ఖైదీలకు ఆటవిడుపు.. జైలు రేడియో
దిశ, వెబ్‌డెస్క్: జైలులో ఖైదీలు దుస్తులు కుట్టడం, కూరగాయలు పెంచడం, మొక్కలను సంరక్షించడం, ఈ మధ్య కొత్తగా మాస్కులు కుట్టి పంపించడం, సేంద్రీయ ఎరువులు తయారు చేయడం.. వంటి పనులన్నీ చేస్తుంటారు. అయినా కూడా వారు రోజూ రాత్రి పూట ఎవరి నాలుగు గోడల మధ్యలో వారు బతకాల్సిందే.. అలా ఒంటరిగా ఉన్నపుడు వారిలో వారే మదనపడుతూ, తాము చేసిన తప్పు గురించి పశ్చాత్తాప పడతారు. ఇదే పరిస్థితి ఇటీవల ప్రతి ఒక్కరూ అనుభవించారు. కఠిన లాక్‌డౌన్ సమయంలో […]
దిశ, వెబ్‌డెస్క్: జైలులో ఖైదీలు దుస్తులు కుట్టడం, కూరగాయలు పెంచడం, మొక్కలను సంరక్షించడం, ఈ మధ్య కొత్తగా మాస్కులు కుట్టి పంపించడం, సేంద్రీయ ఎరువులు తయారు చేయడం.. వంటి పనులన్నీ చేస్తుంటారు. అయినా కూడా వారు రోజూ రాత్రి పూట ఎవరి నాలుగు గోడల మధ్యలో వారు బతకాల్సిందే.. అలా ఒంటరిగా ఉన్నపుడు వారిలో వారే మదనపడుతూ, తాము చేసిన తప్పు గురించి పశ్చాత్తాప పడతారు. ఇదే పరిస్థితి ఇటీవల ప్రతి ఒక్కరూ అనుభవించారు. కఠిన లాక్‌డౌన్ సమయంలో అందరూ నాలుగు గోడల మధ్య బతికారు. ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే పిచ్చెక్కిపోయేదని చాలా మంది అంగీకరించారు. మరి అలాంటిది జైలులో గడిపేవారికి అక్కడ ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. వారికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరమే కదా.. అలాగని ఫోన్ ఇవ్వలేని పరిస్థితి. అందుకే అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు వారు చాలా వినూత్నంగా ఆలోచించి ఖైదీలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. అది ఎలాగంటే..
ఇప్పుడు ఆ జైలు నుంచి విడుదలై వెళ్లేవారికి స్పీకర్లలో గుడ్‌బై చెబుతూ ఒక సందేశం ప్రసారమవుతుంది. అంతేకాకుండా అదే స్పీకర్‌లో హిందీ, గుజరాతీ పాటలు, ఉపన్యాసాలతో పాటు ఒక్కో ఖైదీకి సంబంధించిన జీవితగాథలు కూడా ప్రసారం అవుతాయి. అవును.. సబర్మతి సెంట్రల్ జైలులో ఇప్పుడు సొంతంగా రేడియో పెట్టారు. దాని పేరు ప్రిజన్ రేడియో. ఆ జైలులో ఉన్న 3000లకు పైగా మంది ఖైదీలు ఈ రేడియోతో ఎంటర్‌టైన్‌మెంట్ పొందనున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉండి పడిన అవస్థలు, ఎలాంటి లాక్‌డౌన్ లేకున్నా ఖైదీలు అనుభవిస్తున్నారని, వారికి ఎంతోకొంత వినోదాన్ని ఇచ్చే ప్రయత్నంలోనే తాము ఈ రేడియోను ప్రారంభించినట్లు గుజరాత్ పోలీసు శాఖ తెలిపింది. అంతేకాకుండా ఖైదీలు తమ పశ్చాత్తాపాన్ని తమలో తాము తలుచుకుని బాధపడకుండా, నలుగురితో పంచుకునే అవకాశం ఈ రేడియో వల్ల కలుగుతోందని జైలు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కేఎల్ఎన్ రావు తెలిపారు. గాంధీ జయంతి రోజున ఆయన ఈ రేడియోను ప్రారంభించారు.
1851లో నిర్మించిన ఈ జైలులో మహాత్మగాంధీ మార్చి 11, 1922 నుంచి మార్చి 20, 1922 వరకు జైలు శిక్ష అనుభవించారు. అందుకే గాంధీకి సంబంధించిన కార్యక్రమంతో ఈ రేడియోను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు ఈ రేడియో కార్యక్రమాలు నడుస్తాయి. తాము రోజువారీగా చేస్తున్న పనులను మరింత ఉత్సాహంతో చేయడానికి ఈ ప్రిజన్ రేడియో ఉపయోగపడుతుందని జైలులో ఉంటున్న ఖైదీలు చెప్పారు. ఏదేమైనా ఐడియా మాత్రం అద్భుతంగా ఉంది, వాళ్లు ఖైదీలే కానీ వాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని గుర్తించిన గుజరాత్ పోలీస్ శాఖ నిజంగా జోహార్లు చెప్పుకోవాల్సిందే!