పైలట్ ‘రాజీ’ కీయం!

న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయం ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 14న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు కథ సుఖాంతం కానున్నది. రెబల్ శిబిరం రాజీకి వస్తుండటంతో దాదాపు నెలరోజుల హైడ్రామాకు ఫుల్‌స్టాప్ పడనుంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబావుటా జెండా ఎగరేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సొంత గూటికి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఢిల్లీలో సుమారు మూడు […]

Update: 2020-08-10 11:25 GMT

న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయం ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 14న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు కథ సుఖాంతం కానున్నది. రెబల్ శిబిరం రాజీకి వస్తుండటంతో దాదాపు నెలరోజుల హైడ్రామాకు ఫుల్‌స్టాప్ పడనుంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబావుటా జెండా ఎగరేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సొంత గూటికి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఢిల్లీలో సుమారు మూడు గంటలపాటు పైలట్ భేటీ అయ్యారు. తెరమరుగులు లేకుండా ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా సచిన్ పైలట్, రాహుల్ గాంధీలు మాట్లాడుకున్నారు. పైలట్ లేవనెత్తిన సమస్యలను ఆలకించిన రాహుల్ గాంధీ వాటి పరిష్కారానికి హామీనిచ్చారు.

కాంగ్రెస్‌కు కట్టుబడి ఉంటానని ఈ భేటీలో సచిన్ పైలట్ స్పష్టంచేశారు. పార్టీకి సేవలందిస్తారని చెప్పినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్నాళ్లుగా సచిన్‌తో టచ్‌లో ఉన్న ప్రియాంక గాంధీ ఈ భేటీలో కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. సమావేశానంతరం సచిన్ లేవనెత్తిన సమస్యలు, రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించారు. ఈ కమిటీ ఏర్పాటు కోసం సచిన్ పైలట్ సీనియర్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. సచిన్ పైలట్ తన మద్దతుదారులతో సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌తో సమావేశమయ్యారు. ప్రియాంక గాంధీ ఇక్కడకు చేరుకున్నారు. నెల కిందట రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేస్తూ 18 ఎమ్మెల్యేలతో అప్పటి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ రాష్ట్రాన్ని వీడిన సంగతి తెలిసిందే. గెహ్లాట్, పైలట్‌ల మధ్య వైరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలను అధిష్టానం క్షమిస్తే తామూ స్వాగతం పలుకుతామని సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించిన రోజుల వ్యవధిలోనే ఈ భేటీ జరగడం గమనార్హం.

రాజీ ప్రక్రియ పూర్తయ్యాక రెబల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోబోదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు, పైలట్ శిబిరంలోని ఇద్దరి క్యాబినెట్ మంత్రుల హోదా తొలగించిన సంగతి తెలిసిందే. వారికీ ఆ హోదాలను తిరిగి కట్టబెడుతుందని, వెంటనే కాకున్నప్పటికీ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ చేపడుతుందని వివరించాయి. పైలట్ క్యాంపు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్‌లో తమ పాత్రలు తమకుంటాయని పేర్కొన్నాయి. అయితే, సచిన్ పైలట్‌పై మాత్రం అనిశ్చిత కొనసాగుతున్నది. రాజస్తాన్‌లో సీఎం సీటు షేరింగ్ గురించి సచిన్ భేటీలో లేవనెత్తినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. రెండున్నరేళ్లు తనను సీఎం చేస్తారన్న కాంగ్రెస్ హామీని గుర్తుచేసినట్లు వివరించాయి. అయితే, అందుకు ఆయన డెడ్‌లైన్ పెట్టలేదని పేర్కొన్నాయి. పరిస్థితులు చక్కబడేవరకు సచిన్ పైలట్ సెంట్రల్ లీడర్షిప్‌లో కొనసాగుతారని ఇంకొన్ని వర్గాలు వెల్లడించాయి. సచిన్ పైలట్ పాత్రపై సోనియా గాంధే నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి.

గెహ్లాట్ చెంతకు రెబల్స్..

రాహుల్‌తో సచిన్ భేటీ జరుగుతుండగానే రెబల్ ఎమ్మెల్యేలు సొంతగూటికి ప్రయాణం కట్టారు. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ జైపూర్ విచ్చేసి సీఎం అశోక్ గెహ్లాట్‌ను కలిశారు. గెహ్లాట్‌తో కక్షలేమీ లేవని, తామంతా కాంగ్రెస్ కుటుంబంలో భాగమని, గెహ్లాట్ సర్కారు సురక్షితంగా ఉన్నదని భన్వర్‌లాల్ వ్యాఖ్యానించారు. మరో రెబల్ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ఒలా కూడా తిరుగుపయనమయ్యారు.

ఇకనైనా ప్రజలకు సేవ చేయండి : బీజేపీ

రాజస్తాన్ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ అంతర్గత కలహాలేనని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, బీజేపీపై అనవసరంగా నిందలు వేశారని రాష్ట్ర బీజేపీ యూనిట్ చీఫ్ సతిష్ పూనియా తెలిపారు. వీరి డ్రామాను రాజస్తాన్ 31 రోజులు చూడాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ ఆలస్యంగా మేల్కొన్నారని విమర్శించారు. ‘ఇప్పుడు మీ సమస్య పరిష్కృతమైంది కదా. ప్రజలకు క్షమాపణలు చెప్పి ఇకనైనా వారికి సేవలు చేయండి’ అని పేర్కొన్నారు.

మళ్లీ ఫోకస్‌లోకి రాహుల్..

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలిగిన తర్వాత మధ్యంతర అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు తీసుకుని ఏడాది గడిచింది. శాశ్వత చీఫ్ దొరికే వరకు మధ్యంతర అధ్యక్షురాలిగా ఆమెనే కొనసాగనున్నారు. కాగా, కాంగ్రెస్‌లోనూ పర్మినెంట్ చీఫ్ కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కాగా, సచిన్ పైలట్‌తో సమావేశమై రాహుల్ గాంధీ రాజస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినట్టైంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ రాహుల్ గాంధీ తెరమీదికి రావడం వెనుక అధ్యక్షుడిగా మళ్లీ బాధ్యతలు తీసుకునే వ్యూహమున్నదని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News