లాక్‌డౌన్ పాటించ‌ని కంపెనీలు ?

దిశ, న‌ల్ల‌గొండ‌: కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన పలువురు పారిశ్రామిక వేత్త‌ల‌కు చెందిన కంపెనీలు మాత్రం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాయి. ఏప్రిల్ 14 వ‌ర‌కు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. జీవో 46 విడుద‌ల‌, ఐదుగురి కన్నా ఎక్కువ‌గా గుమిగూడ‌వ‌ద్ద‌న్న క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేస్తున్నారు. అయితే పలువురు పారిశ్రామిక‌వేత్త‌లు బంద్ పాటించ‌కుండా వారి కంపెనీలను య‌ధేచ్ఛ‌గా న‌డుపుతున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, అగ్రిక‌ల్చ‌ర‌ల్, ఫార్మా, మెడిక‌ల్ రంగాల‌కు చెందిన […]

Update: 2020-03-26 08:18 GMT

దిశ, న‌ల్ల‌గొండ‌: కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతుంటే.. రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన పలువురు పారిశ్రామిక వేత్త‌ల‌కు చెందిన కంపెనీలు మాత్రం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాయి. ఏప్రిల్ 14 వ‌ర‌కు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించారు. జీవో 46 విడుద‌ల‌, ఐదుగురి కన్నా ఎక్కువ‌గా గుమిగూడ‌వ‌ద్ద‌న్న క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేస్తున్నారు. అయితే పలువురు పారిశ్రామిక‌వేత్త‌లు బంద్ పాటించ‌కుండా వారి కంపెనీలను య‌ధేచ్ఛ‌గా న‌డుపుతున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు, అగ్రిక‌ల్చ‌ర‌ల్, ఫార్మా, మెడిక‌ల్ రంగాల‌కు చెందిన ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష కంపెనీలు మాత్ర‌మే న‌డపాల‌ని ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసిన‌ విషయం తెలిసిందే. కాగా, పలు కంపెనీ యాజమాన్యాలు సదరు నిబంధనలను తుంగ‌లో తొక్క‌డం, అధికారులు సైతం ఈ విషయాన్ని లైట్ తీసుకోవ‌డం వారి ప‌నితీరుకు అద్దం ప‌డుతున్న‌ది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్యాకేజీ 16లో భాగంగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని బ‌స్వాపురంలో నిర్మిస్తున్న రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌ను అంత‌రాష్ట్ర కార్మికుల‌తో య‌ధేచ్ఛ‌గా చేయిస్తున్నారు. ఒరిస్సా, మ‌ధ్యప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులను తీసుకొచ్చి, వారితో ప‌నులు చేయిస్తుండ‌టంపై స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పాల‌కీడు వ‌ద్ద‌ సిమెంట్ కంపెనీలో ప‌ని చేస్తున్న బీహార్ కార్మికులు మూడు రోజులుగా ద‌గ్గు, జ‌లుబుతో బాధపడుతుండటంతో మిర్యాల‌గూడ ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ రెండు రోజుల పాటు చికిత్స చేసిన‌ప్ప‌టికీ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ శ్రీ‌నివాస్ సామ్రాట్ క‌రోణా ల‌క్ష‌ణాలుగా అనుమానించి, వారిని ఉగాది రోజున సికింద్రాబాద్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యం వెలుగులోకి రావ‌డంతో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌ల్లో క‌ల‌కలం మొద‌లైంది.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో రైస్‌, సీసం, సున్నం, గ్రానైట్‌, సిమెంట్‌, ప్లాస్టిక్‌, కాట‌న్‌, ఐర‌స్‌, ఫార్మా కంపెనీలు ఐదారు వంద‌ల వ‌ర‌కు ఉంటాయి. న‌ల్ల‌గొండ జిల్లాలోని గుంటూర్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న వాడ‌ప‌ల్లి, దామెర‌చ‌ర్ల‌, వేములప‌ల్లి, సూర్యాపేట జిల్లాలోని మ‌ఠంప‌ల్లి, హుజూర్‌న‌గ‌ర్‌, మేళ్ల‌చెరువు త‌దిత‌ర ప్రాంతాల్లోని ఒక్కో సిమెంట్ కంపెనీలో సుమారు రెండు, మూడు వేల మంది కార్మికులు ప‌ని చేస్తున్నారు. వీటిలో స్థానికులు కేవ‌లం 20 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఉండ‌గా అంత‌రాష్ట్ర కార్మికులు 80 శాతం మందికి పైగా ప‌నిచేస్తుంటారు. బంద్ వ‌ల్ల స్థానికులు ప‌నికి వెళ్ల‌డం లేదు. కానీ ఆ కంపెనీ యాజ‌మాన్యాలు అంత‌రాష్ట్ర కార్మికుల‌తో ర‌న్ చేస్తున్నాయి. మిర్యాల‌గూడ‌, భువ‌న‌గిరి డివిజ‌న్‌లో రైస్‌మిల్లులు అధికం. ఇక్కడ కూడా లేబ‌ర్ ప‌నులకు అంత‌రాష్ట్ర కార్మికులను వాడుకుంటున్నారు. అలాగే భువ‌న‌గిరి, చౌటుప్ప‌ల్‌, న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో సుమారు 100 వ‌ర‌కు ఫార్మా కంపెనీలు విస్త‌రించి ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఒక్కో దాంట్లో ఐదారు వంద‌ల మంది వ‌ర‌కు కార్మికులు ప‌నిచేస్తున్నారు. ఇవేకాక భువ‌న‌గిరి మండ‌లం తుక్క‌పురం శివారులో నెలకొల్పిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గ్లాస్ ఫ్యాక్ట‌రీలో రెండు వేల మందికి పైగా ఉండేందుకు వ‌స‌తి కల్పించడంతో.. బ‌య‌ట ఎలాంటి బంద్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ కంపెనీ యాజమాన్యం పాటించ‌దు. బంద్ పాటించ‌క‌పోవ‌డానికి రాజ‌కీయ ప‌లుకుబ‌డే ప్ర‌ధాన కార‌ణమ‌ని ప్ర‌చారంలో ఉన్న‌ది.

