అక్కడ స్క్రాప్‌గా మారుతున్న వాహనాలు
దిశ, శేరిలింగంపల్లి: యాక్సిడెంట్‌ల్లో కొన్ని, మద్యం తాగి పట్టుబడ్డ యజమానుల వాహనాలు మరికొన్ని, చోరీ చేసిన వారి వద్ద పట్టుబడ్డ వాహనాలు ఇంకొన్ని ఇలా ఆయా కారణాల వల్ల పట్టుబడ్డ వేలాది వాహనాలు ఇప్పుడు ఆయా పోలీసు స్టేషన్లలో పేరుకుపోయాయి. అందులో చాలా వరకు తుప్పుపట్టిపోగా, కొన్ని మాత్రమే కండీషన్‌లో ఉన్నాయి. వాటిని కూడా తీసుకువెళ్లేందుకు యజమానులు ముందుకు రాకపోవడంతో ఒక్కో పోలీసు స్టేషన్‌లో వేలాది వాహనాలు పడి ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో […]
దిశ, శేరిలింగంపల్లి: యాక్సిడెంట్‌ల్లో కొన్ని, మద్యం తాగి పట్టుబడ్డ యజమానుల వాహనాలు మరికొన్ని, చోరీ చేసిన వారి వద్ద పట్టుబడ్డ వాహనాలు ఇంకొన్ని ఇలా ఆయా కారణాల వల్ల పట్టుబడ్డ వేలాది వాహనాలు ఇప్పుడు ఆయా పోలీసు స్టేషన్లలో పేరుకుపోయాయి. అందులో చాలా వరకు తుప్పుపట్టిపోగా, కొన్ని మాత్రమే కండీషన్‌లో ఉన్నాయి. వాటిని కూడా తీసుకువెళ్లేందుకు యజమానులు ముందుకు రాకపోవడంతో ఒక్కో పోలీసు స్టేషన్‌లో వేలాది వాహనాలు పడి ఉన్నాయి. వాటిని పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో పూర్తిగా పాడయిపోయి స్క్రాప్ గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల అనుమతితో వీటిని తిరిగి యజమానులకు అప్పగించాలి లేదా సరైన ఆధారాలు లేకపోతే వేలం వేయాల్సి ఉంటుంది. కానీ సంబంధిత అధికారులకు మాత్రం అవేమీ పట్టడం లేదు. ఆయా వాహనాల యజమానులే కాదు పోలీసులు, ఆర్టీఏ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటి నిర్వహణ భారంగా మారుతోంది. అన్ని పోలీసు స్టేషన్లలోనూ ఇలాంటి వాహనాలు తుక్కుగా మారిపోతున్నాయి.
కుప్పలుగా పడి ఉన్న వాహనాలు..
శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్, మియాపూర్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లతో పాటు ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలోనూ వివిధ కేసుల్లో పట్టుబడ్డ వేలాది వాహనాలు ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లలో అయితే ఇలా పట్టుబడ్డ వాహనాలను ఉంచేందుకు స్థలం కూడా లేదు. నిబంధనల ప్రకారం వాహనాల పత్రాలు, లైసెన్స్ సమర్పించిన వారికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనాలు నడిపి దొరికిపోయిన వారు, యాక్సిడెంట్ కేసుల్లో బండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారు తిరిగి వాటిని తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో బండ్లను వదులుకుంటున్నారే తప్పా తిరిగి తెచ్చుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారు ఫైన్ కట్టి బండ్లను తీసుకు వెళ్తున్నారని, మిగతా వాళ్లు తీసుకు వెళ్లడం లేదని పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది ఏరోజు పట్టుబడిన వాహనాల తాళాలను ఆరోజు ట్యాగ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఇలా పెట్టిన తాళాలు తుప్పు పట్టి పేరుకుపోయాయి.
పట్టుబడితే తిరిగి తీసుకెళ్లరు..
చోరీకి గురైన వాహనాలతో పాటు మోతాదుకు మించి మద్యం తగి వాహనాలు నడిపిన వారి బండ్లను సీజ్ చేస్తారు. అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి , జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాళ్ల వాహనాలు కూడా పోలీసులు జప్తు చేశారు. 39 సీపీ చట్టం ప్రకారం సీజ్ చేసిన వాహన యజమానులకు మూడు నోటీసులు జారీచేస్తారు. అయినా సదరు యజమాని నుంచి ఎలాంటి స్పందన లేకపోతే పోలీసులు ఆ వాహనాలను వేలం వేస్తారు. ఇలా పట్టుబడ్డ వాహనాలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వేలం వేయాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో వేలం వేయకపోవడంతో ఎక్కడికక్కడే పేరుకు పోయాయి. సీజ్ చేసిన వేలాది వాహనాలదారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ తిరిగి తీసుకోవడానికి నిరాసక్తత కనబరుస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే కొందరు వాహన చోదకులు పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారనే భయంతో తిరిగి వాహనాలు తీసుకోవడం లేదన్నది సమాచారం.
వేలం ప్రక్రియ ఇలా..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల విభాగం పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సీసీఎస్ పోలీసులు సీజ్ చేసిన వాహనాలన్నింటినీ సంబంధిత అధికారులకు అప్పగిస్తారు. వారు ఇలాంటి వాహనాల వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చి కమిషనరేట్ నుంచి ప్రకటన ఇస్తారు. వాహనాలకు సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలున్న వాహనాల యజమానులు, ఏమైనా అభ్యంతరం ఉన్నవాళ్లు ఆర్నెళ్ల లోపు వాటి పత్రాలు తీసుకొస్తే వారి వాహనాలను అప్పజెప్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఆర్నెళ్ల లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా వాహనాలను వేలం వేసేందుకు అనుమతిస్తారు. వేలం వేసే వాహనాలను పూర్తిగా పరిశీలించి ఎంవీఐలు ధర నిర్ణయిస్తారు. ఒకవేళ వాహనం తుక్కుగా మారితే దాన్ని కిలోల లెక్కన విక్రయిస్తారు. ఈసారి వేలం వేస్తే ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది.