నో వ్యాక్సిన్.. టీచర్ల ప్రాణాలను గాలికొదిలేసిన సర్కార్

దిశ, తెలంగాణ బ్యూరో : జులై 1 నుంచి విద్యాసంస్థ ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. వ్యాక్సిన్ వేసుకోకుండా విధులకు హాజరుకావాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. టీచర్లతో పాటు విద్యార్థులకు వ్యాధిసోకే ప్రమాదముందని తల్లిద్రండ్రులు కంగారు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు 1.20 లక్షల మంది, ప్రైవేటు టీచర్లు 2.50 లక్షల మంది మొత్తంగా 3.70 లక్షల మంది టీచర్లుండగా వీరిలో 20 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. […]

Update: 2021-06-19 13:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జులై 1 నుంచి విద్యాసంస్థ ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. వ్యాక్సిన్ వేసుకోకుండా విధులకు హాజరుకావాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. టీచర్లతో పాటు విద్యార్థులకు వ్యాధిసోకే ప్రమాదముందని తల్లిద్రండ్రులు కంగారు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు 1.20 లక్షల మంది, ప్రైవేటు టీచర్లు 2.50 లక్షల మంది మొత్తంగా 3.70 లక్షల మంది టీచర్లుండగా వీరిలో 20 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన తరువాతే విద్యాసంస్థలు ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియలో ఫ్రంట్ లైన్ వర్కర్లను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయులను మాత్రం గాలికి వదిలేసింది. విద్యాసంస్థలు ప్రారంభిస్తే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వ్యాధి సోకే ప్రమాదముందని తెలిసినప్పటికీ టీచర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించింది. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ అందించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసి జులై 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టకుండా విద్యాసంస్థలు ఏ విధంగా ప్రారంభిస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రాష్ట్రంలో 3.7లక్షల మంది ఉపాధ్యాయులు:

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 1.20 లక్షల మంది, ప్రైవేటు ఉపాధ్యాయులు 2.50 లక్షల మంది మొత్తంగా 3.70 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 45ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు మొత్తం 20 శాతం మంది మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టకపోవడంతో దాదాపుగా 80 శాతం మంది వ్యాక్సిన్‌కు దూరమయ్యారు. ఆన్‌లైన్ తరగతులు లేకపోవడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా పాఠశాలకు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ పొందని ఉపాధ్యాయులు ధైర్యంగా పాఠాలు బోధించే ఆస్కారం లేకుండా పోతుంది. ఎక్కడ తమకు కరోనా వ్యాధి సోకుతుందోనని మానసిక ఆందోళనతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి.

వ్యాక్సిన్ అందించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ :

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ అందించిన తరువాతే విద్యాసంస్థలు ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకోకపోవడం వలన ఉపాధ్యాయులు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ అందించకపోవడంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పిల్లలకు వ్యాధి సోకే ప్రమాధాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులందరికి వ్యాక్సిన్ ఇవ్వాలి :

ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టిన తరువాతే విద్యాసంస్థలు ప్రారంభించాలి. ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రైవేటు టీచర్స్ ఫెడరేషన్ తరుపున ఈ నెల 27న 10వేల మంది టీచర్లకు వ్యాక్సిన్ అందిస్తున్నాం, ప్రతి ఒక్క ఉపాధ్యాయునికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి.

-షబ్బీర్, ప్రైవేటు టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు

విద్యార్థుల ప్రాణాలకు ముప్పు :

ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ అందించకుండా విద్యాసంస్థలు ప్రారంభిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడనుంది. కరోనా వ్యాధి విద్యార్థులకు సోకితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా తరగతులను నిర్వహించాలి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ మేరకు జాగ్రత్తలు చేపట్టేలా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి.

-వెంకట్, హెచ్ఎస్‌పీఏ సభ్యులు

 

Tags:    

Similar News