‘రైతుబంధు’కు ఎదురుచూపులు

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగికి రైతుబంధు సాయం 27 నుంచి ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబరు నెలలోనే సాయం అందాల్సి ఉన్నా నెల రోజులపాటు ఆలస్యం జరిగింది. సాగుకు ముందే పెట్టుబడి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే సుమారు ఏడు లక్షల ఎకరాలలో నాట్లు మొదలయ్యాయి. అకాల వర్షాలతో రెండు నెలల క్రితం పంటను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పంటల […]

Update: 2020-12-16 22:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగికి రైతుబంధు సాయం 27 నుంచి ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబరు నెలలోనే సాయం అందాల్సి ఉన్నా నెల రోజులపాటు ఆలస్యం జరిగింది. సాగుకు ముందే పెట్టుబడి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే సుమారు ఏడు లక్షల ఎకరాలలో నాట్లు మొదలయ్యాయి. అకాల వర్షాలతో రెండు నెలల క్రితం పంటను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పంటల బీమా పరిహారం కూడా రాలేదు. అప్పో సప్పో చేసి రైతులు యాసంగి సాగు మొదలుపెట్టారు. కరోనా కష్టకాలంలో వానాకాలం సన్న వడ్లను వేసిన రైతులు గిట్టుబాటు ధర రాక నష్టపోయారు. ఆర్థిక వనరులు లేకున్నా అప్పులు చేసుకుని పనులకు దిగారు.

ఆశ..నిరాశ

ఎకరానికి ఐదు వేల సాయం ఎప్పుడొస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. పది రోజుల తర్వాత వస్తుందని సీఎం స్వయంగా చెప్పడంతో ఆశతో ఉన్నారు. తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు డబ్బులను డిపాజిట్ చేసే ప్రక్రియ పది రోజుల పాటు సాగనుంది. రైతుబంధుకు సుమారు రూ. 7,300 కోట్లు అవసరమవుతాయని భావించిన ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఉద్యోగులకు జీతాలు రెడీ చేసే సమయంలోనే రైతుబంధు కూడా రావడంతో నిధుల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు లేక ఆదాయం పడిపోయింది. పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయం, ద్రవ్య సంస్థల నుంచి తెచ్చుకున్న అప్పుల ద్వారా సర్దుబాటు చేస్తున్నారు. మునుపటి కంటే ఈ సంవత్సరం భారీ స్థాయిలో అప్పులు చేసిన ప్రభుత్వం రైతుబంధు నిధుల కోసం నానా తిప్పలు పడుతోంది. గతంలో కొందరు రైతులకు సాంకేతిక కారణాలతో సాయం అందలేదు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న అసంతృఫ్తి రైతాంగం వరకూ వెళ్లకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అందుకే అప్పులు తీసుకొచ్చయినా రైతుబంధు జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags:    

Similar News