భూపాలపల్లి జిన్నింగ్ మిల్ కేసులో షాకింగ్ ట్విస్టులు..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూపాలపల్లి జిన్నింగ్ మిల్లులో పత్తి మాయం కేసులో ఎన్నో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలకమైన అంశాలను విస్మరించి.. ఆరా తీసే ప్రక్రియ విడ్డూరంగా ఉంది. వాస్తవంగా జిన్నింగ్ మిల్లులో రోజువారి పత్తి కొనుగోళ్లు చేసినప్పుడు సంబంధిత మిల్లు యజమాని డైలీ షీట్స్ సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు పంపించాల్సి ఉంటుంది. మిల్లు యజమాని పంపిస్తేనే మరునాడు పత్తి కొనుగోళ్లకు అనుమతి లభిస్తుంది. ప్రతీ అంశాన్ని అధికారికంగా లెక్కలు చూపిన తరువాతే సీసీఐ పత్తి […]

Update: 2021-05-29 21:17 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : భూపాలపల్లి జిన్నింగ్ మిల్లులో పత్తి మాయం కేసులో ఎన్నో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలకమైన అంశాలను విస్మరించి.. ఆరా తీసే ప్రక్రియ విడ్డూరంగా ఉంది. వాస్తవంగా జిన్నింగ్ మిల్లులో రోజువారి పత్తి కొనుగోళ్లు చేసినప్పుడు సంబంధిత మిల్లు యజమాని డైలీ షీట్స్ సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు పంపించాల్సి ఉంటుంది. మిల్లు యజమాని పంపిస్తేనే మరునాడు పత్తి కొనుగోళ్లకు అనుమతి లభిస్తుంది. ప్రతీ అంశాన్ని అధికారికంగా లెక్కలు చూపిన తరువాతే సీసీఐ పత్తి కొనుగోళ్ల ప్రక్రియకు అనుమతి ఇస్తారని స్పష్టం అవుతోంది. భూపాలపల్లి మిల్లు విషయంలో డైలీ పర్చేసింగ్ షీట్లను ఆధారంగా చేసుకుని కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సీపీఓల కళ్లేదుటే..

పత్తి కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రత్యేకంగా కాటన్ పర్చేజింగ్ ఆఫీసర్లు (సీపీఓ)లను నియమిస్తుంది. సీపీఓల పర్యవేక్షణలోనే పత్తి కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జిన్నింగ్ చేసిన తరువాత పత్తి సీసీఐకి మిల్లర్ అప్పగించాడా.? లేదా అన్న విషయాన్ని సరిచూసుకుంటారు. అంతా సీసీఐ అధికారుల కనుసన్నల్లోనే పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగినప్పుడు జిన్నింగ్ మిల్లు నుండి 4,500 టన్నుల పత్తి ఎలా మాయం అయింది అన్నదే మిస్టరీగా మారింది. మరోవైపున సీసీఐ పత్తి మిల్లుల వారీగా ఆర్డర్ పెట్టే విధానం అమలు అవుతుంటుంది.

ఈ విధానం ప్రకారం తాము ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యామా? లేదా అని చూసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లులో భారీ మొత్తంలో పత్తి ఎలా చోరీకీ గురయింది? సీసీఐ ఆర్డర్‌ను మించి పత్తిని మిల్లర్ కొనుగోలు చేసినట్టయితే.. ఆయన అదనపు పత్తి కొనడానికి కారణాలు ఏంటీ? ఇందుకు సీసీఐ నిబంధనలు వర్తిస్తాయా? అన్న విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక వేళ అదనంగా మిల్లరు పత్తి కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటు ఉన్నట్టయితే పత్తి ఎంతమేర కొనుగోలు చేశారు, ఏ వాహనంలో పత్తి మిల్లుకు చేరింది అన్న వివరాలతో కూడిన గేట్ పాస్ కూడా ఉంటుంది. అలాగే మిల్లులోనే వే బ్రిడ్జి ద్వారా తూకం వేసే పద్దతి ఉంటుంది. కంప్యూటరీకరణతో ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి రికార్డులను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది కదా.

‘టీఆర్’ లే కొంపముంచాయా..?

సాధారణంగా వ్యవసాయ శాఖ అధికారులు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేశారు, సర్వే నెంబర్లు, పాస్‌బుక్ వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ వ్యవసాయ శాఖ రికార్డుల్లో నమోదు కానీ భూముల్లో పత్తి సాగు చేసినట్టయితే ఆ రైతులకు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) విధానం ద్వారా పత్తి అమ్ముకునే అవకాశం కల్పించారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి పత్తి సాగు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన తరువాత టీఆర్ ఇచ్చే ప్రక్రియను ఎందుకు అమలు చేస్తున్నారు. కౌలు రైతుల వివరాలు పొందు పర్చే అవకాశం లేనందున ఈ విధానం అమలు చేస్తున్నారని చెబుతున్నప్పటికీ వాస్తవంగా ఫీల్డ్ తనిఖీ చేసిన తరువాతే పత్తి సాగు అయిందా?.. లేదా అని చూసాక మాత్రమే.. టీఆర్ జారీ చేయాల్సి ఉంటుంది.

అసలు కిటుకు ఇక్కడే మొదలైందని.. టీఆర్ విధానాన్నే అడ్వంటేజ్‌గా తీసుకుని పత్తి దందాకు తెరలేపినట్టుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ నెంబర్లలో ఇచ్చిన సర్వే నెంబరు, శివారు వివరాలను ఆధారంగా చేసుకుని ఆ భూమిలో పత్తి సాగు చేశారా? లేదా అన్న వివరాలు సేకరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తేల్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే టీఆర్ ద్వారా పత్తి అమ్ముకునే వెసులుబాటునే అస్త్రంగా తీసుకుని పత్తి సాగు చేయని భూముల్లోనూ.. సర్టిఫై చేయించుకుని విక్రయాలు జరిపినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌లను ఆధారంగా చేసుకుని సమగ్రంగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది.

పత్తి గింజలు కూడా ఆధారమే..

జిన్నింగ్ మిల్లు యజమాని కొనుగోలు చేసిన పత్తి నుండి గింజలను వేరు చేస్తారు. క్వింటాలు పత్తికి సగటున 67 శాతం గింజలు వస్తాయని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన సదరు మిల్లులో గింజలు ఎన్ని క్వింటాళ్లు సేకరించారో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గింజలను మిల్లు యజమానులు ఆయిల్ మిల్లులకు విక్రయిస్తారు. అధికారికంగానే జరిగే ఈ లావాదేవీలను ఆధారంగా చేసుకున్నా.. పత్తి కొనుగోలు ఎంత మేర జరిగిందో ఇట్టే స్పష్టం అవుతుంది. గత సంవత్సరం కూడా సదరు మిల్లులో పత్తి చోరీకి గురైందని మిల్లరు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. దానిపై విచారణ చేపట్టారు. మిల్లర్ గత సంవత్సరం పత్తి గింజలను ఎన్ని క్వింటాళ్లు విక్రయించాడు, ఏఏ ఆయిల్ మిల్లుకు అమ్మాడు.. అన్న వివరాలను బట్టి గత సంవత్సరం తన మిల్లులో జరిగిన లావాదేవీలను తెలుసుకునే అవకాశం ఉండేది కదా అన్నది అసలు ప్రశ్న.

 

Tags:    

Similar News