మద్యం సీసాలు మింగిన ఎలుకలు!

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగినట్లు తేటతెల్లమవుతోంది. సీల్ వేసిన దుకాణాల నుంచి మద్యం మాయమైంది. సంగారెడ్డి జిల్లాలో పలు మద్యం దుకాణాల నుంచి ఏకంగా 230 కాటన్ల మద్యం మాయమైనట్లు లెక్కల్లో తేడాలు గమనించారు. అంతేకాకుండా అమ్మకాలు మొదలైన తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వైన్‌షాపులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్నింటిని నాలుగైదు రోజులు సస్పెండ్ చేయగా.. మరికొన్ని దుకాణాలపై జరిమానా విధించారు. మద్యం దుకాణాలు చేసిన తప్పిదాలతో కూడా […]

Update: 2020-05-31 02:55 GMT

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగినట్లు తేటతెల్లమవుతోంది. సీల్ వేసిన దుకాణాల నుంచి మద్యం మాయమైంది. సంగారెడ్డి జిల్లాలో పలు మద్యం దుకాణాల నుంచి ఏకంగా 230 కాటన్ల మద్యం మాయమైనట్లు లెక్కల్లో తేడాలు గమనించారు. అంతేకాకుండా అమ్మకాలు మొదలైన తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వైన్‌షాపులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్నింటిని నాలుగైదు రోజులు సస్పెండ్ చేయగా.. మరికొన్ని దుకాణాలపై జరిమానా విధించారు. మద్యం దుకాణాలు చేసిన తప్పిదాలతో కూడా ప్రభుత్వం పైసలు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. జరిమానా చెల్లిస్తే.. సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం కూడా కల్పించారు.

మద్యం దుకాణాలను అనుమతిచ్చే నాటికి వీటిపై ఫిర్యాదులుండటంతో ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలపై తనిఖీలు చేశారు. సంగారెడ్డి జిల్లాతో పాటుగా నారాయణపేట్, వికారాబాద్, రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో దుకాణాల్లో నుంచి మద్యం మాయమైనట్లు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్లలో భారీ తేడాలున్నట్లు తేలింది. సంగారెడ్డి జిల్లాలో ఒక కంపెనీకి చెందిన 230 కాటన్ల మద్యం తేడా వచ్చింది. ఈ విధంగా పలు ప్రాంతాల్లో కూడా తేడాలు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అయితే దీనిపై దుకాణాల యజమానులు అధికారులు అడిగిన ప్రశ్నలకు విస్తుపోయే సమాధానాలు ఇచ్చారు. తాళాలు వేసి ఉన్న మద్యం దుకాణాల నుంచి ఎలుకలు ఎత్తుకెళ్లాయని, సీసాలు పగులగొట్టాయంటూ నోటీసుల్లో సమాధానం చెప్పినట్లు సమాచారం. ఎలుకలు మద్యం మాయం చేయడంపై ఆగ్రహించిన అధికారులు వాటిపై చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో మొత్తం 60 మద్యం దుకాణాలకు అబ్కారీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం మాయం కావడంతో పాటుగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించకపోవడం, శానిటైజర్లను అందుబాటులో పెట్టకపోవడం వంటి వాటిని గుర్తించారు. మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. దీంతో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలింది. దుకాణాల్లో విక్రయాలు చేసే వారు మాస్క్‌లు, గ్లౌజులు ధరించకపోవడం, కనీస చర్యలు తీసుకోకపోవడం, మద్యం కొనుగోలు చేసే వారికి శానిటైజర్ అందుబాటులో పెట్టకపోవడం, భౌతిక దూరం పాటించకున్నా, మాస్క్ లు లేకుండా వచ్చిన విక్రయించడం వంటి వాటిపై చర్యలు తీసుకున్నారు. మొత్తం 60 దుకాణాలకు నోటీసులు జారీ చేసి వాటిలో 30 దుకాణాలపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సస్పెన్షన్ వేటు వేసిన దుకాణాలకు జరిమానా చెల్లిస్తే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వం నిర్ణయించిన జరిమానా చెల్లిస్తే దుకాణాలు యధావిధిగా తెరుచుకోవచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో పలు మద్యం దుకాణాల యజమానులు ఫైన్ చెల్లించి మద్యం అమ్మకాలు చేశారు. దీంతో కూడా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతోంది.

Tags:    

Similar News