AP Politics: సెంటిమెంట్‌.. మరోసారి నిజమైంది..

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ సెంటిమెంట్‌ను నిలబెట్టుకుంది.

Update: 2024-06-05 06:43 GMT

దిశ, ఏలూరు: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మళ్లీ సెంటిమెంట్‌ను నిలబెట్టుకుంది. ఏలూరులో గెలిచిన పార్టీనే అధికారం చేబడుతుందని దశాబ్దాలుగా సెంటిమెంట్‌గా వుంది. 1983లో టీడీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ గెలిచిన పార్టీలే అధికార పీఠాన్ని అధిరోహించాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఏలూరు స్థానాన్ని గెల్చుకోగా,1985 మధ్యంతర ఎన్నికలలో కూడా టీడీపీనే గెలిచింది.

ఈ రెండుసార్లూ టీడీపీనే రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. 1989లో కాంగ్రెస్‌ ఏలూరు స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆ పర్యాయం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. 1994, 1999 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ పుంజుకుని విజయం సాధించింది. ఈ రెండు సందర్భాల్లో టీడీపీనే అధికార పీఠం ఎక్కింది.

విభజన తర్వాత కూడా..

2004, 2009 లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొంది వైఎస్‌ రాజశేఖర రెడ్డి నాయత్వంలో కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏలూరు సెంటిమెంట్‌ కొనసాగింది. 2014లో ఏలూరు నుండి బడేటి బుజ్జి గెలుపొందడంతో టీడీపీకి అధికారం దక్కింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి ఆళ్ల నాని గెలిచారు.

ఆ ఎన్నికల్లో విజయ భేరి మోగించిన వైసీపీ, జగన్‌ నాయకత్వంలో అధికారం దక్కించుకుంది. ఇప్పుడు 2024లో ఏక పక్షంగా టీడీపీ అభ్యర్థి బడేటి చంటి విజయం సాధించారు. ఏలూరు సెంటిమెంట్‌ మళ్లీ ఫలించి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది.


Similar News