కేశంపేటలో రియల్టర్ల కొత్త ఎత్తుగడ.. పొలాలు కాజేసేందుకు కుట్ర
దిశ, షాద్ నగర్: ఆర్ఆర్ఆర్ కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రంగారెడ్డి జిల్లా కేశంపేటలో భూముల ధరలకు ఇన్ని రోజులు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)కు 50–70 కిలోమీటర్ల అవతల 339 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఉత్తర భాగం అయిన సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–ప్రజ్ఞాపూర్–జగదేవ్‌పూర్–యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో […]
దిశ, షాద్ నగర్: ఆర్ఆర్ఆర్ కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రంగారెడ్డి జిల్లా కేశంపేటలో భూముల ధరలకు ఇన్ని రోజులు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)కు 50–70 కిలోమీటర్ల అవతల 339 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఉత్తర భాగం అయిన సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్–గజ్వేల్–ప్రజ్ఞాపూర్–జగదేవ్‌పూర్–యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్ వరకు ఉండే 164 కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయని ప్రస్తుత అంచనా వేశారు.
ఉత్తర భాగానికి ఇప్పటికే పచ్చజెండా ఊపిన కేంద్రం.. దక్షిణ భాగంలో ట్రాఫిక్‌పై నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. మార్గం మధ్యలో నీటి వనరులు, భారీ నిర్మాణాలు, కొండలు, గుట్టల వంటివి ఎక్కడైనా అడ్డుగా వస్తాయా అనేది పరిశీలించి.. రోడ్డు అలైన్‌మెంట్‌ను పక్కకు మార్చనున్నారు. ముఖ్యంగా ఇటీవల పలు ప్రాంతాలకు కాళేశ్వరం నీటిని తరలించే కాల్వలు నిర్మించారు. ఆయా చోట్ల పరిస్థితికి తగినట్టు అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, త్వరగా కసరత్తు పూర్తి చేయాలని కన్సల్టెన్సీని కేంద్రం ఆదేశించినట్టు అంటున్నారు. ఇంతవరకు భాగానే ఉన్న కేశంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో జోరందుకున్న భూముల ధరలను ఏమైందో ఏమో కొన్ని ప్రాంతాలలో రియల్టర్ లు తక్కువకు అడగడం ప్రారంభించారు.
ఇన్నిరోజులు 50 నుంచి 80 లక్షలకు భూములు అడిగారు. కానీ రహదారి మీ భూముల గుండా పోతుందని బూచి చూపి తక్కువకు సగానికే అడుగుతుండటం విశేషం. మండల పరిధిలోని కొంతమంది రియల్టర్ లు గూగుల్ మ్యాప్ లను చూపుతూ రోడ్డు ఈ భూముల గుండా పోతుందంటూ పుకార్లు సృష్టిస్తూ రైతుల వద్ద నుండి తక్కువ ధరకు భూములను కొట్టేసే నయా దందాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మండలంలో పలు అమాయక రైతులు వీరివలలో పడి తక్కువకే పొలాలు కోల్పోయారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులలో నెలకొన్న అపోహలు తొలగించి ఇలాంటి బోగస్ రియల్టర్ ల బారినుండి రైతులను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.