డెసిషన్ పెండింగ్.. సీల్డ్ కవర్‌లోనే PRC రిపోర్టు!
ఏండ్ల నుంచి సీఎం కేసీఆర్పిలుపు కోసం ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు సీఎస్ నిర్ణయం కోసం పడిగాపులు పడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినా పీఆర్సీ ఫైల్ముందుకు కదలడం లేదు. వేతన సవరణ కమిషన్నివేదిక సీఎస్చేతికి అందినా దాన్ని అధ్యయనం చేసేందుకు సీల్డ్కవర్ఓపెన్చేయడం లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ అంశంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పలుమార్లు సమావేశమవుతున్నారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. అసలు త్రిసభ్య కమిటీలోని ఐఏఎస్ అధికారులకే ఇంకా సీఎస్ నుంచి పిలుపు రాలేదు. […]
ఏండ్ల నుంచి సీఎం కేసీఆర్పిలుపు కోసం ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు సీఎస్ నిర్ణయం కోసం పడిగాపులు పడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినా పీఆర్సీ ఫైల్ముందుకు కదలడం లేదు. వేతన సవరణ కమిషన్నివేదిక సీఎస్చేతికి అందినా దాన్ని అధ్యయనం చేసేందుకు సీల్డ్కవర్ఓపెన్చేయడం లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ అంశంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పలుమార్లు సమావేశమవుతున్నారు. కానీ ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. అసలు త్రిసభ్య కమిటీలోని ఐఏఎస్ అధికారులకే ఇంకా సీఎస్ నుంచి పిలుపు రాలేదు. అలాగే పదోన్నతుల్లో రెండేండ్ల సీనియార్జీ రూల్స్ పరిగణలోకి తీసుకునేందుకు సీఎస్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా దానిపై జీవో జారీ కాకుండా ప్రక్రియ ఎలా ముందుకెళ్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ‘జనవరి నెలాఖరు వరకు ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతుల అంశాలను తేల్చాలని సీఎం చెప్పారు. పీఆర్సీ నివేదిక అందిన వెంటనే త్రిసభ్య కమిటీ అధికారులు అధ్యయనం చేసి, ఓ కాపీని ఉద్యోగ సంఘాలకు ఇచ్చి, వారితో చర్చించాలని సూచించారు. సీల్డ్కవర్లో నివేదిక వచ్చి ఐదారు రోజులు అవుతుంది. కానీ ఎప్పుడు ఓపెన్చేయాలో సీఎస్చెప్పడం లేదు. ఇలాగైతో ఈ నెలాఖరు వరకూ పీఆర్సీ అంశం తేలడం కష్టమే’ అని ఏకంగా త్రిసభ్య కమిటీలోని ఓ సీనియర్ అధికారే అనడం గమనార్హం.
సీఎం హామీలు నెరవేరేనా?
ఈ నెలాఖరు వరకు ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలు తేలిపోవాలని గతనెల 30న ఉద్యోగ సంఘాల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ వేదికగా హామీ ఇచ్చారు. అదేరోజున బిస్వాల్కమిషన్వేతన సవరణ నివేదిక అందిస్తుందని, దీనిపై అధ్యయనం చేసి, ఈ నెల 6 లేదా 7న ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలంటూ సూచించారు. దీంతో పీఆర్సీ అంశంపై స్పష్టత వస్తుందని ఉద్యోగులు భావించారు. చెప్పినట్టుగానే అదేరోజున పీఆర్సీ నివేదికను సీఎస్‌కు అందించారు. వాస్తవంగా గతంలో ఎప్పుడైనా పీఆర్సీ కమిషన్నివేదికను సీఎంకే అందించారు. కానీ ఈసారి సీఎస్‌కు ఇచ్చారు. సీఎస్ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌ల త్రిసభ్య కమిటీ ఈ నివేదికను అధ్యయనం చేయాల్సి ఉంది. కానీ సీఎస్ఇప్పటి వరకు కమిటీతో భేటీ కాలేదు. సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నివేదిక ఇంకా ఓపెన్ చేయలేదు. జనవరి రెండో వారంలోనే పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఇంకా ఆ దిశగా అడుగులు పడడం లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సీఎస్‌ను కలిసినా సమాధానం రావడం లేదు. అయితే సీఎంకు వివరించిన తర్వాతే ఉద్యోగ సంఘాలకు కాపీ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇంత వరకూ త్రిసభ్య కమిటీ అధికారులే దీనిపై చర్చించలేదు. దీంతో ఈ నెలాఖరు వరకు పీఆర్సీ అంశాన్ని తేల్చుతారా? ఇంకా సాగదీస్తారా? అనే సందేహాలు ఉద్యోగ సంఘాల్లో నెలకొంది. ఇప్పటికే పలు సంఘాలు, ఉద్యోగులు ఉద్యోగ జేఏసీ వైఖరిని తూర్పారపడుతున్నారు.
మీరైనా చెప్పండి..
పీఆర్సీకి సంబంధించి సీఎం కేసీఆర్‌తో చర్చల సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కొంత బాధ్యత పెట్టారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి పేషీ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్‌టీయూ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం సీఎస్‌తో మాట్లాడారు. ఈ అత్యవసర సమావేశానికి కేవలం ఈ మూడు సంఘాలనే పిలిచారు. దీనిపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. పీఆర్సీ అంశంలో సీఎం సానుకూలంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చిన మంత్రి అధికారుల సాగదీతపై మాత్రం పెదవి విప్పలేదు. దీంతో టీజీఓ నేతలు మంగళవారం మరోసారి మంత్రితో భేటీ అయ్యారు. పీఆర్సీ అంశాన్ని తేల్చాలంటూ చెప్పుకొచ్చారు. కానీ మంత్రికి కూడా సరైన సమాచారం లేదని చెప్పుతున్నారు. మరోవైపు సీఎస్సమయం ఇవ్వడం లేదని, త్రిసభ్య కమిటీ అధ్యయనానికి పిలువడం లేదంటూ కమిటీలోని అధికారులు మంత్రులకు చెప్పుకుంటున్నారు.
సీఎం దగ్గరకే పీఆర్సీ నివేదిక?
మరోవైపు బీఆర్కే భవన్ నుంచి మాత్రం పీఆర్సీపై పలు ప్రచారం వస్తోంది. సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నివేదికను సీఎం కేసీఆర్దగ్గరే ఓపెన్ చేస్తారని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ నివేదికను ముట్టుకోవడం లేదంటున్నారు. కానీ సీఎం కేసీఆర్వారం కిందటే నివేదికపై అధ్యయనం చేయాలని త్రిసభ్య కమిటీకి సూచించారు.
‘రెండేండ్ల’పై జీవో ఏది?
పదోన్నతుల్లో రెండేండ్ల సీనియార్జీ నిబంధనలను పరిగణలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ చెప్పినట్లు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటిస్తున్నారు. కానీ దీనిపై జీవో జారీ చేయకుండా ఎలా ప్రక్రియను చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా ప్రస్తుతం మూడేండ్ల సీనియార్జీ నిబంధననే నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన 230 జీవోనే ఇంకా పరిగణలోకి తీసుకుంటున్నారు. రెండేండ్ల కిందట రెండేండ్ల సర్వీసుపై ప్రభుత్వం జీవో జారీ చేసి ఒక ఏడాది అమలు చేసింది. దీంతో పలువురికి పదోన్నతులు వచ్చాయి. మళ్లీ ఆ జీవోను జారీ చేయలేదు. దీంతో ఇప్పుడు జారీ చేస్తే చాలా మందికి పదోన్నతులు వస్తాయని భావిస్తున్నారు.