త్వరలో కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. ఆ నేతలపై రేవంత్ వేటు..?

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామ‌కంతో ఆ పార్టీలో ప్ర‌క్షాళ‌న ప్రారంభం కాబోతోందా..? జిల్లాల్లో డీసీసీ అధ్య‌క్షులు, మండ‌ల అధ్య‌క్షుల మార్పు ఉండ‌నుందా..? పార్టీ ప‌ద‌వుల్లో యువత‌కే ప్రాధాన్యం ద‌క్క‌నుందా..? పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉండి కూడా ప్ర‌భుత్వంపై గ‌ళ‌మెత్త‌ని నేతలను ప‌ద‌వుల‌ నుంచి త‌ప్పించ‌డం ఖాయ‌మేనా..? అంటే పార్టీ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానమే వ‌స్తోంది. జూలై 7న రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తర్వాత మొదట పార్టీలో ప్ర‌క్షాళ‌న […]

Update: 2021-06-27 23:54 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామ‌కంతో ఆ పార్టీలో ప్ర‌క్షాళ‌న ప్రారంభం కాబోతోందా..? జిల్లాల్లో డీసీసీ అధ్య‌క్షులు, మండ‌ల అధ్య‌క్షుల మార్పు ఉండ‌నుందా..? పార్టీ ప‌ద‌వుల్లో యువత‌కే ప్రాధాన్యం ద‌క్క‌నుందా..? పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉండి కూడా ప్ర‌భుత్వంపై గ‌ళ‌మెత్త‌ని నేతలను ప‌ద‌వుల‌ నుంచి త‌ప్పించ‌డం ఖాయ‌మేనా..? అంటే పార్టీ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానమే వ‌స్తోంది. జూలై 7న రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తర్వాత మొదట పార్టీలో ప్ర‌క్షాళ‌న చేప‌డుతార‌ని తెలుస్తోంది. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో కూడా డీసీసీ అధ్య‌క్షుల మార్పు త్వ‌ర‌లో ఉంటుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు చెప్పుకొస్తున్నారు.

ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ అర్భ‌న్‌, రూర‌ల్ జిల్లాల‌కు ఉమ్మ‌డి అధ్య‌క్షుడిగా నాయిని రాజేంద‌ర్‌రెడ్డి కొన‌సాగుతుండ‌గా.. జ‌న‌గామ జిల్లాకు జంగా రాఘ‌వ‌రెడ్డి, ములుగు జిల్లాకు న‌ల్లెల కుమార‌స్వామి, భూపాల‌ప‌ల్లి జిల్లాకు ప్ర‌కాశ్‌రెడ్డి, మానుకోట జిల్లాకు జిన్నారెడ్డి భ‌ర‌త్ చంద‌ర్‌రెడ్డిలు ఉన్నారు. ఇందులో రెండు జిల్లాల‌కు చెందిన నేతల‌పై మిన‌హా మిగ‌తా నాలుగు జిల్లాల నాయ‌క‌త్వంపై క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే పార్టీ ప‌ద‌వుల్లో రేవంత్‌రెడ్డి వ‌ర్గానికి ఖ‌చ్చితంగా ప్రాధాన్యం ఉంటుంద‌నే చర్చ ఓరుగ‌ల్లు కాంగ్రెస్‌లో ఇప్పుడే మొద‌లైంది. పార్టీ క‌మిటీల్లోనూ వీరు సూచించిన నేత‌ల‌కే అవ‌కాశం ద‌క్క‌నుంద‌న్న అభిప్రాయాన్ని సీనియ‌ర్లు వెల్ల‌డిస్తున్నారు.

త్వ‌ర‌లోనే మండ‌ల స్థాయిలోనూ కొత్త క‌మిటీలు

తొలుత పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల‌ని ఏఐసీసీ నేత‌ల నుంచి రేవంత్‌రెడ్డికి సూచ‌న‌లు అందిన‌ట్లుగా తెలుస్తోంది. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డిజిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియ‌ర్ లీడ‌ర్ దిశ‌కు వెల్ల‌డించారు. ముందు గ్రామ క‌మిటీలు, త‌ర్వాత‌ మండ‌ల, ఆ త‌ర్వాత జిల్లా క‌మిటీల ఏర్పాటు దిశ‌గా పార్టీ ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.ఇదంతా కూడా జాప్యం లేకుండానే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. పార్టీ ప‌ద‌విలో ఉంటూ ఏమాత్రం ప‌నిచేయ‌నివారికి అప్రాధాన్యంగా ఉండిపోవ‌డం ఖాయ‌మ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం గ‌మ‌నార్హం.

గోడ మీద నేత‌లు

టీపీసీసీ చీఫ్‌గా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిని ఎంపిక చేయాల‌ని మ‌ద్ద‌తు ప‌లికిన నేత‌లు ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డిన‌ట్ల‌యింది. ఉత్త‌మ్‌వ‌ర్గం నేత‌లుగా ముద్ర‌ప‌డిన నేత‌లూ సైతం కోమ‌టిరెడ్డికి మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లుగా వ‌రంగ‌ల్ పార్టీ శ్రేణుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి నియామ‌కంతో ఏం చేయాలో అర్థం కాక వారు గోడ మీద కూర్చున్నారు. ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తూ మాట్లాడుతున్నారు. సంబ‌రాలకు అంటీముట్ట‌న్న‌ట్లుగా ఉన్నారు.

Tags:    

Similar News