రంజాన్ ఉపవాసాలు కావు..

– పేద ముస్లింల పస్తులు – పాత బస్తీ ముస్లింలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్ దిశ, న్యూస్ బ్యూరో : రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తుంటారు. కానీ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద ముస్లింలు మాత్రం ప్రస్తుతం ఖాళీ కడుపులతో పస్తులుంటూ.. అదే రంజాన్ ఉపవాసంగా కాలం వెళ్లదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ మాసంలో దానధర్మాల రూపంలో మసీదుల దగ్గర ఎంతో కొంత డబ్బు లేదా వస్తువులు […]

Update: 2020-04-30 08:47 GMT

– పేద ముస్లింల పస్తులు
– పాత బస్తీ ముస్లింలపై లాక్‌డౌన్ ఎఫెక్ట్

దిశ, న్యూస్ బ్యూరో : రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తుంటారు. కానీ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద ముస్లింలు మాత్రం ప్రస్తుతం ఖాళీ కడుపులతో పస్తులుంటూ.. అదే రంజాన్ ఉపవాసంగా కాలం వెళ్లదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ మాసంలో దానధర్మాల రూపంలో మసీదుల దగ్గర ఎంతో కొంత డబ్బు లేదా వస్తువులు అందేవి. కానీ, ఇప్పుడు కరోనా వారి జీవితాలను అతలాకుతలం చేసింది. మసీదులు లేవు.. దయకలిగినవారి నుంచి దానధర్మాలూ అందడంలేదు. కాగా, నగరంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని 2,528 ఇండ్లల్లో ‘హెల్పింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన శాంపిల్ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

సర్వేలో పాల్గొన్న గృహస్తుల ఆర్థిక, సామాజిక స్థితితో పాటు వారికి ప్రభుత్వ పథకాలు అందకపోవడమూ పేదరికానికి కారణమని సంస్థ సర్వేలో వెల్లడైంది. ఓల్డ్ సిటీలోని 50 మురికివాడల్లో జరిగిన ఈ సర్వే ఫలితాలను మేనేజింగ్ ట్రస్టీ ముజ్తఫా హసన్ అస్ఘరీ మీడియాకు వెల్లడించారు. సర్వేలో వెల్లడైన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ 2,149 (85 శాతం) కుటుంబాలు రోజూ కూలీ పనుల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొంది. ఇక హోటళ్లు, వెల్డింగ్ షాపులు, కిరాణ దుకాణాలు, మెకానిక్ షాపులు, బట్టల దుకాణాలు, ఎలక్ట్రీషియన్ వంటి పనులు చేస్తున్నవారు 1,416 (56శాతం) మంది ఉన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారి సంఖ్య 607 (24శాతం), ఇక ఆఫీస్ తరహా డ్యూటీలు చేసేవారు 200 మందిలోపే ఉన్నారని సర్వేలో తేలింది. ఇక మొత్తం సర్వేలో 556 కుటుంబాలకు వివిధ కారణాలతో ప్రభుత్వ రేషన్ అందడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. వీరిలో రేషన్ కార్డులు లేనివారితో పాటు ఫింగర్ ప్రింట్ సరిపోకపోవడం, పేర్లు సరిగా రాయకపోవడం వంటి కారణాలతో రేషన్ అందనివారు కూడా ఉన్నారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ప్రతీరోజు తమ దైనందిన ఆహార అవసరాలకు సగటున ఒకరికి రూ.15 చొప్పున ఖర్చు చేస్తుండగా, రేషనుకార్డు లేని కుటుంబాలు మాత్రం తలసరి రూ. 30 చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.

రేషన్ బియ్యం సరే.. సరుకులెట్లా?

ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి తలా 12 కిలోల చొప్పున 60 కిలోల రేషన్ బియ్యం అందుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పలు స్వచ్చంధ సంస్థలు కూడా బియ్యం అందజేస్తున్నాయి. అయితే వండుకోవడానికి అసవరమైన నూనె, పప్పులు, ఇతర నిత్యవసరాలు కొనుక్కునేందుకు మాత్రం ఈ కుటుంబాల దగ్గర డబ్బులు లేవు. సర్వే చేసిన ముస్లిం కుటుంబాల్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నవారు 24% మంది (607) అని తేలగా.. ఇందులో 35% మందికి డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు ఉన్నాయి. ఇక వీరికి సంతానం సగటున ముగ్గురు ఉన్నట్టు తేలింది. ఆటోలు నడుపుతూ బతుకున్న వీరిలో 262 మందికి స్వంత ఆటోలు ఉన్నాయి. అయితే బ్యాంకు రుణం తీసుకుని కొనుక్కున్నందున ప్రతీ నెలా ఈఎంఐ కట్టాల్సి ఉంది. ప్రతీ రోజూ ఆటో నడిపితేనే వీరి కుటుంబాలు నడుస్తాయి. లాక్‌డౌన్‌తో ఈ కుటుంబాల పరిస్థితి దిగజారినట్లు సర్వే ద్వారా తేలింది.

యాకుత్ పురా, మలక్ పేట, చార్మినార్, చంద్రాయణగుట్ట, ఇబ్రహీంబాగ్, చింతల్ మెట్, తలాబ్ కట్ట, బజార్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లోని 50 మురికి వాడల్లో నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైన వివరాలు

మొత్తం ప్రజలు ప్రాతినిధ్యం: 36.3 లక్షలు

షాంపిల్ సర్వే కుటుంబాలు: 2,528
దినసరి సంపాదన మీద ఆధారం: 2,149
కిరణా దుకాణాలు, హోటళ్లు, వెల్డింగ్ వంటి పనులు చేసేవారు: 1,416

ఆటో, క్యాబ్ డ్రైవర్లు: 607
రేషన్ అందని వారు: 556
నెలవారీ జీతాలు వచ్చే ఉద్యోగాలు: 200 మంది లోపే

Tags: Lockdown, Telangana, GHMC, old city, Ramzan,

Tags:    

Similar News