KCR :కేసీఆర్‌కు షాకిచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు
బీఆర్ఎస్ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి పోరు తప్పడం లేదు.
దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి పోరు తప్పడం లేదు. 75 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి చేసిందేమి లేదని, దేశం అభివృద్ధి బాటలో నడవాలంటే ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని కుండబద్దలు కొట్టిన కేసీఆర్.. దేశంలో మార్పు కోసం తాను కంకణం కట్టుకున్నానని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తానని చెబుతున్న కేసీఆర్‌కు పొరుగున ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్ ప్రధానంగా తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ మిగతా రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. ఇందుకోసం గత కొంత కాలంగా వివిధ రాష్ట్రాల్లో ఇక్కడ టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్‌లకు సంబంధించిన ప్రచారాన్ని పెద్ద ఎత్తున అడ్వటైజ్ చేయిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పొరుగున ఉన్న ముఖ్యమంత్రుల నిర్ణయాలు కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పారేస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాక్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మరువక ముందే తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని జర్నలిస్టులను ఇదివరకే ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా జర్నలిస్టులకు నెలవారీ పెన్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నుంచి పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టరేట్ నుంచి ప్రతి నెల రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలోనూ ఈ తరహా పెన్షన్ స్కీమ్ తీసుకురావాలనే డిమాండ్లు జర్నలిస్టుల నుంచి వినిపిస్తోంది. జర్నలిస్టుల విషయంలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించారనే విమర్శలు ఉన్నాయి. చాలా మంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సమయంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని నిత్యం జర్నలిస్టు సంఘాలు వినతిపత్రాలు, నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి విషయాన్ని పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూపించే కేసీఆర్‌కు స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న పది వేల పెన్షన్ స్కీమ్ నిర్ణయం ఇరకాటంలో పెట్టినట్లైందనే టాక్ వినిపిస్తోంది.
మరో పొరుగు రాష్ట్రమైన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంపై కూడా తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒడిశాలో కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసింది. అలాగే ఇప్పటి వరకు పని చేసిన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ ఇష్యూపై తెలంగాణలోనూ చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండబోరని, కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారందరిని రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. కానీ ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చుకోవడం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థనే రద్దు చేస్తామని చెప్పిన సీఎం... ఆ తర్వాత అనేక సందర్భాల్లో కాంట్రాక్టు ద్వారానే ఖాళీలను భర్తీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రెగ్యులరైజ్ విషయంలో ఇన్నాళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం ఇటీవల ఆ దిశగా కసరత్తు ప్రారంభించినా ఆ కసరత్తు నత్తకు నడకలు నేర్పుతున్న చందంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాను దేశంలోనే అద్భుతమైన పరిపాలన అందిస్తానని చెబుతున్న కేసీఆర్ తెలంగాణలో ఎందుకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగులర్ చేయడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ బాస్ కు పొరుగు రాష్ట్రాలు తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.