ఉద్యమాన్ని విరమించం.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ఝలక్

దిశ, ఏపీ బ్యూరో : ఉద్యోగ సంఘాల సమస్యలను నెరవేర్చేందుకు ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌తో పాటు ఇతర డిమాండ్లపై సీఎం వైఎస్ జగన్ గురువారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఉద్యోగులకు 34శాతం పీఆర్సీ ప్రకటిస్తే ఎలా ఉంటుందో అనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఉద్యోగులకు తీపికబురు చెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల నేతలు […]

Update: 2021-12-10 23:49 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఉద్యోగ సంఘాల సమస్యలను నెరవేర్చేందుకు ఓవైపు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్‌తో పాటు ఇతర డిమాండ్లపై సీఎం వైఎస్ జగన్ గురువారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఉద్యోగులకు 34శాతం పీఆర్సీ ప్రకటిస్తే ఎలా ఉంటుందో అనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఉద్యోగులకు తీపికబురు చెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తాము కేవలం పీఆర్సీ కోసమే పోరాడటం చేయడం లేదని 71 న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన సింహగర్జనలో నేతలు ప్రకటించారు. అన్ని డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని, త్వరలోనే రెండో దశ ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అన్ని డిమాండ్లు నెరవేర్చాల్సిందే

ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. అన్ని డిమాండ్లు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సీపీఎస్‌ రద్దు బాధ్యత కూడా సీఎం జగన్ బాధ్యతేనని చెప్పుకొచ్చారు. సీపీఎస్‌ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచడం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ వెంటనే పీఆర్సీ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. పీఆర్‌సీతో పాటు నాన్‌ ఫైనాన్షియల్‌ డిమాండ్లను సైతం పరిష్కరించాల్సిందేనని లేని పక్షంలో ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని తెలిపారు. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రెండో విడత ఉద్యమ కార్యచరణను సైతం త్వరలోనే ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావులు స్పష్టం చేశారు.

శ్రీనివాసరావు, బొప్పరాజు

ఊపందుకున్న సీపీఎస్ ఉద్యమం

సీపీఎస్ ఉద్యమం ఆరేళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఉద్యమం ఊపందుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తామని సీఎం జగన్ నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినప్పటికీ తమ డిమాండ్ నెరవేర్చకపోవడంతో ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమ బాటపట్టాయి. పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రధాన అంశాలతో సింహగర్జన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ తరపున కార్యక్రమం నిర్వహించింది. ‘మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు.. మీ హామీ మా హక్కు’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు బ్యానర్‌లతో నిరసన చేపట్టారు. రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. రద్దు చేస్తామన్న హామీని సీఎం జగన్ విస్మరించారని సీపీఎస్ఈఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మండిపడ్డారు. సీపీఎస్ ఉద్యమం ఆరేళ్లుగా కొనసాగుతోన్న జగన్ పట్టించుకోక పోవడం సరికాదన్నారు. రద్దుపై మూడు కమిటీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు.

పీఆర్సీ ప్రక్రియ వారం లోపే : సజ్జల

పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక ప్రకటన చేశారు. పీఆర్సీ ప్రక్రియ వారం లోపే పూర్తవుతుందని స్పష్టం చేశారు. పీఆర్సీ పెంపునకు సంబంధించి కసరత్తు జరుగుతుందని శుక్రవారం ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘ఉద్యోగుల విషయానికి వస్తే.. పీఆర్సీ, సీపీఎస్‌, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌కు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సీపీఎస్‌ మీద కమిటీలు వేసి స్టడీ చేస్తున్నామన్నారు. కొవిడ్‌ రాకుండా ఉంటే ముందే జరిగి ఉండేదన్నారు. ఉద్యోగులు ఏ రూపంలో పోరాటాలు చేస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. ఇచ్చిన హామీలు అన్నీ కంప్లీట్‌గా పూర్తి చేస్తున్న ప్రభుత్వం.. రకరకాల కారణాలతో ఆలస్యం జరుగుతోందని సజ్జల పేర్కొన్నారు.

Tags:    

Similar News