సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారు: రఘురామ కృష్ణంరాజు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో ఏపీ ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి సంక్షేమం ఎక్కువకాలం నిలిచే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2.56 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో ఏపీ ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి సంక్షేమం ఎక్కువకాలం నిలిచే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2.56 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీసుకునేందుకే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే ఆదాయం అంతా సరిపోతోందన్నారు. అందుకే ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి పప్పు బెల్లాల్లా పంచుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలంటూ కలెక్టర్లు, జేసీలకు సీఎం ఆదేశాలివ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయకుండా..ఉద్యోగుల పీఎఫ్‌లో కోత విధిస్తోందని ఆరోపించారు. 20వ తేదీ వచ్చినా..నేటికి ఇంకా 20 శాతం మందికి వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు.
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారుణాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇదేనా మనం స్త్రీలకు ఇచ్చే గౌరవం అని నిలదీశారు. గతంలో”గన్ కన్నా ముందు ఇంకేదో జగన్ వస్తాడని మహిళా మంత్రులు పదేపదే చెప్పేవారని ఇప్పుడు ఆ గన్ ఏది..జగన్ ఏడని నిలదీశారు. చట్టాలు తెచ్చాం, యాప్‌లు పెట్టాం అని మాట్లాడుతున్న వైసీపీ నేతలు స్త్రీలపై జరుగుతున్న దారుణాలపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. జగన్ కేబినెట్‌లో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. సచివాలయానికి రావడమే మానేశారన్నారు. ముఖ్యమంత్రి వస్తేనే మంత్రులు వస్తున్నారే తప్ప మిగిలిన రోజుల్లో కనిపించడం లేదన్నారు. అందువల్ల సీఎం జగన్ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని..సీఎం జగన్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని తనకు అనిపిస్తోందన్నారు. వీటిని సీఎం జగన్ సరిచేసుకుంటే మరో పాతికేళ్లు సీఎంగా జగనే ఉంటారన్నారు. తాను కూడా 25ఏళ్లు సీఎంగా జగనే ఉండాలని కోరుకుంటానంటూ ఎంపీ రఘురామ వ్యంగ్యంగా మాట్లాడారు.