టీటీడీపీ అధ్యక్షుడిగా రావుల?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీటీడీపీ నేతలతో రెండు రోజులు వర్చువల్ సమావేశం నిర్వహించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే పార్టీ బలోపేతం అవుతుంది..? చురుగ్గా ఎవరు పనిచేస్తారు..? సీనియర్ నేతకు అప్పగిస్తే బాగుటుందా..? అనే దానిపై అభిప్రాయం సేకరించారు. మెజార్టీ నేతలు రావులకే అప్పగించాలని కోరినట్లు సమాచారం. దీంతో రెండుమూడురోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు పార్టీనేతలు పేర్కొంటున్నారు. 2014 […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి నియామకం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీటీడీపీ నేతలతో రెండు రోజులు వర్చువల్ సమావేశం నిర్వహించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే పార్టీ బలోపేతం అవుతుంది..? చురుగ్గా ఎవరు పనిచేస్తారు..? సీనియర్ నేతకు అప్పగిస్తే బాగుటుందా..? అనే దానిపై అభిప్రాయం సేకరించారు. మెజార్టీ నేతలు రావులకే అప్పగించాలని కోరినట్లు సమాచారం. దీంతో రెండుమూడురోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు పార్టీనేతలు పేర్కొంటున్నారు.
2014 జూన్ 2లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీటీడీపీ బాధ్యతలను సీనియర్ నాయకుడు, బీసీ నేత ఎల్. రమణకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అప్పగించారు. నాటి నుంచి 2021 జూలై 9వరకు బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష పదవికి, పార్టీకి రమణ రాజీనామా చేశారు. ఈ నెల 12న టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో పాటు 16న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు? వస్తారన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈనెల 10, 11 తేదీల్లో నూతన అధ్యక్షుడి ఎంపికపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన అధ్యక్షుడి ఎంపికపై నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికే కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంట్ జిల్లాల అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు.. ప్రధానంగా ఐదుగురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం
30 ఏళ్లుగా ఆ పార్టీలో కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా కొనసాగిన రమణ టీడీపీకి రాజీనామా చేయడంతో ఇప్పడు అధినేత ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయాలను అధ్యయనం చేస్తూ చురుకుగా, పార్టీ శ్రేణులను ఏకం చేసే నాయకుడికి బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రమణ బీసీ నేత కావడం, ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు సామాజిక సమీకరణల పరంగా ఇక్కడ ఎవరికి బాధ్యతలు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. కొత్త అధ్యక్షుడు రేసులో ఐదుగురి నేతలు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి, మరో సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ పదవిని బీసీ వర్గానికి ఇస్తే అరవింద్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గానికి అయితే బక్కని నర్సింహులుకు ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న నన్నూరి నర్సిరెడ్డికి మంచి వాగ్దాటి ఉంది. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే తత్వం ఆయనది. అయితే రావుల చంద్రశేఖర్ రెడ్డికి వివాదరహితుడిగా పేరు ఉండటంతో పాటు అందరినీ కలుపుకొని పోతారన్న అభిప్రాయం పార్టీనేతల్లో ఉంది. ఎవరినీ నొప్పించని మనస్తత్వం రావులది. దీంతో ఎక్కువ మంది నేతలు రావుల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు కావడంతో పాటు రాజకీయ అనుభవం కూడా ఉంది. 1982లో కానాయపల్లి సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి 1985లో టీడీపీ జిల్లా కార్యదర్శిగా, 1987లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1994లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
పునర్ నిర్మాణమే లక్ష్యంగా..
టీటీడీపీ రాష్ట్ర కమిటీకి నూతన అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను సీనియర్లంతా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అప్పగించారు. పార్టీ ఆవిర్భవించింది మొదలు ఎంతో మందిని నాయకులుగా తయారుచేసిన చరిత్ర తెలుగుదేశానికి ఉందని, ఇప్పుడు కొన్ని పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవారంతా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి నేతలుగా ఎదిగినవారేనని పలువురు పేర్కొంటున్నారు. పార్టీ గతంతో పోలిస్తే చాలా బలహీనపడగా, తిరిగి పునర్ నిర్మాణం చేసి మరింత బలోపేతం చేయాలనే అంశంపై చంద్రబాబు పార్టీ నేతలతో రెండు రోజులపాటు వర్చువల్ పద్దతిలో విస్తృతంగా చర్చించారు. అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు, కూర్పు, బాధ్యతలు, పార్టీ నిర్మాణంతో పాటు తాజాగా రాష్ట్రంలో, వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితి, పరిణామాలను చర్చించారు. మండలాలు,జిల్లాలు,నియోజకవర్గాలవారీగా కమిటీలు ఏర్పాటవుతాయని పార్టీనేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండురోజుల్లో నూతన అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
2018 ఎన్నికల్లో గెలిచించినా..
1983, 1984, 1994, 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీలో ప్రతిష్టంభన ఏర్పడింది. పార్టీని నడిపించేవారు లేకపోవడంతో పార్టీనేతలు ఇతర పార్టీల్లో చేరారు. 2014 ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు విజయం సాధించారు. పార్టీని నడిపించే నేత లేకపోవడం, పార్టీ బలహీన పడటంతో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. 2021 ఏప్రిల్ 7న టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్‌రావులు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందజేశారు. టీఆర్ఎస్ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.