అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన టీడీపీ.. చంద్రబాబు ఫ్లెక్సీలపై చెప్పులతో దాడి
విభజిత అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టీడీపీలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి.
దిశ, ప్రతినిధి, కడప : విభజిత అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టీడీపీలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి.అక్కడి పార్టీ ఇన్చార్జి రమేష్ కుమార్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వలేమంటూ అధిష్టానం నుండి ఫోన్ రావడంతో రమేష్ కుమార్ రెడ్డి అనుచరులు అసంతృప్తితో రగిలిపోయారు. లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్లు కూడలిలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టీడీపీ జెండాలకు, కరపత్రాలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు పోస్టర్ల పైన చెప్పులతో చితకబాదుతూ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
రాయచోటి టీడీపీ టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయిస్తున్నారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. పార్టీ పదవులకు శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి అనుచర వర్గం ప్రకటించింది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కూడా రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పార్టీ ఇన్చార్జిగా నిరంతరం కృషి
రాయచోటి టీడీపీ ఇంచార్జ్‌గా రమేష్ రెడ్డి గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్నారు. రమేష్ రెడ్డి 1999 లో లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లి నియోజక వర్గాన్ని రాయచోటి నియోజకవర్గంలో కలిపారు. అప్పటి నుండి రమేష్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. రాయచోటి అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ పార్టీ పిలుపు ఇచ్చిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ విజయవంతం చేశారు. అయితే పార్టీ టికెట్‌ను రమేష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడు కుమారుడు ఎస్.ప్రసాద్ బాబు ఆశించారు.
ఈ క్రమంలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివంగత ఎం. నాగిరెడ్డి కుమారుడు ఎం.రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం ఈ నలుగురు పోటీ పడ్డారు. ఎవరికి వారు ప్రచారాలు నిర్వహించుకుంటూ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి టికెట్ ఖారారు అయిందంటూ ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. దీంతో రమేష్ రెడ్డి వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
రమేష్ రెడ్డి గత రెండు రోజుల క్రితం తన వర్గీయులతో సమావేశమై టికెట్ తనకే కేయాయించాలని, గత రెండు దశాబ్దాలుగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా వేరే పార్టీలో నుండి వచ్చిన వారికి ఇస్తే సహించేది లేదని అదిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల మధ్య శుక్రవారం రాత్రి పార్టీ అధిష్టానం రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం లేదని సంకేతాలు ఇచ్చినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలు, బ్యానర్లు దగ్ధం చేసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, రమేష్ రెడ్డి తమ్ముడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి సతీమణి ఆర్.మాధవి రెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే టికెట్ అని అదిష్టానం ప్రకటించడంతో రమేష్ రెడ్డికి టికెట్ రాలేదని,. టికెట్ అన్నదమ్ముల కుటుంబంలో చిచ్చు పెట్టిందని రమేష్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
భారీగా రాజీనామాలకు సిద్ధం
అన్నమయ్య జిల్లా టీడీపీలోని 11 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, 44 యూనిట్ ఇన్చార్జ్‌లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, ఆరుగురు పార్టీ మండల అధ్యక్షులు, ఒక పట్టణ అధ్యక్షుడు, 8 జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలుగు యువత నాయకులు, 20 మంది సభ్యులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీ లు, సర్పంచ్‌లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, ప్రస్తుత 9 మంది సర్పంచ్‌లు, 80 మంది గ్రామ కమిటీ అధ్యక్షులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు ప్రకటించారు.
Read More..
రక్తతర్పణం చేసిన కనికరించని చంద్రబాబు.. ఫస్ట్ లిస్ట్‌లో వీర విధేయుడి పేరు మిస్సింగ్..!