కరోనా వైరస్ విజృంభించినా.. పట్టింపు లేదాయే
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి జనాలను వణికిస్తోంది. భారీగా పెరుగుతున్న కేసులు.. మరణాలతో జనం కలవరం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రజలు కరోనాతో తల్లడిల్లుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కరోనా వ్యాధి బారిన పడుతున్నారు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అవగాహన కల్పించి.. అండగా నిలబడి ఓదార్చాల్సిన ప్రజాప్రతినిధులు నియోజక వర్గాల్లో పత్తా లేకుండా పోయారు. ఆపద సమయంలో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. కొందరు ఎమ్మెల్యేలు నెలల తరబడి […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి జనాలను వణికిస్తోంది. భారీగా పెరుగుతున్న కేసులు.. మరణాలతో జనం కలవరం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రజలు కరోనాతో తల్లడిల్లుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కరోనా వ్యాధి బారిన పడుతున్నారు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అవగాహన కల్పించి.. అండగా నిలబడి ఓదార్చాల్సిన ప్రజాప్రతినిధులు నియోజక వర్గాల్లో పత్తా లేకుండా పోయారు. ఆపద సమయంలో ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. కొందరు ఎమ్మెల్యేలు నెలల తరబడి నియోజకవర్గాలకు రాకపోగా. మరికొందరు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. కరోనా కట్టడి కోసం కనీస చర్యలు చేపట్టకపోగా.. అధికారులతో సమీక్షలు కూడా చేయకపోవటం విచారకరం..!
అవగాహన కల్పించరు.. సమీక్షలు చేయరు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రెండు లోక్ సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆదిలాబాద్‌లో సోయం బాపురావు (బీజేపీ), పెద్దపల్లిలో బోరకుంట వెంకటేశ్ (టీఆర్ఎస్) ఎంపీలుగా ఉన్నారు. మిగతా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ, నాలుగు జిల్లాల జడ్పీ ఛైర్ పర్సన్లు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే. మండల స్థాయిలో ఉండే ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు ఉమ్మడి జిల్లాలో మెజారిటీ సభ్యులు వారే. ఉమ్మడి జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉండగా.. కరోనా వైరస్ పల్లె, పట్టణం తేడా లేకుండా విజృంభిస్తోంది. ప్రజలకు కరోనా కారణంగా తల్లడిల్లుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా.. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. గ్రామాల్లో వందల సంఖ్యలో జ్వర పీడితులు ఉండగా.. అదే స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారిన పడ్డ రోగులు మందులు ఎలా వాడాలి.. క్వారంటైన్‌లో ఎలా ఉండాలో తెలియక.. కనీస అవగాహన లేక.. నిబంధనలు పాటించకుండా.. పాజిటివ్ రోగులు బయట తిరుగుతున్నారు. ఇలాంటి విపత్కర, ఆపద సమయంలో అండగా నిలబడి ఓదార్చాల్సిన ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. కరోనాపై ప్రజలకు అవగాహన, కట్టడికి సమీక్షలు నిర్వహించకపోవటం విచారకరం.
కీలక ప్రజాప్రతినిధులకు పట్టని పరిస్థితి
పెద్దపల్లి ఎంపీ బోరకుంట వెంకటేశ్ నేత తన నియోజకవర్గంలో అసలు పర్యటించకపోగా.. గత కొన్ని నెలల నుంచి ఆయన జాడ లేకుండా పోయింది. ఆయన పరిధిలో వచ్చే బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో పర్యటించి.. ప్రజలకు అవగాహన, భరోసా, ఓదార్పు కల్పించిన పాపాన పోలేదు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆదివాసీల సమావేశాలకే పరిమితమవుతుండగా.. ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించేందుకు వెళ్లారు. కొన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటించినా.. అవగాహన కల్పించటంపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించినా.. కరోనాపై ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. ఉమ్మడి జిల్లాలో కరోనా విస్తృతంగా ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి మంత్రి అల్లోల తీసుకెళ్లగా.. ఈటల వ్యకిగత అదనపు కార్యదర్శి శ్రీకాంత్‌ను ఉమ్మడి జిల్లా ఇంచార్జిగా నియమించారు. ఇక చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గత రెండు నెలలుగా నియోజకవర్గానికి రాలేదు. పార్టీ సభ్యత్వ నమోదు ముగింపు ఫిబ్రవరి 26న పూర్తవగా.. అప్పటి నుంచి రాలేదు. చెన్నూరులో ఐసోలేషన్ సెంటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇటీవల కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్షించగా.. ఆయన ఎక్కువగా ఆదిలాబాద్ జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో ఉంటున్నారు.
మిగతా ఎమ్మెల్యేలది అదే తీరు..
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వారం క్రితం ఆసిఫాబాద్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులివ్వగా.. గతంలో ఆదివాసీల వివాహానికి హాజరయ్యారు. వారం నుంచి ఆయన జాడ లేకపోదు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సాగర్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లగా.. ఇటీవల తిరిగొచ్చినా ఎక్కువగా ఇంటికి పరిమితమవుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. కరోనాపై జనాలకు అవగాహన, ఓదార్పు ఇవ్వటం లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందచేస్తున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఎక్కువగా ఇంట్లోనే ఉంటుండగా.. ఫోనులో పార్టీ నాయకులతో కరోనా పరిస్థితిపై అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి.. జనాలకు మాత్రం అవగాహన, భరోసా కల్పించటం లేదు. ముధోల్ నియోజకవర్గంలో కేసులు ఎక్కువగా ఉండగా.. ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి క్షేత్ర స్థాయిలో కనీస అవగాహన, ఓదార్పు కల్పించకపోగా.. పత్రికా ప్రకటనే పరిమితమయ్యారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో కొన్ని వార్డుల్లో తిరిగి అవగాహన కల్పించినా.. నియోజకవర్గంలో మాత్రం పర్యటించటం లేదు. అధికారులతో సమీక్షలు కూడా లేవు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు క్షేత్రస్థాయి పర్యటనలు, కోవిడ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించటం లేదు.