‘తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దు’
సుదీర్ఘ చర్చల తర్వాత ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి హస్తం గూటికి ఆహ్వానించారు.
దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ చర్చల తర్వాత ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి హస్తం గూటికి ఆహ్వానించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందని.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు విస్తృతం అయ్యాయి. ఈ క్రమంలో ఆమెపై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడానికి వీళ్లేదు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్‌లో నాయకులు లేరా? ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించే స్థితిలో రాష్ట్రంలో పార్టీ ఉందా? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు హర్ష కుమార్ ప్రకటించారు. జగన్‌ను గద్దె దించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 8న తేదీన రాజమహేంద్రవరంలో దళిత సింహ గర్జన ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.