బీజేపీ నేతలపై వరుస దాడులు దేనికి సంకేతం..?
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయమున్నా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతోంది. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయమున్నా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి మునుగోడు ఉప ఎన్నికలు తోడవడంతో మరింత ఊపందుకుంది. ఈ బైపోల్ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బీజేపీ నేతలపై అధికార పార్టీ నేతల వరుస దాడులు కొనసాగుతున్నాయి. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతల నడుమ బాహాబాహీ జరిగింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం జనగామలోనూ టీఆర్ఎస్ పార్టీ నేతల దాడితో బీజేపీ నేతల తలలు పగిలిన సంఘటనలున్నాయి. కాగా తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న మూడో విడుత పాదయాత్రతో మరోసారి జనగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జనగామ జిల్లాలో దేవరుప్పలలో జరిగిన దాడిలో బీజేపీ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. గతంలో జనగామ జిల్లాలో కేసీఆర్ నిర్వహించిన సభ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని ఇంతింతి పార్టీ అంటూ చేసిన విమర్శలతో రగడ మొదలైంది. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్ 15, 16 తదీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మిర్యాలగూడ పట్టణ శివారులో బండి సంజయ్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. అయినా వెనుదిరగకుండా బండి సంజయ్ రైతుల వద్దకు వెళ్లడంతో ఇరు పార్టీల నేతలను, కార్యకర్తలను అడ్డుకోవడం, కట్టడి చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. తీరా రైతులతో మాట్లాడే సమయంలో ఆగి ఉన్న బండి సంజయ్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతల మధ్యనే సాగింది. నల్గొండలోని ఆర్జాల బావి ఐకేపీ సెంటర్ వద్ద రైతులతో మాట్లాడడానికి వెళ్ళిన బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేయించడంతో ఇరు పార్టీల నడుమ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మునుగోడు బైపోల్‌తో ఈ వార్ మరింత ముదిరింది. ఫ్లెక్సీలు కూడా చింపేంత స్థాయికి చేరుకుంది. మొన్న దేవరుప్పలలో జరిగిన పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ విషయంలో పోలీసుల బందోబస్తు వైఫల్యంపై బండి సంజయ్ డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు పాలకుర్తిలో బీజేపీ సభకు ఎవరినీ రానివ్వకుండా షాపులు క్లోజ్ చేయించడంపై కూడా బీజేపీ శ్రేణులు అధికార పక్షంపై మండిపడ్డారు. ప్రజలు సభకు రాకుండా పోలీసులను వాడుకొని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తచేశారు. పోలీసులను అడిగితే రాళ్ల దాడి జరగకుండా అందరినీ ఖాళీ చేయిస్తున్నామని చెప్పడం కొసమెరుపు.
బండి సంజయ్ చేపడుతున్న మూడో విడుత పాదయాత్ర ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలమీదుగా సాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా దాటే వరకు బాగానే ఉన్నా ఉమ్మడి వరంగల్‌లోకి ఎంటరయ్యాకే దాడులు జరగడంపై పలు అనుమానాలు బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. దాడులను అధికార పార్టీకి చెందిన మంత్రి ఉసిగొల్పుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఏమాత్రం ఉనికే లేని పార్టీకి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని బీజేపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి జాయినింగ్స్ పెరగడం కూడా ఇందుకు కారణంగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే ఈసారి రెచ్చగొడితే మాత్రం సహించేది లేదని కాషాయదళం ముందస్తుగానే హెచ్చరికలు జారీచేసింది.