మంత్రి ఇలాకాలో గమ్మత్తు.. బాత్‌రూమ్స్‌లలో రివర్స్ వస్తోన్న మురుగునీరు

దిశ, జల్​పల్లి: ఇంటి వాకిట్లో ముగ్గు వేయలేని పరిస్థితి… ఆ వీధుల్లో వినాయక విగ్రహాల మండపాలు ఏర్పాటు చేయలని దుస్థితి… దసర పండుగ రోజున కొత్త బట్టలు వేసుకోలేదు… కనీసం ఇంటి ముందు బతుకమ్మలు ఆడలేదు… దేవాలయానికి వెళ్లడం మానేశారు… పాఠశాలలకు పిల్లలు వెళ్లలేక పోతున్నారు… కార్లు, బైక్​లు ఎక్కడో దూరాన పార్కింగ్​చేయాల్సి వస్తుంది… కనీసం ఇంటి ముందు అంబులెన్స్​లు, క్యాబ్​లు కూడా రాలేవు… కాయకష్టం చేసి కష్టపడి కట్టుకున్న ఇండ్లలో ఉండలేక కొంత మంది ఖాళీ […]

Update: 2021-11-27 07:17 GMT

దిశ, జల్​పల్లి: ఇంటి వాకిట్లో ముగ్గు వేయలేని పరిస్థితి… ఆ వీధుల్లో వినాయక విగ్రహాల మండపాలు ఏర్పాటు చేయలని దుస్థితి… దసర పండుగ రోజున కొత్త బట్టలు వేసుకోలేదు… కనీసం ఇంటి ముందు బతుకమ్మలు ఆడలేదు… దేవాలయానికి వెళ్లడం మానేశారు… పాఠశాలలకు పిల్లలు వెళ్లలేక పోతున్నారు… కార్లు, బైక్​లు ఎక్కడో దూరాన పార్కింగ్​చేయాల్సి వస్తుంది… కనీసం ఇంటి ముందు అంబులెన్స్​లు, క్యాబ్​లు కూడా రాలేవు… కాయకష్టం చేసి కష్టపడి కట్టుకున్న ఇండ్లలో ఉండలేక కొంత మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరికొందరు ఇండ్లు అమ్ముకున్నారు. ఇంకొందరు చేసేదిలేక అక్కడే ఉంటున్నారు. వారి ముఖాలలో చిరునవ్వులు ఎప్పుడో మాయమయ్యాయి. ముక్కు పుటాలదిరే భరించలేని కంపువాసన మధ్య అనునిత్యం నరకం అనుభవిస్తున్న 250 కుటుంబాలు దీనగాధ ఇది. ఇది ఎక్కడో మారు మూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ లో నాలుగవ స్థానంలో నిలిచిన మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​పేట్​మున్సిపల్​కార్పొరేషన్​కు కూత వేటు దూరంలో ఉన్న బోయపల్లి ఎన్​క్లేవ్​లో ప్రవహిస్తున్న మురికినీరు వల్ల అడుగుదీసి అడుగు వేయలేని దుస్థితి. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత ఇలాకాలోని బోయపల్లి ఎన్​క్లేవ్, సీవైఆర్​కాలనీ, సీఎంఆర్​కాలనీ, మధురపూరి కాలనీ, అమరావతి కాలనీ, బీఎస్​ఆర్​నగర్​కాలనీలలో 18 నెలల నుంచి పరిస్థితి ఇలాగే ఉంది.

ముంచెత్తుత్తున్న మురికినీటితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మలేరియా, డెంగ్యూ తదితర ప్రాణాంతక సీజనల్ వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. బడంగ్ పేట్​మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోని 3, 4వ డివిజన్ ​అల్మాస్​గూడ బోయపల్లి ఎన్​క్లేవ్ లో దాదాపు 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల తప్పిదాలతో ఇక్కడ మురుగునీరు ప్రవహిస్తోంది. సంవత్సరంన్నరగా ఓవర్​ఫ్లో కారణంగా బాత్​రూమ్స్, బోర్లలోకి మురుగునీరు రివర్స్​లో కొడుతుంది. అసలే కరోనా.. సీజనల్​వ్యాధులతో వారి జీవితాలు నరక ప్రాయంగా మారాయి. భరించలేని దుర్వాసన, మురికి నీటి కారణంగా కష్టపడి కట్టుకున్న సొంత ఇళ్లకు తాళాలు వేసి ప్రత్యామ్నాయంగా కొంతమంది మరోచోటకు వెళ్లారు. ఒక గంట మా కాలనీలో ఉంటే మా సమస్య మీకు అర్థం అవుతుందని.. ఒక్కసారి వచ్చి ఉండండి ప్లీజ్ అంటూ ప్రజా ప్రతినిధులను, అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. సమస్య ఉత్పన్నమైతే 24 గంటల్లో పరిష్కారం చేయాల్సిన అధికారులు 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. అనునిత్యం వేల కోట్ల రూపాయలతో శంఖుస్థాపనలు చేస్తున్నారని, ఆ తర్వాత పనులు జరుగుతున్నాయా? లేవా అని కూడా తిరిగి చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి డ్రైనేజీ కనెక్షన్ కోసం రూ. 8000 సదరు కాంట్రాక్టర్​తీసుకున్నప్పటికీ మురుగునీటి నుంచి మోక్షం కలుగడంలేదన్నారు. మురుగునీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ఆ రోడ్డుపై పారే మురుగునీటికి దిక్కెవరూ.. ?

పై చిత్రంలో కనిపిస్తున్న రోడ్డుకు ఎడమవైపు 3వ వార్డు బీజేపీ కార్పొరేటర్​మాదిరి వీర కర్ణారెడ్డి.. రోడ్డుకు కుడివైపు 4వ వార్డు కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి పరిధిలోకి వస్తది. అయితే.. రోడ్డు మధ్యలో పారుతున్న మురుగునీరు తమది కాదంటే తమది కాదని చేతులెత్తేస్తున్నారని, అదేదో ఇండియా, పాకిస్థాన్ బార్డర్​లా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News