రేవంత్ రెడ్డి ప్లెక్సీకి పేడ కొట్టిన గొల్ల కురుమలు.. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్..
ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం గొల్ల కురుమల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం గొల్ల కురుమల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్లెక్సీకీ పేడ కొట్టారు. ఈ నెల 24 వ తేదీ లోపు గొల్ల కురుమలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే మరుసటి రోజే గాంధీ భవనం ముట్టడిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకానీ శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
వృత్తి పరంగా చేసుకునే పనిని కించపరుస్తూ గొల్ల కురుమల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన ప్రసంగాలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో గొల్ల కురుమల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాగా బస్టాండ్ ఎదుటే నడిరోడ్డుపై ధర్నా కార్యక్రమానికి టెంటు వేయడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ ను నియంత్రించలేక చేతులెత్తేశారు. దీంతో గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.