మా పుస్తకాలను ఇచ్చేయండి.. సర్కారుకు ఆర్కే భార్య విజ్ఞప్తి
దిశ, తెలంగాణ బ్యూరో : ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంస్మరణ సభలు జరుపుకోవడం, వారి జ్ఞాపకాలను పుస్తకాలు, సంకలనాల రూపంలో ఆవిష్కరించుకోవడం ఈ సమాజంలో సర్వ సాధారణమని, కానీ మావోయిస్టు ఆర్కే విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతున్నదని ఆయన భార్య శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్న ఆర్కేతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కూడా జరిపిందని గుర్తు చేశారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంస్మరణ సభలు జరుపుకోవడం, వారి జ్ఞాపకాలను పుస్తకాలు, సంకలనాల రూపంలో ఆవిష్కరించుకోవడం ఈ సమాజంలో సర్వ సాధారణమని, కానీ మావోయిస్టు ఆర్కే విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతున్నదని ఆయన భార్య శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్న ఆర్కేతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కూడా జరిపిందని గుర్తు చేశారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, అక్షరాల రూపంలో పంచుకోవడం మాత్రం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి రుచించడంలేదని ఆమె ఆరోపించారు. ప్రింటింగ్ ప్రెస్‌లో అచ్చవుతున్న పుస్తకాలను పోలీసులు తీసుకెళ్ళిపోయారని, వాటిని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేసిన ఆమె పుస్తకావిష్కరణకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పుస్తకావిష్కరణకు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఆంక్షలపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆదివారం ఆమె మాట్లాడారు. ఆర్కే జీవిత విశేషాలతో రూపొందిన ‘సాయుధ శాంతి స్వప్నం’ పుస్తకాలు ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్నాయని, వాటిని వెంటనే తమకు తిరిగి అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణా ఉద్యమం సమయంలో ‘మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా’ అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించుకున్నారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫాసిస్ట్ ధోరణిని మార్చుకోవాలని, మానవీయ విలువలను గౌరవించాలని సూచించారు.
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే జీవిత విశేషాలతో ‘సాయుధ శాంతి స్వప్నం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకోడానికి ఆయన సతీమణికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. పోరాటంపై ప్రజలకు అవగాహన లేకున్నా ఫర్వాలేదుగానీ ప్రాణాలు కోల్పోతున్నవారి గురించి ఆలోచించాలన్నారు. రాజకీయాలు ఎంతగా దిగజారినా మానవ విలువలు మాత్రం ఉండాల్సిందేనన్నారు. మనిషి చనిపోయిన తర్వాత మిగిలేవి జ్ఞాపకాలేనని, వాటిని సమాజానికి పంచాలని శిరీష భావించారని, కానీ ఆ అవకాశమే లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు కూడా గ్యారంటీ లేకుండాపోయిందన్నారు.