క్షణం ఆలోచించకుండా సరే అన్నాడు…
దిశ, కుత్బుల్లాపూర్: వారిద్దరూ మంచి స్నేహితులు.. తమ వ్యక్తిగత, ఆర్థిక కష్టాలను షేర్ చేసుకుని ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలిచేవారు. అంతేకాదు ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే చలించిపోయే స్వభావం గలవారు. అలా ఎవరైనా వారి కంటపడితే.. ఉన్నంతలోనే సాయపడేందుకు పరితపించే గుణం కలవారు. అలాంటివారు లాక్‌డౌన్ మూలాన సొంత రాష్ట్రానికి కాలినడకన బయలుదేరిన వలస కార్మికుల దీనావస్థను చూసి.. సాటి మనుషులుగా వారికి ఏదో విధంగా సాయపడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వారి ఆలోచనను ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా […]
దిశ, కుత్బుల్లాపూర్: వారిద్దరూ మంచి స్నేహితులు.. తమ వ్యక్తిగత, ఆర్థిక కష్టాలను షేర్ చేసుకుని ఒకరికొకరు చేదోడువాదోడుగా నిలిచేవారు. అంతేకాదు ఇతరులు కష్టాల్లో ఉన్నారంటే చలించిపోయే స్వభావం గలవారు. అలా ఎవరైనా వారి కంటపడితే.. ఉన్నంతలోనే సాయపడేందుకు పరితపించే గుణం కలవారు. అలాంటివారు లాక్‌డౌన్ మూలాన సొంత రాష్ట్రానికి కాలినడకన బయలుదేరిన వలస కార్మికుల దీనావస్థను చూసి.. సాటి మనుషులుగా వారికి ఏదో విధంగా సాయపడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వారి ఆలోచనను ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లికి చెందిన కందాడి శివారెడ్డి.. లాక్‌డౌన్ ప్రారంభ దశలో కొంపల్లి సినీ ప్లానెట్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. అదే సమయంలో ఓ వికలాంగురాలు నడుచుకుంటూ ఇబ్బందిగా వెళ్తుండటం చూశాడు. అప్రయత్నంగానే ఆమెను ఆపిన శివారెడ్డి.. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తున్నావని అడిగితే.. బెంగళూరు నుంచి చత్తీస్‌ఘడ్ అని తెలిపింది. ఐదు రోజుల కిందట కొంత వంట సామగ్రితో బయలుదేరానని, మూడు రోజుల్లోనే ఆ సరుకులన్నీ అయిపోయాయని తెలిపింది. అంతేకాకుండా తన వద్ద రూ.5 వేలున్నా.. లాక్‌డౌన్ కారణంగా కనీసం బిస్కెట్లు కూడా దొరకడంలేదని విలపించింది. అప్పుడు తనకు ఓ ఆలోచన స్ఫురించింది. వెంటనే కొంపల్లికి చెందిన తన స్నేహితుడు సైన్మా రెస్టారెంట్ యజమాని సందీప్ రెడ్డికి కాల్ చేసి ఏదైనా టిఫిన్ చేయించి నడుకుంటూ వెళ్తున్న వారికి పెట్టిద్దామని కోరగా.. ఆయన కూడా క్షణం ఆలోచించకుండా సరే అన్నాడు. అంతే.. 15 నిమిషాల్లోనే ఉప్మా చేయించి సదరు వికలాంగురాలితోపాటు మరికొంత మందికి పెట్టించారు. ఇలా వారిద్దరికీ కొంపల్లి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ జ్యోత్స్న, ఎస్‌ఆర్ మోటర్స్ యజమాని కందాడి సుదర్శన్ రెడ్డితో మరికొంతమంది తోడయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 57 వేల మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
200 టన్నుల బియ్యం, నిత్యావసరాల పంపిణీ
ప్రభుత్వం అందజేస్తున్న రూ.500 నగదుతో పాటు రేషన్ బియ్యం అందరికీ చేరడంలేదని గుర్తించి.. బియ్యంతో పాటు నిత్యావసరాల పంపిణీకి కూడా పూనుకున్నారు. ఈ క్రమంలో కొంపల్లి మున్సిపల్ 13వ వార్డులో 550 మందికి బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేసి తమ సేవా కార్యక్రమాలను మరింత పెంచారు. ఒక్కో కిట్‌లో రూ.745 విలువ గల 10 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమ పిండి, కిలో కంది పప్పు, కిలో చక్కెర, కిలో మంచి నూనె, కూరగాయలతో పాటు ఇతరత్రా నిత్యావసరాలను మానవత్వంతో పంచిపెట్టి ఎంతో మంది కడుపు నింపారు.
నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూస్తే కన్నీళ్లొచ్చాయి: కందాడి శివారెడ్డి, కొంపల్లి వాసి
కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన పేదల కష్టాలు వర్ణనాతీతం. పనులు లేక.. ఇక్కడ బతకలేక కాలి నడకన వందల కిలోమీటర్ల దూరం వెళ్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆకలిని సైతం లెక్క చేయకుండా వెళ్తున్నప్పుడు నా కండ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడే అనుకున్నాను.. పేదలకు సహాయం చేయాలని, ఈ క్రమంలో దాతలు సందీప్, సుదర్శన్ సహకారంతో ముందుకెళ్లాను.