షర్మిలకు రాజకీయ అవగాహన లేదు.. అందుకే జగనన్నపై విషం చిమ్ముతోంది : రోజా ఫైర్

రాజకీయ అనుభవం లేని వైఎస్ షర్మిల రెండు పార్టీల మధ్య పావుగా మారి, జగనన్నపై విషం చిమ్ముతోందని మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.

Update: 2024-02-23 07:13 GMT

దిశ, తిరుమల : రాజకీయ అనుభవం లేని వైఎస్ షర్మిల రెండు పార్టీల మధ్య పావుగా మారి, జగనన్నపై విషం చిమ్ముతోందని మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. డీఎస్సీపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018 డిఎస్సీల ద్వారా ఇవ్వాల్సిన దాదాపు 17వేల భర్తీలను ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని తెలిపారు. ఇది కాకుండా మరో ఆరువేల భర్తీలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.

నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా, తెలంగాణకు వెళ్లి నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణకు అండగా ఉంటానని చెప్పిన ఆమె, ఈరోజు జగనన్న పై విషయం చిమ్ముతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదు అనడానికి నిన్న ఆమె చేసిన హడావిడి చూస్తేనే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. షర్మిల ఆరాటాలు, పోరాటాలు చూస్తే ప్రజలకు ఇప్పటికే విషయం అర్థం అయిపోయిందన్నారు. ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకం అన్నారు. ఇందులో షర్మిలను పావుగా వాడుకుంటున్నారన్నది అందరికీ అర్థమవుతోందని స్పష్టం చేశారు.

ఆస్తుల పంపకాల విషయంలో చంద్రబాబు ఎంత మంచోడో, వాళ్ళ అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్యకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల విషయంలో ఏదో పిచ్చి మాటలు తప్ప మరోటి లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన బిడ్డలు జగనన్నకు షర్మిలకు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులను కూడా ఎప్పుడో రాసి, పంచిచ్చేశారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు ఇలాంటి లేనిపోని పిచ్చి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.


Similar News