రాష్ట్ర ప్ర‌భుత్వం 26 ర‌కాల కంపెనీల‌ను మాత్ర‌మే న‌డుపుకునేందుకు అనుమ‌తించింది. ప్ర‌జా ఒత్తిడికి త‌లొగ్గి కొన్ని మూత ప‌డ‌గా మ‌రి కొన్ని కంపెనీల ముందు కార్మికులు ధ‌ర్నా చేయ‌డంతో అధికారులు బ‌ల‌వంతంగా మూసివేయించారు. తుక్క‌పురం గ్లాస్ ఫ్యాక్ట‌రీని బంద్ చేయించాల‌ని ఆ గ్రామ స‌ర్పంచ్ నోముల మ‌హేంద‌ర్‌రెడ్డి ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ అందులో మెడిసిన్ ప్యాకింగ్ సంబంధించిన సీసాలు త‌యారువుతున్నందున మిన‌హాయింపు ఇచ్చిన‌ట్టు చెప్పార‌ని ఆయ‌న తెలిపారు. మెడిసిన్ సీసాల సాకు పేరిట ఈ కంపెనీ య‌జ‌మాన్యం త‌న రాజ‌కీయ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించుకొని బంద్ నుంచి మిన‌హాయింపు పొందింద‌న్న ప్ర‌చారం సాగుతోంది.

అంత‌రాష్ట్ర కార్మికుల‌తో స్థానికుల బెంబేలు..

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లావ్యాప్తంగా అనేక ప‌రిశ్ర‌మ‌లు, ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్లో ప‌ని చేయ‌డానికి వ‌చ్చిన అంత‌రాష్ట్ర కార్మికుల‌ను చూసి స్థానిక ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స‌ర్కార్‌, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, ఆరోగ్య సంస్థ‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నా.. వీరు పెడ‌చెవిన పెట్ట‌డ‌మే స్థానికుల ఆందోళ‌నకు ప్ర‌ధాన కార‌ణం. కరోనా భ‌యం వీడేంత వ‌ర‌కు అంత‌రాష్ట్ర కార్మికుల‌ను వారి సొంతూర్ల‌కు పంపించాల‌న్న డిమాండ్ లోక‌ల్ జ‌నం నుంచి వినిపిస్తోంది. ప్రజల డిమాండ్లకు, ఒత్తిడికి అధికారులు, ప్రభుత్వాలు ఎంత మేర‌కు త‌లొగ్గుతాయో వేచి చూడాల్సిందే !

tags : Factories, Nalgonda, ongoing projects, workers from other states, Corona, Lockdown within 24 hours says centre

Tags:    

Similar News