సోనూసూద్ మరో అద్భుత నిర్ణయం
దిశ ప్రతినిధి, నల్లగొండ: వారికి నిండా పదేండ్ల వయస్సు లేదు. ఇద్దరు అన్నదమ్ములు, మరో చెల్లి. ఏడాది కిందట తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. వారం రోజుల క్రితం తల్లి కన్నుమూసింది. ఫలితంగా అభంశుభం తెలియని ఆ ముగ్గురు చిన్నారులు రోడ్డునపడ్డారు. నా అనేవారు లేక అల్లాడిపోతున్నారు. అందులో చిన్నకొడుకు.. అసలు వాళ్ల అమ్మ చనిపోయిందన్న విషయమే తెలియదు. అమ్మా.. ఎప్పుడొస్తావంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వారికి అమ్మమ్మ, తాత ఉన్నప్పటికీ.. వారు పండు ముసలి […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: వారికి నిండా పదేండ్ల వయస్సు లేదు. ఇద్దరు అన్నదమ్ములు, మరో చెల్లి. ఏడాది కిందట తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. వారం రోజుల క్రితం తల్లి కన్నుమూసింది. ఫలితంగా అభంశుభం తెలియని ఆ ముగ్గురు చిన్నారులు రోడ్డునపడ్డారు. నా అనేవారు లేక అల్లాడిపోతున్నారు. అందులో చిన్నకొడుకు.. అసలు వాళ్ల అమ్మ చనిపోయిందన్న విషయమే తెలియదు. అమ్మా.. ఎప్పుడొస్తావంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వారికి అమ్మమ్మ, తాత ఉన్నప్పటికీ.. వారు పండు ముసలి వాళ్లు. దీంతో వారికి చేసిపెట్టే దిక్కులేదు. పిల్లలను సాకడం అనేది గగనమే. దీంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. అందరితో ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో చెల్లెలు, తమ్ముడికి వండి పెడుతూ.. ఆలనాపాలన చూసుకుంటూ.. అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఈ హృదయ విదారక ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో జరిగింది.
పూర్తి వివరాల్లోకెళితే..మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్య, అనురాధ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వీరిది పేద కుటుంబం కావడంతో నిత్యం కూలీ పనులు చేసుకుంటూ ఉన్నంతలోనే భార్య , పిల్లలను సంతోషం సాదుకుంటూ వస్తున్నాడు. అయితే, ఒక్కసారిగా సత్తయ్య అనారోగ్యానికి గురయ్యాడు. సరిగ్గా ఏడాది కిందట అనారోగ్యంతో కన్నమూశాడు. దీంతో అనురాధ అన్నీ తానై కూలీనాలీ పనులు చేసుకుంటూ పిల్లలను పెంచుకుంటోంది. ఈ పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం ఆ కుటుంబం పట్ల విధికి కన్నుకుట్టినట్టయ్యింది. అనురాధ సైతం అనారోగ్యం బారిన పడింది. మంచి ఆస్పత్రుల్లో చూయించుకునే స్థోమత లేకపోవడం వల్ల ఇంటి వద్దే ఉండిపోయింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తల్లి అనురాధ సైతం కన్నుమూసింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అనురాధకు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులే తలా కొంచెం చందాలు వేసుకుని ఖర్మకాండలు జరిపించారు. కాగా, పెద్దకొడుకు మనోహర్(9) నాలుగో తరగతి పూర్తి చేసి ఈ సంవత్సరం ఐదో తరగతి చదవాల్సి ఉంది. కూతురు లాస్య(6), చిన్న కొడుకు యశ్వంత్(4) ఉన్నారు. వీరికి బంధువులు ఉన్నా.. వారు సైతం కడు పేదరికంలో ఉండడంతో ఎవరూ వీరిని ఆదరించలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం ఇంటిలో ఉన్న నిత్యావసరాలతోనే పెద్దకొడుకు మనోహర్.. తన చెల్లి, తమ్ముడికి వంట చేసి కడుపు నింపుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గ్రామస్తుల నుంచి భోజనం సేకరించి చెల్లి, తమ్ముడికి కడుపు నింపుతున్నారు. అతిచిన్న వయస్సులోనే మనోహర్ కొండంత భారాన్ని మోస్తున్నాడు. అయితే తమను ఆదుకునేందుకు ఎవరైనా ఆపన్నహస్తం అందించాలంటూ ఎదురుచూస్తున్నాడు.
స్పందించిన సినీనటుడు సోనూసూద్..
కరోనా కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడం దగ్గరి నుంచి ఇటీవల వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శారద.. ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకునే విషయం తెలుసుకుని ఆదుకునే వరకు విశ్రాంతి లేని యోధుడిగా సినీ నటుడు సోనూసూద్ అందరికీ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమ్మనాన్న లేక ముగ్గురు పిల్లలు అనాథలైన సంగతి తెలుసుకున్న సోనూసూద్.. పిల్లలను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. పిల్లల బాధ్యతనంతా తానే తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా సోనూసూద్ ప్రకటించారు. సోనూసూద్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలకు పలువురి సాయం
ఆలేరు: తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ. 50 వేలు అందిస్తున్నట్లు పిల్లల మేనమామకు తెలిపారు. బీర్ల ఫౌండేషన్ అధ్యక్షులు అయిలయ్య ఆ సాయాన్ని అందజేశారు. స్థానిక సర్పంచ్ సహకారంతో ఎస్ఐ రూ. 10 వేలు, అంగన్ వాడీ టీచర్లు రూ. 5 వేలు అందించారు. ఈ డబ్బులను పిల్లల పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్టు సర్పంచ్ తెలిపారు. పిల్లల చదువుల ఖర్చులు తాము భరిస్తానని కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్‌చార్జి ఐలయ్య చెప్పారు.