ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలతో రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని, పాత చట్టాల్లోని ప్రయోజనాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గత చట్టాలు రైతులకు కలిగించిన హక్కులు ఇకపైనా కొనసాగుతాయని చెబుతూ కొత్త చట్టాలపై భరోసానిచ్చారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువుపెట్టారు. వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతులపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తన ప్రభుత్వం అదే పనిచేస్తున్నదని […]

Update: 2021-01-29 00:14 GMT

న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలతో రైతులకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని, పాత చట్టాల్లోని ప్రయోజనాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గత చట్టాలు రైతులకు కలిగించిన హక్కులు ఇకపైనా కొనసాగుతాయని చెబుతూ కొత్త చట్టాలపై భరోసానిచ్చారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువుపెట్టారు. వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతులపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తన ప్రభుత్వం అదే పనిచేస్తున్నదని తెలిపారు. దేశంలో మొత్తం 80శాతం మంది కేవలం ఒకటి లేదా రెండు హెక్టార్ల భూములన్న చిన్న సన్నకారు రైతులేనని, వీరు సుమారు పదికోట్ల మందికి దరిదాపుల్లో ఉంటారని వివరించారు. వీరి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మద్దతు ఇవ్వాలని కేంద్రం భావించిందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 113000 కోట్ల సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో జమచేసిందని చెప్పారు. ఫసల్ బీమా కింద ఐదేళ్లలో రూ. 90 వేల కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. వీటితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల్లో అధికరణం 370 రద్దు, అయోధ్య రామమందిర శంకుస్థాపననూ ప్రస్తావించారు.

మూడు చట్టాలకు పార్టీలకు అతీతంగా మద్దతు

సుదీర్ఘకాలం సంప్రదింపులు జరిపిన తర్వాతే పార్లమెంటు మూడు కొత్త సాగు చట్టాలను ఆమోదించిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ మూడు చట్టాల ద్వారా సుమారు 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు వెంటనే ప్రతిఫలాలు అందుకోవడం ప్రారంభమైందని వివరించారు. ఈ చట్టాలకు పార్టీలకతీతంగా మద్దతు లభించిందని, ఈ చట్టాలపై రెండు దశాబ్దాలపాటు దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, చట్టసభల్లోనూ ఈ చట్టాల కోసం డిమాండ్లు వెల్లువెత్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈ చట్టాల అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిందని, కేంద్రం ఈ ఆదేశాలను శిరసావహిస్తున్నదని వివరించారు.

హక్కులతోపాటు చట్టమూ

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ ప్రతిష్టను ఎత్తిపడుతోందని రాష్ట్రపతి అన్నారు. సాగు చట్టాల చుట్టూ అల్లుకున్న అనుమానాలు, ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉన్నదని వివరించారు. అలాగే, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే శాంతియుత నిరసనలను, భావ ప్రకటన స్వేచ్ఛను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నదని చెప్పారు. కానీ, గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన కొన్ని ఘటనలు బాధాకరమని రైతు ట్రాక్టర్ ర్యాలీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాకు, గణతంత్ర దినోత్సవాన్ని అవమానించడం కలచివేసిందని వివరించారు. రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చినట్టే చట్టాలు, నిబంధనలకు అదేరీతిలో తప్పకుండా లోబడి నడుచుకోవాలని ఆశిస్తుందని తెలిపారు.

వ్యాక్సినేషన్ గర్వకారణం

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెసిడెంట్ ప్రశంసించారు. అంతేకాదు, ఇందులో వేసే రెండు టీకాలు దేశీయంగానే ఉత్పత్తి చేశారని వివరించారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచమానవాళికి ఆపన్నహస్తం అందిస్తున్నదని, లక్షలాది డోసులను విదేశాలకు పంపిస్తున్నదని తెలిపారు. జమ్ము కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఓటింగ్ పర్సెంటేజీ పెరిగిందని, తద్వారా సరికొత్త ప్రజాస్వామిక భవిత వైపుగా వెళ్తున్నదని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో హింసకు ఫుల్‌స్టాప్ పడిందని అన్నారు.

Tags:    

Similar News