మట్టి నుంచి ఇసుక వెలికితీత

దిశ, కోరుట్ల: సొంత ఇళ్లు నిర్మించాలనుకుంటున్నారా..? ఇసుక దొరకడం లేదని బాధ పడుతున్నారా..? అయితే మీరు వెంటనే మెట్‌పల్లికి రండి.. ఇలా చెప్పగానే అలా ఇసుక తీసుకొస్తారు. వాగులు, వంకలు, నదుల నుంచి ఇసుక తెస్తున్నారేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టేనండోయ్. మట్టి నుంచి దర్జాగా ఇసుకను వెలికి తీస్తున్నారు. ‘తిమిడి ఇసుక నుండి నూనె రాబట్టవచ్చు’ అన్న సామెతకు తగ్గట్లుగా ఇసుకను తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారు వ్యాపారులు. సొంతిళ్లు కట్టుకోవాలన్న లక్ష్యంతో రూపాయి […]

Update: 2021-02-13 20:46 GMT

దిశ, కోరుట్ల: సొంత ఇళ్లు నిర్మించాలనుకుంటున్నారా..? ఇసుక దొరకడం లేదని బాధ పడుతున్నారా..? అయితే మీరు వెంటనే మెట్‌పల్లికి రండి.. ఇలా చెప్పగానే అలా ఇసుక తీసుకొస్తారు. వాగులు, వంకలు, నదుల నుంచి ఇసుక తెస్తున్నారేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టేనండోయ్. మట్టి నుంచి దర్జాగా ఇసుకను వెలికి తీస్తున్నారు. ‘తిమిడి ఇసుక నుండి నూనె రాబట్టవచ్చు’ అన్న సామెతకు తగ్గట్లుగా ఇసుకను తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారు వ్యాపారులు. సొంతిళ్లు కట్టుకోవాలన్న లక్ష్యంతో రూపాయి రూపాయి కూడగట్టుకుని డబ్బు దాచుకున్న వారి పాలిట దేవుళ్లలా కనపడుతున్నా.. అసలు విషయం తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే..

డిమాండ్ ఉండడంతో..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని వేంపేట, ఆరపేట, చింతలపేట, సింగాపూర్ గ్రామాల్లో ఇసుక తయారీ కేంద్రాలు మూడు ట్రాక్టర్లు ఆరు ట్రాలీలుగా వర్దిల్లుతున్నాయి. మార్కెట్లో ఇసుక డిమాండ్ విపరీతంగా ఉండడంతో అక్రమార్కులు దర్జాగా మట్టి నుంచి ఇసుకను తయారు చేస్తున్నారు. ఇందుకోసం పట్టా భూముల్లోని మట్టిని సేకరించి, నీటితో కలిపి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్లలో వేసి మిక్స్ చేస్తారు. నిరంతరం ఈ విధంగా మట్టిని మిక్సింగ్ చేయడం వల్ల ఇసుకగా రూపం దాల్చిన మట్టిని విక్రయిస్తున్నారు.

ట్రాలీల్లోనే ఇసుక తయారీ..

మరో వైపు ట్రాక్టర్ ట్రాలీల్లోకి సేకరించిన మట్టిపై వాటర్ ప్రెషర్ వాడుతున్నారు. కొద్దిసేపటి తరువాత ట్రాలీలో మిగిలిన ఇసుకను అమ్మకానికి పెడుతున్నారు. నిత్యం వంద వరకూ ట్రాక్టర్లు ఈ విధానంతో ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

బిల్డింగ్‌ నాణ్యతపై అనుమానాలు

మట్టి నుంచి సేకరిస్తున్న ఇసుకతో భవనాలను నిర్మించుకోవడానికి సాహసిస్తున్న యజమానులు అసలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిక్సింగ్ యూనిట్, ట్రాలీలో వాటర్ ప్రెషర్ పద్ధతుల ద్వారా వెలువడుతున్న ఇసుకలో పెద్ద సైజు గులక రాళ్లు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే సహజసిద్ధంగా ప్రవాహం ఉన్న నదులు, వాగులు, వంకల్లో సేకరించే ఇసుక క్వాలిటీతో పోలిస్తే ఇది ఏ మాత్రం సరితూగదని ఇంజినీర్లు చెప్తున్నారు. గులక రాళ్ల వల్ల ఇంటి గోడలు, రూఫ్‌లలో రంధ్రాలు ఏర్పడతాయని, దీనివల్ల అవి బలహీనంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. అయితే అత్యవసరంగా ఇసుక కావాలనుకున్న ఇంటి యజమానులకు అసలు ఇసుకేఅని నమ్మించి విక్రయిస్తున్నారు వ్యాపారులు.

ధర కూడా ఎక్కువే..

అయితే మెట్‌పల్లి ప్రాంతంలో మట్టి నుండి సేకరిస్తున్న ఇసుక ధర కూడా సాధారణ ఇసుకను మించే ఉండడం గమనార్హం. ఫస్ట్ గ్రేడ్ ట్రాక్టర్ ఇసుకకు రూ. 6,500, సెకెండ్ గ్రేడ్ ఇసుకకు రూ. 5 వేల వరకూ విక్రయిస్తున్నారు. నదుల నుంచి సేకరించి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న ఇసుకకే రూ. 4 వేల ధర పలుకుతుంటే నాణ్యత లేని మట్టి నుంచి సేకరిస్తున్న ఇసుక ధర మాత్రం అంతకు ఎక్కువే ఉండడం గమనార్హం.

అధికారుల చోద్యం..

సాండ్ మేడ్ మాఫియా అడ్డగోలు వ్యవహారాన్ని నిలువరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఇసుక తయారీ కోసం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అక్రమంగా ఇసుక తయారు చేస్తున్న ఈ మాఫియాను కట్టడి చేసేందుకు కూడా అధికారులు దృష్టి సారించకపోవడం విస్మయం కలిగిస్తోంది.

చర్యలు తీసుకున్నాం..

మట్టి నుంచి ఇసుక తయారు చేస్తున్న వారిపై గతంలో కేసులు నమోదు చేశాం. వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సమాచారం ఇవ్వండి. అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని అక్రమ ఇసుక మాఫియా బాహాటంగా చెప్తుండడం అవాస్తవం.

-రాజేశ్, తహసీల్దార్, మెట్‌పల్లి

Tags:    

Similar News