AP Politics: గెలిచింది చంద్రబాబు.. గెలిపించింది పవన్

రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా సంభవించిన పెను తుఫానుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూత్రధారి అయ్యారు.

Update: 2024-06-05 06:57 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా సంభవించిన పెను తుఫానుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూత్రధారి అయ్యారు. ఈ విజయం వెనుక చంద్రబాబు నాయుడి కంటే పవన్ కల్యాణ్ కృషి, వ్యూహం, త్యాగం ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ముందుచూపుతో నాలుగు మెట్లు దిగి, సీట్లు త్యాగం చేసి కుదిర్చిన పొత్తులు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

జైలుకి వెళ్లి మద్దతివ్వడమే సాహస చర్య..

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. దానికి కొనసాగింపుగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో మంతనాలు జరిపి మూడు పార్టీల పొత్తుకు సంధాన కర్తగా వ్యవహరించారు.

సీట్ల త్యాగం

పొత్తు కారణంగా బీజేపీకి సీట్లు ఇవ్వాల్సి రావడంతో జనసేన తనకోటా సీట్లను త్యాగం చేయాల్సివచ్చింది. ఆ సమయంలో పలువురి నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా పవన్ తన వైఖరి మార్చుకోలేదు. తక్కువ సీట్లకు పోటీ చేసినా వంద శాతం విజయమే లక్ష్యమని చెప్పారు. ఆ విధంగానే పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌సభ సీట్లలో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు.

కాగా ఈ విజయంలో పవన్ కళ్యాణ్ పాత్రను బాగా గుర్తించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రాబాబు నాయుడు మంగళవారం రాత్రి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. పరస్పరం ఇలాగే సహకరించుకుంటూ ముందుకు వెళ్ధామని స్పష్టం చేశారు.

ఎక్కడ తగ్గాలో తెలసిన వాడే పవన్..

తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ తగ్గాలో తెలుసని, ఈ ఎన్నికల్లో పవనే గేమ్ ఛేంజర్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. పవన్ చేసిన కృషికి ఈ ఎన్నికల్లో ఫలితాలు కనిపించాయని ఆయన వవన్‌ను అభినందించారు.


Similar News