ఏజెన్సీలో రియల్ దందా..? 1/70 యాక్ట్‌కు తూట్లు..
దిశ ప్రతినిధి, వరంగల్/బయ్యారం : మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలమైన బయ్యారంలో రియల్ దందా కొనసాగుతోంది. 1/70 యాక్ట్‌కు రియల్ వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారు. ఎలాంటి అనుమతులు పొందకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో రోడ్డుకు రెండు వైపులా ఉన్న పొలాలను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడి భూములన్నీ కూడా అటవీ చట్టాలకు లోబడి ఉన్నాయి. అయినా, వాటిని రియల్టర్లు పట్టించుకోవడం లేదు. వీరికి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలు దండిగా […]
దిశ ప్రతినిధి, వరంగల్/బయ్యారం : మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలమైన బయ్యారంలో రియల్ దందా కొనసాగుతోంది. 1/70 యాక్ట్‌కు రియల్ వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారు. ఎలాంటి అనుమతులు పొందకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో రోడ్డుకు రెండు వైపులా ఉన్న పొలాలను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడి భూములన్నీ కూడా అటవీ చట్టాలకు లోబడి ఉన్నాయి. అయినా, వాటిని రియల్టర్లు పట్టించుకోవడం లేదు. వీరికి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలు దండిగా ఉండటంతో అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారు. వారికి మాముళ్ల రూపంలో అందుతుండటంతో కనీసం అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మెయిన్ రోడ్డుపై గజం రూ.30 వేలు..
మహబూబాబాద్- ఇల్లందు పట్టణాలకు మధ్యలో ఉండటంతో చుట్టూ దాదాపు 70 నుంచి 80 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. హైవే పై ఉండటంతో వివిధ రకాల వ్యాపారాలు కూడా జోరుగానే సాగుతుంటాయి. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ముందుగా కొంతమంది వ్యాపారులు పదుల ఎకరాల భూమిని కొనుగోలు చేసి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన ఐదారేళ్లుగా బయ్యారం మండల కేంద్రంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.
మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై గజం ధర రూ.30 వేలు పలుకుతుండగా.. సెకండ్ బిట్లు 20 వేలు థర్డ్ బిట్లు 15 వేలకు గజం అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఇక అనధికార వెంచర్లలో అయితే గజం ధరను రూ.10 వేల నుంచి 12 వేల వరకు విక్రయిస్తున్నారు. బయ్యారంలో రియల్ భూంను క్యాష్ చేసుకునేందుకు అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతుండటం గమనార్హం. బయ్యారం నుంచి ఇల్లందు, మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డులో దాదాపు 15 వెంచర్లు నడుస్తుండగా, కొత్తపేట గ్రామానికి సమీపంలో మరో 3 వెంచర్లలలో ప్లాట్ల దందా జోరుగా సాగుతోంది.
అధికార పార్టీ అండదండలు..
అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలతోనే బయ్యారంలో రియల్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లితున్నట్లు సమాచారం. బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడం కూడా గిరిజన చట్టాలకు విరుద్ధమే. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదు. బయ్యారం మండల కేంద్రంలో అయితే ఏకంగా బహుళ అంతస్తుల భవనాలు పదుల సంఖ్యలో వెలుస్తున్నాయి. ఈ కల్చర్ మండల కేంద్రం చుట్టు పక్కల కూడా బాగా పెరుగుతున్నా అధికారులు మౌనం దాల్చుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కళ్ల ముందే దందా జరుగుతున్నా… ఈ విషయంలో తామేమీ చేయలేమని, అధికార పార్టీ నేతల నుంచి ఇబ్బందులు వస్తాయని బాహాటంగానే చెబుతుండటం గమనార్హం.