్గు నిల్వలకు […]

Update: 2021-10-10 00:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొన్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఆంక్షలు మొదలుకానున్నాయి. ఢిల్లీ నగరంలో వినియోగదారులకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలంటూ మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్‌లు వెళ్తున్నాయి. తెలంగాణలో సైతం విద్యుత్ కోతలు తప్పేలా లేవు. విద్యుత్ కోతలతో నేషనల్ గ్రిడ్ దెబ్బతినకుంటా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. మెట్రో నగరాలు మినహా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు త్వరలో అనివార్యం కానున్నాయి. అంతర్జాతీయంగా బొగ్గు నిల్వలకు సంక్షోభం ఏర్పడడంతో ఆ ప్రభావం థర్మల్ విద్యుత్‌ ఉత్పత్తిపై పడింది.

ఆస్ట్రేలియా, ఇండోనేషియా లాంటి దేశాలు బొగ్గును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే బొగ్గు ధర గణనీయంగా పెరిగిపోయింది. గతేడాది ఒక టన్నుకు 45 డాలర్లు ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అది 86 డాలర్లకు, ఆగస్టు చివరి నాటికి 182 డాలర్లకు పెరిగింది. దీంతో చైనా దిగుమతి చేసుకోవడం నిలిపేసింది. భారత్ కూడా ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నది. ఎక్కువ ధర కావడంతో స్వదేశీ నిల్వలపై ఫోకస్ పెట్టింది. కానీ వాతావరణ పరిస్థితులు, వర్షం లాంటి పలు కారణాలతో నిర్దిష్ట లక్ష్యం మేరకు బొగ్గు మైనింగ్ కార్యకలాపాలు సాగడం లేదు. ఫలితంగా కొరత ఏర్పడింది.

దేశంలోని మొత్తం 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 126 ప్లాంట్లలో ఐదు రోజులకు సరిపోయే నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరో 26 ప్లాంట్లలో రెండు రోజుల సరిపోయేంత మాత్రమే ఉన్నదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ లెక్కలు వేసింది. దేశంలో సుమారు 167 గిగావాట్ల విద్యుత్ అవసరాల్లో 126 టన్నులు థర్మల్ ప్లాంట్ల ద్వారా సమకూరుతున్నది. గతేడాదితో పోలిస్తే పది శాతం వినియోగం పెరిగింది. మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 53% థర్మల్ వాటా ఉన్నప్పటికీ సుమారు 70% విద్యుత్ వాటి ద్వారానే సమకూరుతున్నది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్ము కశ్మీర్, లడఖ్ తదితర రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి.

తెలంగాణ విషయాన్నే తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద సుమారు 6,215 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా (3772 మెగావాట్లు) థర్మల్ ద్వారానే సమకూరుతున్నది. జల విద్యుత్ 2441 మెగావాట్లు సమకూరుతున్నది. రాష్ట్రంలో మొత్తం డిమాండ్ దాదాపు 13 వేల మెగావాట్లు ఉన్నది. అయితే చత్తీస్‌గఢ్ తదితర మార్గాల ద్వారా విద్యుత్ కొనుగోళ్ళు జరుగుతున్నందున ఎలాంటి కోతలు లేకుండా సరఫరాకు వీలవుతున్నది. ఇక సౌర విద్యుత్ ద్వారా దాదాపు 3910 మెగావాట్లు లభిస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలోనూ, దేశవ్యాప్తంగానూ బొగ్గు సంక్షోభంతో విద్యుత్ ఉత్పత్తి దెబ్బతింటున్నందున కోతలకు తావులేని విధంగా సరఫరా చేయడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.

ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి బొగ్గు నిల్వలు వారం రోజులకు సరిపోయేలా ఉన్నాయి. కానీ రెండు వారాల వరకు సర్దుకోవచ్చంటూ రాష్ట్ర జెన్ కో అధికారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి విద్యుత్ సరఫరాపై ప్రభావం పడకుండా చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేసినట్లు జెన్‌కో అధికారులు పేర్కొన్నారు. జల విద్యుత్ పూర్తి స్థాయిలో జరిగేలా ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని రామగుండం, కాకతీయ, భద్రాద్రి, కొత్తగూడెం తదితర థర్మల్ ప్లాంట్ల దగ్గరి తాజా బొగ్గు నిల్వల వివరాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు సూచించినట్లు గుర్తుచేశారు. అదే సమయంలో రాష్ట్ర గ్రిడ్ దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోడానికి జెన్‌కో అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటున్నారు.

దేశవ్యాప్తంగా విద్యుత్ కోత తప్పనిసరిగా అమలుచేయాల్సి వస్తే తొలుత డొమెస్టిక్ (ఇళ్ళు), చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఉండొచ్చని కేంద్ర విద్యుత్ వర్గాల సమాచారం. మంత్రి ఆర్‌కే సింగ్ తరచూ విద్యుత్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితికి తగినట్లుగా సూచనలు చేస్తున్నారు. రెండవ దశలో ఆఫీసులకు, భారీ ఫ్యాక్టరీలకు కోతలు విధించే అవకాశం ఉంది. బొగ్గు సంక్షోభం కారణంగా తలెత్తే విద్యుత్ సమస్యలు ఐదారు నెలల పాటు ఉండొచ్చని అంచనా. అయితే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు చాలా చోట్ల మన దేశంలో శీతకాలం వస్తున్నందున గృహ విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉందని, ఆ మేరకు డిమాండ్‌ కూడా తక్కువగానే ఉండొచ్చని, ఇది ఉపశమనంగానే ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News