BRS కాదు TRS... సర్వేలో ఎమ్మెల్యేలు, ఎంపీల షాకింగ్ రియాక్షన్

పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్పు చేసింది ఆ పార్టీ అధిష్టానం. మారిన పేరుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది.

Update: 2023-01-11 02:20 GMT

పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్పు చేసింది ఆ పార్టీ అధిష్టానం. మారిన పేరుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది. కానీ క్షేత్ర స్థాయిలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రజల విషయం పక్కన పెడితే.. ఆ పార్టీ నేతల్లోనే ఎక్కువ మంది బీఆర్ఎస్‌ పేరును పలుకడం లేదు. మరి కొందరు ముందు పాత పేరు పలికినా.. తర్వాత దానిని సవరించుకుంటున్నారు. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పార్టీ పేరు మారిన విషయాన్ని మర్చిపోయిన నేతలు.. మరి బీఆర్ఎస్ పేరును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది డిసెంబర్ 9న ఆమోదం తెలిసింది. బీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ 'దేశ్ కా నేత' అంటూ కీర్తించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తారని, బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ 'పీపుల్స్ పల్స్' అనే సంస్థ ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో కీలక విషయాన్ని పసిగట్టింది. లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభ, మండలిలోనూ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారినా.. పార్టీ నేతల మనసుల్లో మాత్రం ఇంకా టీఆర్ఎస్ అనే భావనే నెలకొన్నది.

బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పి వివిధ రాష్ట్రాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నా దీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్నవారికి ఇంకా కొత్త పేరు అలవాటు కాకపోవడం గమనార్హం. పార్టీ పేరును జనంలోకి తీసుకెళ్ళడంలో నేతల తీరుతో అనిశ్చితి కొనసాగుతున్నది. ఇక ప్రజాబాహుళ్యంలోకి పార్టీ పేరును ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ శ్రేణులే కొత్త పేరును పలకకపోవడంతో ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారన్న ప్రాథమిక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో స్వరాష్ట్రంలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసలే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతల ద్వారానే ఏ తరహా గందరగోళం ముంచుకొస్తుందోననే భయాలూ లేకపోలేదు.

1625 మందికి ఫోన్..

పీపుల్స్ పల్స్ సంస్థ ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని 17 జిల్లాల్లోని 51 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 1,625 మందితో (ఎంపీలు, ఎమ్మెల్యేలు మొదలు వివిధ స్థాయిలోని నేతలు) ఫోన్‌లో మాట్లాడింది. పార్టీకి సంబంధించిన అంశాలపై వారితో ముచ్చటించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత.. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో పాటు శ్రేణుల్లోకి కొత్త పేరు ఏ మేరకు వెళ్లిందనే విషయాన్ని ఆరా తీయడానికే ఫోన్ ద్వారా సంభాషణలు, ముచ్చట్ల రూపంలో సర్వే నిర్వహించింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో క్విక్/ఇన్‌స్టాంట్ సర్వే పద్ధతిలో ఈ అధ్యయనం చేసింది. పార్టీ నేతల్లో కొత్త పేరు ఏ మేరకు నాటుకుపోయిందో, ఏ మేరకు ప్రజా బాహుళ్యంలోకి వెళ్లిందో ఈ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది. వీరిలో 72% మంది పార్టీ పేరును టీఆర్ఎస్‌గానే పలుకుతున్నట్టు తేలింది. దాదాపు 21% మంది తొలుత టీఆర్ఎస్ అని పలికి ఆ తర్వాత దాన్ని బీఆర్ఎస్‌గా సవరించుకున్నారు. కొత్త పార్టీ పేరు ఉనికిలోకి వచ్చిన తర్వాత డైరెక్టుగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే బీఆర్ఎస్ అని పలికినవారు కేవలం 4% మంది మాత్రమే అని తేలింది. పార్టీ పేరును ప్రస్తావించకుండా గులాబీ అనే తీరులో పలికిన వారు 3%గా ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తన నివేదికలో పేర్కొన్నారు.

సర్వే తీరు..

తేదీలు                                                             : జనవరి 5 నుంచి 9 వరకు

విస్తృతి                                                             : 51 మండలాలు (17 జిల్లాల్లో)

శాంపిల్ సైజ్                                                    : 1,625 మంది

అంశం                                                              : బీఆర్ఎస్ అని పలుకుతున్నారా? లేక టీఆర్ఎస్సా?

టీఆర్ఎస్ అని పలికినవారు                             : 72% మంది

తడబడి బీఆర్ఎస్ అని సవరించుకున్నవారు : 21% మంది

బీఆర్ఎస్ అని పలికినవారు                             : 4% మంది

పార్టీ పేరును ప్రస్తావించనివారు                         : 3% మంది


Similar News