చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పజెప్పిన ఓకే.. కన్నా లక్ష్మీనారాయణ
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన 6నెలల్లోపే ఆరాచక పాలన మెుదలైందని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన 6నెలల్లోపే ఆరాచక పాలన మెుదలైందని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అరాచక పాలనకు తోడు పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు. గుంటూరులోని తన నివాసంలో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. అరాచకాలు చేస్తున్న వారిని వదిలి.. పోరాటం చేసే వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తుందని ధ్వజమెత్తారు. జగన్ అధికారం శాశ్వతం కాదు, ప్రజలు తిరగబడిన రోజున మీకు ఎవరు తోడుండరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ మీడియా తనపై అసత్యఆరోపణలు చేయటానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
గత ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటే సీఎం వైఎస్ జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. తన యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏనాడూ ఇలాంటి దుస్థితి చూడలేదని చెప్పుకొచ్చారు. కళ్ల ముందే అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు..పోలీసులే పట్టించుకోకపోతే ఎవరి దగ్గరకు వెళ్లాలని ప్రశ్నించారు. డీజీపీ తక్షణమే రాష్ట్రంలో జరిగే అరాచకాలకు స్వస్తి పలకాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఇకపోతే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ని సోమవారం పోలీసులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి ఆయన కనిపించడంలేదని చెప్పుకొచ్చారు. పట్టాభి తప్పు చేస్తే కోర్టులో హాజరుపరచాలని లేకుంటే ఆయన ఎక్కడున్నాడో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చెప్పుకొచ్చారు.
ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా
ఈనెల 23న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. తనతోపాటు తన అనుచరులు అంతా టీడీపీలో చేరతారని వెల్లడించారు. తెలుగు దేశంలో తన పాత్ర ఏమిటో అనేది అధినేత తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.