లాక్‌డౌన్ 2.0 : ఆర్థిక రంగానికి మినహాయింపు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ కాలంలో ఎక్కడివారక్కడే ఇంటికే పరిమితమయ్యారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైతే.. తిరిగి గాడిన పెట్టొచ్చు కానీ ప్రాణాలు పోతే ఎలా? అని ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే, కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతుండటంతో లాక్‌డౌన్ పొడిగించాలనే రాష్ట్ర ప్రభుత్వాలు సహా పలువురు నిపుణులు కేంద్రాన్ని కోరాయి. మంగళవారం ఉదయం ప్రధాని మోడీ ఇదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ కాలంలో ఎక్కడివారక్కడే ఇంటికే పరిమితమయ్యారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైతే.. తిరిగి గాడిన పెట్టొచ్చు కానీ ప్రాణాలు పోతే ఎలా? అని ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే, కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతుండటంతో లాక్‌డౌన్ పొడిగించాలనే రాష్ట్ర ప్రభుత్వాలు సహా పలువురు నిపుణులు కేంద్రాన్ని కోరాయి. మంగళవారం ఉదయం ప్రధాని మోడీ ఇదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. 21 రోజుల లాక్‌డౌన్‌తో రాబడికి గండిపడటం.. ఖజానా ఖళీ అవుతుండటంతో.. రెండో సారి లాక్‌డౌన్ (లాక్‌డౌన్ 2.0) అమలు చేసినా కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు మినహాయింపులనివ్వాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, కరోనా కేసులు నమోదవుతున్న పట్టణ ప్రాంతాల్లో మాత్రం లాక్‌డౌన్ కఠినంగా అమలుకాబోతున్నట్టు తెలిసింది.
లాక్-ఇన్ స్ట్రాటజీ:
సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ.. ప్రాణాలతో పాటు ఆర్థికంగా ఊతమిచ్చే రంగాల సేవలకు కట్టుబడి ఉన్నట్టు సంకేతాలనిచ్చారు. దీంతో రెండో దశ లాక్‌డౌన్ అమలైతే.. అందులో కరోనా కట్టడి కోసం సామాజిక దూరం లాంటి నిబంధనలతో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు ఉండనుంది. కాగా, రాష్ట్రాల రాబడి 50 నుంచి 75శాతం వరకు తగ్గిపోయాయని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 15 నుంచి లాక్‌డౌన్ అమలైనా.. ఆర్థికానికి ఊతమిచ్చే పలురంగాలను కేంద్రం మినహాయించనున్నట్టు ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం అందుతున్నది. వ్యవసాయం, ఫ్యాక్టరీలు, సరుకుల రవాణాకు మినహాయింపులనివ్వనుంది. సాగుకు, పంట కొనుగోళ్లకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. వీలైతే.. రైతుల వద్దకే వెళ్లి పంట కొనుగోలు చేసే వ్యూహంపై ఆలోచనలు చేస్తున్నది. అలాగే, కార్గో సేవలు దేశవ్యాప్తంగా నడుస్తాయి. చేపల వేటకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉండనుంది. ఫ్యాక్టరీలు పనులు మొదలు పెట్టినా.. వర్కర్లను పనిచేసే ప్రాంతాల్లోనే అకామడేట్ చేయాలి. పనిచేసే చోటా సామాజిక దూరాన్ని పాటించే చర్యలు తీసుకోవాలి. ఇదే లాక్-ఇన్ స్ట్రాటజీ. ప్రధాని మోడీనే ఈ స్ట్రాటజీని సూచించినట్టు కొన్ని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అలాగే, వలస కార్మికులను క్యాంపుల నుంచి తిరిగి ఫ్యాక్టరీలకు తరలించనున్నారు. ప్రత్యేక బస్సులు, ట్రైన్‌ల ద్వారా కార్మికులను తిరిగి కర్మాగారాలకు పంపించనున్నట్టు వివరించాయి. అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం.. ఆదివారం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. గోడౌన్‌లు, కోల్డ్ స్టోరేజీ ఏ ఉత్పత్తులనైనా నిల్వ చేసుకునేందుకు ఉపయోగించాలని ఆదేశించడం గమనార్హం.
జోన్‌ల వారీగా విభజించి కరోనా కట్టడి!
కరోనా కేసుల సంఖ్యను బట్టి ఆయా ప్రాంతాలను జోన్‌లుగా విభజించేందుకు కేంద్రం యోచిస్తున్నది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటే రెడ్ జోన్‌గా, స్వల్పంగా ఉంటే ఆరెంజ్ జోన్‌గా, ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్‌లుగా విభజించనుంది. అయితే, వ్యవసాయ పనులకు మాత్రం ఏ జోన్‌లోనైనా మినహాయింపు ఉంటుంది. ఏ రంగాలకు ఏ మేరకు మినహాయింపులనివ్వాలన్న విషయాలపై కసరత్తులు జరిగినట్టు సమాచారం అందింది. అయితే, కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులనిచ్చినా.. ఢిల్లీ, ముంబయి లాంటి నగర ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్ అమలు కానున్నది.
Tags: lockdown, extension, likely, pm modi, address, announcement