అన్నం పెట్టండి ‘మహా’ ప్రభో.. పేదల ఎదురుచూపులు
దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో లాక్‌డౌన్ విధించడంతో అన్నార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఆకలి సమయానికి అన్నం దొరక్క కడుపు పట్టుకొని నిద్రపోతున్న వారికి ‘అన్నపూర్ణ’ దూరంగా జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్లతో భోజనం అందిస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ.. ఛార్జీలు వసూలు చేస్తోంది. అది కూడా తమ సమయం ప్రకారమే సెంటర్లను ఓపెన్ చేస్తుండగా.. రాత్రి పూట ఆకలి తప్పడం లేదు. ముఖ్యంగా కొవిడ్చికిత్స అందుకుంటున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఆకలి బాధలు వర్ణాణతీతం. […]
దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో లాక్‌డౌన్ విధించడంతో అన్నార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఆకలి సమయానికి అన్నం దొరక్క కడుపు పట్టుకొని నిద్రపోతున్న వారికి ‘అన్నపూర్ణ’ దూరంగా జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్లతో భోజనం అందిస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ.. ఛార్జీలు వసూలు చేస్తోంది. అది కూడా తమ సమయం ప్రకారమే సెంటర్లను ఓపెన్ చేస్తుండగా.. రాత్రి పూట ఆకలి తప్పడం లేదు. ముఖ్యంగా కొవిడ్చికిత్స అందుకుంటున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఆకలి బాధలు వర్ణాణతీతం.
గతేడాది ఉచితంగా భోజనాన్ని అందించిన జీహెచ్ఎంసీ తాజాగా పరిమిత సేవలు అందిస్తుండటంతో లాక్‌డౌన్, ఆకలి కలిసికట్టుగా పేదలపై దాడి చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆశ్రయం లేనివారికి, ఫుట్‌పాత్‌లపై జీవించే వారికి, జిల్లాల నుంచి కొవిడ్ ఆస్పత్రులకు వచ్చిన పేషంట్ల కుటుంబ సభ్యులకు లాక్‌డౌన్ కష్టాలు మొదలయ్యాయి. ఒక్కసారిగా లాక్‌డౌన్ విధించడంతో వారంతా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. పనిచేస్తున్న దుకాణాలు, హోటళ్లు మూతపడటంతో ఇప్పుడు వారికి భోజనం పెట్టేవారు కరువయ్యారు. ప్రార్థన మందిరాల్లో ప్రసాదాలు, బిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో కడుపు నింపుకునే వారు కూడా సిటీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.
లాక్‌డౌన్ విధించడంతో వీరందరికీ బతుకు భారమవుతోంది. అకస్మాతుగా లాక్‌డౌన్ విధించడంతో ఇలాంటి అభాగ్యులు పొట్ట నింపుకోవడం గగమనవుతోంది. వీరితో పాటు కొవిడ్చికిత్స కోసం నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చిన సహాయకులు కూడా ఆకలికి అలమటిస్తున్నారు. వీరందరికీ భరోసాగా జీహెచ్ఎంసీ అన్నపూర్ణ భోజనం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పలు సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
జీహెచ్ఎంసీలో 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా గురువారం 45 వేల భోజనాలు అందించామని అధికారులు ప్రకటించారు. సాధారణ రోజుల్లో 35–40 వేల భోజనాలు అందిస్తున్నట్టు బల్దియా చెబుతుండగా.. రెండు రోజుల్లో కేవలం ఐదు వేల మందికి భోజనాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో వేల మందికి కొవిడ్చికిత్స పొందుతుండగా.. వారితో పాటు వచ్చిన కుటుంబ సభ్యులకు ఆశ్రయం, భోజనం తీవ్ర సమస్యలుగా మారుతున్నాయి.
గాంధీ, టిమ్స్ సహా పెద్ద ఆస్పత్రుల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. వీరికి పాత పద్ధతిలో ఉదయం పదిన్నర తర్వాత అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాయి. తెచ్చిన భోజనాలు అయిపోతే మిగిలిన వారి కోసం తెప్పించడం లేదు. బల్దియా ఒక పూట భోజనమే ఇస్తుండగా.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు కష్టమవుతోంది. ఆస్పత్రులకు వచ్చిన వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే ఉంటారు. వీరికి మూడు పూటలా అన్నం తినడమే అలవాటుగా ఉంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఉండటంతో తెలిసిన వారి నుంచి అన్నం తెప్పించుకోవడం ప్రతీసారి సమస్య అవుతుండటంతో ఎక్కువగా అన్నపూర్ణ క్యాంటీన్లపైనే ఆధారపడుతున్నారు.
మరో వైపు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పనిచేసే ప్రదేశాల్లో ఆశ్రయం పొందేవారు, ఫుట్‌పాత్‌లు ఆవాసంగా బతికే వారికి ఇప్పుడు ఆదాయం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లోనూ బల్దియా భోజనానికి రూ. 5 వసూలు చేస్తోంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో అందరికీ ఉచితంగా భోజనాన్ని అందించిన జీహెచ్ఎంసీ ఈ సారి ఉచితంగా ఇవ్వడం లేదు. దీంతో పనిచేసి దాచుకున్న ఆ కొంత మొత్తాన్ని భోజనం కోసం ఖర్చు చేయాలంటే వెనకాడుతున్నారు.
2020 మే నెలలో పూర్తి లాక్‌డౌన్ ఉన్న సమయంలో ప్రతీ రోజూ లక్షన్నర భోజనాలను ఉచితంగా ఇచ్చిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం ఎందుకో అటువైపు చూడటం లేదు. రోజులో ఒక పూట మాత్రమే భోజనం ఇస్తుండటంతో రెండో పూట ఆకలి తప్పడం లేదు. గతంలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లు అదే స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. రెగ్యులర్‌గా వెళ్లేవారు తప్ప కొత్తవారికి భోజనం ఎక్కడ పెడుతారో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంచార అన్నపూర్ణ క్యాంటీన్లను నిర్వహించడం ద్వారా పేదలకు అన్నం అందించడం సులభమవుతోంది. దీంతో పాటు రాత్రి పూట కూడా భోజనం అందించాలని పేషంట్స్ కుటుంబ సభ్యులు, అన్నపూర్ణపై ఆధారపడిన పేద ప్రజలు కోరుకుంటున్నారు.