వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి : బ్రిక్‌వర్క్
దిశ, వెబ్‌డెస్క్: వేగంగా ఆర్థిక పునరుద్ధరణ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ స్థూల జీడీపీ 11 శాతం వరకు సానుకూలంగా ఉండొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ నివేదిక తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా కరోనా పూర్వస్థాయికి చేరుకుంటున్నాయని, కొన్ని రంగాల్లో మాత్రమే ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయని బ్రిక్‌వర్క్ వెల్లడించింది. ‘కొవిడ్-19ను నియంత్రించేందుకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి, దేశీయ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్న సంకేతాలతో వచ్చే […]
దిశ, వెబ్‌డెస్క్: వేగంగా ఆర్థిక పునరుద్ధరణ నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ స్థూల జీడీపీ 11 శాతం వరకు సానుకూలంగా ఉండొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ నివేదిక తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా కరోనా పూర్వస్థాయికి చేరుకుంటున్నాయని, కొన్ని రంగాల్లో మాత్రమే ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయని బ్రిక్‌వర్క్ వెల్లడించింది.
‘కొవిడ్-19ను నియంత్రించేందుకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి, దేశీయ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్న సంకేతాలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ వాస్తవ జీడీపీ 11 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని’ బ్రిక్‌వర్క్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం ప్రతికూలంగా ఉంటుందని తెలిపింది. కరోనా నిబంధనలను పాటించాల్సి ఉండటంతో కొన్ని రంగాలు అనిశ్చితంగా ఉన్నాయని, అయితే, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో సానుకూల వృద్ధిని సాధించే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.5 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని, అయితే సాధారణ రుతుపవనాలతో పాటు వ్యవసాయ రంగంలో జరిగే సంస్కరణలను బట్టి వృద్ధి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడింది. ఇక, పారిశ్రామిక రంగం 11.5 శాతం, సేవల రంగం 11 శాతం నుంచి 12 శాతం పెరుగుతుందని బ్రిక్‌వర్క్ తెలిపింది.