బస్‌షెల్టర్లు లేక.. సిటీలో ఇక్కట్లు

దిశ, హైదరాబాద్: ప్రభుత్వం దృష్టిలో హైదరాబాద్ ఒక విశ్వనగరం. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చిన్పపుడు రోడ్లు ధగధగా మెరుస్తాయి. ఎయిర్ కండిషన్డ్ బస్టాపులూ కనిపిస్తాయి. ఇది ఒక పార్శ్వం. మరొక పార్శ్వమూ ఉంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కనిపించే బస్టాపులు కొన్ని వందలున్నాయి. కొన్ని రూట్లలో అయితే, అసలు బస్సులు తిరగకున్నా బ్రహ్మాండంగా బస్టాపులు ఉండి అవసరమైన చోట బస్టాపులు లేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు సరైన వసతులు […]

Update: 2020-03-11 07:18 GMT

దిశ, హైదరాబాద్: ప్రభుత్వం దృష్టిలో హైదరాబాద్ ఒక విశ్వనగరం. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చిన్పపుడు రోడ్లు ధగధగా మెరుస్తాయి. ఎయిర్ కండిషన్డ్ బస్టాపులూ కనిపిస్తాయి. ఇది ఒక పార్శ్వం. మరొక పార్శ్వమూ ఉంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కనిపించే బస్టాపులు కొన్ని వందలున్నాయి. కొన్ని రూట్లలో అయితే, అసలు బస్సులు తిరగకున్నా బ్రహ్మాండంగా బస్టాపులు ఉండి అవసరమైన చోట బస్టాపులు లేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు సరైన వసతులు కల్పించడంలో ఇటు జీహెచ్ఎంసీ, అటు ఆర్టీసీ సంస్థ ఘోరంగా విఫలమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఆర్టీసీ సేవలు నిజాం కాలం నుంచే అందుబాటులో ఉన్నా..ప్రయాణికులకు మాత్రం మెరుగైన సేవలు అందడం గగనంగా మారింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రేటర్‌లో మొత్తం 1,050 రూట్లలో 2,350 బస్టాప్‌లు ఉన్నాయి. వీటిలో 1,250 బస్టాపుల్లో మాత్రమే బస్‌షెల్టర్లు ఉన్నట్టు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. మిగతా 1,100 బస్టాపుల్లో షెల్టర్లు లేక ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ బస్టాపుల్లో 800 చోట్ల షెల్టర్లను జీహెచ్ఎంసీ నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ, వాటిలో జీహెచ్ఎంసీ నిర్మాణం చేసింది అంతంత మాత్రమే. అత్యధికంగా నగర శివారు ప్రాంతాల్లోనే బస్ షెల్టర్లు లేకుండా ఉన్నాయి. ఇదే సమస్య నగరంలోనూ అక్కడక్కడా కన్పిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరాపార్కు రూటులో జవహర్ నగర్, అశోక్ నగర్ బస్టాపుల వద్ద షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చెట్ల నీడలనే బస్ షెల్టర్లుగా చేసుకుంటున్నారు ప్రయాణికులు.

రోజూ 42 వేల ట్రిప్పులు..

హైదరాబాద్ మహానగరంలో 29 బస్సు డిపోలలో 3,798 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులన్నీ రోజూ సుమారు 42 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 9.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ నగరంలోని కోటి మంది జనాభాలో 34 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చుతాయి. ఆర్టీసీ సమ్మె, నష్టాల సాకుతో యాజమాన్యం ఇప్పటికే కాలం చెల్లిన బస్సుల పేరిట 1500 బస్సులను నిలిపేసింది. ఫలితంగా సరైన సమాయానికి బస్సులు రాక, రోజులో తిరగాల్సిన ట్రిప్పులు తిరగకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగర వాసులు రాత్రి 12 గంటల వరకూ ఉద్యోగ‌రీత్యా లేదా తమ తమ పనులను చక్కబెట్టుకోవడం కోసం రహదారుల వెంట తిరుగుతూనే ఉంటారు. ఈ సమయంలో రాత్రి 9 గంటలు దాటితే ప్రజలు తమ గమ్యానికి చేరాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తోంది.

బస్సులు తిరగకున్నా.. షెల్టర్లు..

జీహెచ్ఎంసీ పరిధిలో బస్సు రూటు ఉండి కూడా బస్టాపుల వద్ద షెల్టర్లు లేకపోవడం ఓ వైపున ఉన్న సమస్య అయితే, మరో వైపు బస్సు రూటు లేకున్నా.. ఆ వైపుగా బస్సులు తిరుగకున్నా బస్సు షెల్టర్లు మాత్రం పక్కాగా ఉంటున్నాయి. సచివాలయం సమీపంలోని ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో అసలు బస్సులే తిరగవు. కానీ, ఈ ప్రాంతంలో మాత్రం బస్సు షెల్టర్లు పక్కాగా ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? యాడ్ ఏజెన్సీలు ఈ ప్రాంతంలో పలు వ్యాపార సంస్థల ప్రకటనలతో సొమ్ము చేసుకోవడానికి మాత్రమే. కేవలం ఈ బస్సు షెల్టర్లు యాడ్‌ల ద్వారా రెవెన్యూ ఆర్జించడానికే. వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం ఆర్జించే ఆర్టీసీ సంస్థ లాభాల్లో కాకుండా నష్టాల్లో ఉందనే సాకుతో బస్సులను తగ్గించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో బస్సు షెల్టర్లు లేనందున ప్రయాణీకులు ఆర్టీసీ బస్టాపుల్లో కాకుండా, ఎక్కడ నీడ ఉంటే అక్కడే తలదాచుకోవాల్సి వస్తోంది. బస్సు రాగానే ఉరుకులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Tags: bus shelters, tsrtc, hyd city, rtc, ghmc

Tags:    

Similar News