‘ఏనుగు’ ఎక్కి ప్రగతి భవన్‌కు వస్తా.. కేసీఆర్‌కు RS ప్రవీణ్ కుమార్ కౌంటర్
దిశ, కామారెడ్డి : రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నాయకుల నుంచి సీఎం సీటును గుంజుకుని తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తామని మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు వస్తామని చెప్పారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఎస్పీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య […]
దిశ, కామారెడ్డి : రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నాయకుల నుంచి సీఎం సీటును గుంజుకుని తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తామని మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు వస్తామని చెప్పారు.
సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఎస్పీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్రియల్ బైపాస్ వద్ద గల సామాన్య హోటల్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు ప్రవీణ్ కుమార్‌కు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలతో కామారెడ్డి.. ‘నీలిరెడ్డి’ పట్టణంగా మారిందన్నారు. తాను రాగానే ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోటో దిగి ఆ ఫోటో స్టేటస్ పెట్టగానే అక్కడి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆ యువకుడు తెలిపాడని పేర్కొన్నారు.
‘అయ్యా జీవన్ రెడ్డి గారు.. దాదాగిరి నీ ఒక్కడికే తెల్వది అన్నా.. మాకు కూడా తెలుసు. మీది కారు.. మాది ఏనుగు. ఇటువంటివి మస్తుగా చూసినం. నీ బెదిరింపులకు భయపడం. నేను రాజీనామా చేయగానే నాపై కేసులు పెడితేనే భయపడలేదు. ఈ చిల్లర బెదిరింపులకు భయపడతామా’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వడ్రంగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ర్యాలీగా వచ్చేటప్పుడు వండ్రంగి సోదరులు కలిశారని, ఇటీవల ఒకరికి కరోనా వస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో 16 లక్షలు బిల్లు కట్టినట్టు చెప్పారని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులు బాగుంటే.. అక్కడ చికిత్సలు బాగుంటే మీరు ఉస్మానియాకు ఎందుకు వెళ్లలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల్లో దళితులకు ఏమి చేశారని ప్రశ్నించారు. మూడెకరాల భూమి అంటూ 10 వేల ఎకరాలు మాత్రమే పంచారని, ఎస్సీ కార్పొరేషన్ అంటూ కేవలం 30 శాతం నిధులే ఇచ్చారని తెలిపారు. ఏడేళ్లలో దళితులను బిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు దళితబంధు పేరుతో 10 లక్షలు ఇస్తామంటున్నారని, మీ మాటలను ఎవరు నమ్ముతారు కేసీఆర్ గారు అంటూ ప్రశ్నించారు. యూనివర్సిటీలు కావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య కావాలని అడుగుతున్నామని తెలిపారు. మీరేమో అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలు ఇచ్చారని, ఒక్క రోజైన ప్రభుత్వ యూనివర్సిటీల్లో రివ్యూ చేశారా.? అని నిలదీశారు. 7 సంవత్సరాల కాలంలో యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత తీర్చలేదని, 2500 కోర్సులకు వేకెన్సీలు ఉంటే కేవలం 750 మాత్రమే భర్తీ చేశారని చెప్పారు.
40 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వందల వేల ఉద్యోగాలు రిక్రూట్ చేయాల్సి ఉందన్నారు. 50 వేల నోటిఫికేషన్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారని, 2018 నుంచి 2021 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. రెండున్నర లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడతామని చెప్పారని, కట్టిన ఇండ్లు ఇవ్వకుండా శిథిలావస్థకు చేర్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రోజుకో డ్రామాకు తెర తీస్తుందన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసి అక్కడున్న 15-20 వేల ఎకరాలను కబ్జా చేసి కార్మికులను రోడ్డున పడేశారని విమర్శించారు.
ఇక్కడి బీజేపీ ఎంపీ అరవింద్ రైతులకు కావాల్సిన పసుపు బోర్డు తేవడంలో విఫలమయ్యాడని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుందన్నారు. ఆరు లక్షల కోట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా ఎంత అని ప్రశ్నించారు. మీ గుండెల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేరని, కేవలం అంబానీ, అదాని, టాటా బిర్లాలు మాత్రమే ఉన్నారని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తున్నామని, వారితో పోరాడుతున్నామని టీఆర్ఎస్ మంత్రులు చెప్తున్నారని, ఆరు లక్షల కోట్ల ఆస్తులను అమ్మాలని బీజేపీ చూస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
రాజకీయాల్లో అక్రమంగా సంపాదించి వేలు, లక్షల కోట్లకు పడగలెత్తిన వారు ఎన్నికల ముందు ఆ డబ్బుతో ఓటును కొనుక్కుంటున్నారని ఆరోపించారు. 500 కోట్లతో సచివాలయం కడుతున్నారని, ఎవరు కట్టమన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కులాల వారీగా అనేక ఉద్యమాలు చేశారని, ఒక్కరు కూడా ఓటు చైతన్యంపై కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఆ చైతన్యం బీఎస్పీ చేస్తుందని చెప్పారు.
తాను సీఎం కావడానికి రాజకీయాల్లోకి రాలేదని, మీ బిడ్డలను, మిమ్మల్ని సీఎం చేయడానికే తాను వచ్చానని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు బీఎస్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రాష్ట్ర కో ఆర్డినేటర్లు గంగాధర్, మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహతి రమేష్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు గంగాధర్, బాలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.