మిషన్ భగీరథ పైపుల్లో ‘సాల్మొనెల్లా టైఫి’ బ్యాక్టీరియా.. ఆందోళనలో వైద్యులు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మిషన్ భగీరథ ద్వారా ‘టైఫాయిడ్ ’వ్యాప్తి చెందుతోంది. రిజర్వాయర్ల నుంచి శుద్ధి చేసిన నీటిని ఇళ్లకు తరలించేందుకు ఏర్పాటు చేసిన పైపుల లీకేజ్‌లతో టైఫాయిడ్‌కు కారకమైన ‘సాల్మొనెల్లా టైఫి’ బ్యాక్టీరియా స్పటికల్స్ ఆ నీటిలో కలుస్తున్నట్లు తెలంగాణ వాటర్ రీసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. […]

Update: 2021-09-08 19:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మిషన్ భగీరథ ద్వారా ‘టైఫాయిడ్ ’వ్యాప్తి చెందుతోంది. రిజర్వాయర్ల నుంచి శుద్ధి చేసిన నీటిని ఇళ్లకు తరలించేందుకు ఏర్పాటు చేసిన పైపుల లీకేజ్‌లతో టైఫాయిడ్‌కు కారకమైన ‘సాల్మొనెల్లా టైఫి’ బ్యాక్టీరియా స్పటికల్స్ ఆ నీటిలో కలుస్తున్నట్లు తెలంగాణ వాటర్ రీసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని చోట్ల రిపేర్లు చేసినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో లీకేజ్‌లను పసిగట్టలేకపోతున్నామన్నారు. పైగా వర్షాల కారణంగా వచ్చే వరదలతో లీకేజ్‌లను గుర్తించడం తమ సిబ్బందికీ కష్టమవుతుందని ఆయన చెప్పడం గమనార్హం.

వానం కాలం ప్రారంభం కాకముందే ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు ఆయన వెల్లడించారు. కానీ వేగంగా మరమ్మతులు నోచుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని ఆయన ఆఫ్ ది రికార్డులో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నీటిలోని బ్యాక్టీరియాలను నశింపచేసేందుకు బ్లీచింగ్ కలుపుతున్నప్పటికీ పైపుల లీకేజ్‌లతో వృథా అవుతుందన్నారు. దీంతోనే గతంతో పోల్చితే ఈ సారి టైఫాయిడ్ జ్వరాలు పెరిగినట్లు డాక్టర్లు వివరిస్తున్నారు.

ఆరు లక్షల మందికి జ్వరాలు

రాష్ర్ట వ్యాప్తంగా ప్రజలంతా జ్వరాలతో అల్లాడుతున్నారు. వర్షాలు కారణంగా వృద్ధి చెందిన దోమలతో మలేరియా, డెంగీ వ్యాప్తి చెందుతుంటే, కలుషిత నీరు, ఆహారంతో టైఫాయిడ్, వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా ఏకంగా ఆరు లక్షల మంది వివిధ రకాల జ్వరాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఫ్యామిలీ డాక్టర్లు, సెల్ఫ్ ట్రీట్మెంట్‌తో నమోదుకానీ బాధితుల సంఖ్య కూడా రెట్టింపు స్థాయిలో ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో సగటున ప్రతీ ఇంట్లో ఒక వ్యక్తి జ్వర లక్షణాలతో బాధపడుతున్నారు.

శాఖల మధ్య సమన్వయం ఏది..?

వ్యాధుల నియంత్రణకు కృషి చేయాల్సిన శాఖల మధ్య సమన్వయం లేదు. రోగాలపై అవగాహన కల్పించాల్సిన వైద్యాశాఖ, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం కరవైనది. దీంతో ప్రజలపై రోగాలు దాడి చేస్తున్నాయి. దోమల నియంత్రణ కార్యక్రమాలేవీ కానరావడం లేదు. దీంతో పాటు టైఫాయిడ్‌కు 85 శాతం కారణమైన కలుషిత నీటిని అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బ్యాక్టీరియా కలుస్తుందని ముందస్తుగా హెచ్చరించినప్పటికీ, ఏ మాత్రం నివారణ చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వ పనితీరును గమనించవచ్చు. తద్వారా ప్రజలపై వ్యాధులు దండయాత్రకు దిగాయి. మరో మూడు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

వేడి ఆహారం, నీళ్లు తీసుకోవాలి

సీజనల్ వ్యాధుల ప్రబలే పరిస్థితులున్నందున ప్రతీ రోజు వేడి చేసిన నీళ్లు, ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వర్షాల నేపథ్యంలో నీళ్లు ఎక్కువగా కలుషితమవుతాయి. ఇది చాలా ప్రమాదం. ‘సాల్మొనెల్లా టైఫి’ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే ఉదర సమస్యలు అధికంగా వస్తాయి. అంతేగాక పేగు నాళాల ఇన్ ఫెక్షన్ కూడా వస్తుంది. కావున పరిసరాల పరిశుభ్రంతో పాటు దోమలు, ఈగలు వృద్ధిని అడ్డుకోవాలి. ముఖ్యంగా కలుషిత నీటిని తీసుకోవద్దు.
-డాక్టర్ సంజయ్ రెడ్డి, ఫార్మా కౌన్సిల్ మెంబర్

ఇవి కూడా చదవండి:

ఆపిల్‌.. చెర్రీ.. ఏ పండు కావాలి.. కోడ్ భాషలో వాట్సాప్ హైటెక్ వ్యభిచారం

హిందువుల పండుగ‌ల‌ప్పుడే కాలుష్యం గుర్తుకొస్తుందా?

Tags:    

Similar News