‘రామప్ప’తో ఆగము.. అంతకుమించి చేస్తాం: కేహెచ్‌టీ
దిశ ప్రతినిధి, వరంగల్ : రామప్ప శిల్ప కళా సంపదకు గుర్తింపు తీసుకురావడానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ( కేహెచ్‌టీ) నిర్విరామంగా పనిచేస్తుందని వ్యవస్థాపక ధర్మకర్త, ఐఏఎస్ అధికారి పాపారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారావు తెలిపారు. రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతోనే కేహెచ్‌టీ తన పనికి స్వస్తి పలకదని, మరింత బాధ్యతగా పనిచేయబోతోందన్నారు. రామప్ప ఆలయానికి యూనిస్కో గుర్తింపు దక్కడంతో దశాబ్దకాలం నాటి కల నెరవేరిందని అన్నారు. కాకతీయ శిల్పా సంపద, చారిత్రక సాంస్కృతిక అంశాలకు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : రామప్ప శిల్ప కళా సంపదకు గుర్తింపు తీసుకురావడానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ( కేహెచ్‌టీ) నిర్విరామంగా పనిచేస్తుందని వ్యవస్థాపక ధర్మకర్త, ఐఏఎస్ అధికారి పాపారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారావు తెలిపారు. రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతోనే కేహెచ్‌టీ తన పనికి స్వస్తి పలకదని, మరింత బాధ్యతగా పనిచేయబోతోందన్నారు. రామప్ప ఆలయానికి యూనిస్కో గుర్తింపు దక్కడంతో దశాబ్దకాలం నాటి కల నెరవేరిందని అన్నారు. కాకతీయ శిల్పా సంపద, చారిత్రక సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఇంకా ఎన్నో విషయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యతను ట్రస్టు తన శాయశక్తుల చేపడుతుందని అన్నారు.
హన్మకొండ హరిత హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాండు రంగారావు, ఆర్కిటెక్ సూర్య నారాయణ మూర్తితో కలిసి పాపారావు మాట్లాడారు. యునెస్కో గుర్తింపు దక్కడంతో ములుగు ప్రాంతానికి అంతర్జాతీయ టూరిస్ట్ ప్లేస్‌గా గుర్తింపు వస్తుందని అన్నారు. ఇక్కడికి ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టూరిజం అభివృద్ధి చెందే అవకాశం మెండుగా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నాయని అన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు.
కాకతీయ రాజుల శిల్పా కళా సంపదను, చారిత్రక అంశాలు వెలుగులోకి తీసుకువచ్చి పరిరక్షించే లక్ష్యంతో 2009లో పాండు రంగారావుతో కలిసి ఈ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పాపారావు. ట్రస్టు ఏర్పాటుకు సహకరించిన నాటి సాంస్కృతిక శాఖ మంత్రి గీతారెడ్డికి ఈ సందర్భంగా ట్రస్టు తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్టుకు ఎవరైనా విరాళాలు ఇవ్వవచ్చని పిలుపునిచ్చారు. రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడం వెనుక అనేక మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఉందని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ములుగు జిల్లా అధికారులకు ఈ సందర్భంగా ట్రస్టు తరుఫున కృతజ్ఞతలు తెలిపారు.