ఒక్కొక్కరిది ఒక్కో కథ..!

ఎన్నికల ఫలితాల విషయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది.

Update: 2024-06-06 06:47 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల ఫలితాల విషయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో 14కు14 శాసనసభా స్థానాలను, రెండుకు రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకుని టీడీపీ కూటమి విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గెలుపొందిన శాసనసభ స్థానాలు, అభ్యర్థుల ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బద్దలైన ఉరవకొండ సెంటిమెంటు..

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అభ్యర్థి ఉరవకొండలో ఓడిపోతారనే సెంటిమెంటు చాలాకాలంగా ఉండేది. నిజానికి ఎక్కువసార్లు అలా జరగడం వల్ల ఏర్పడ్డ సెంటిమెంటే తప్ప అది పూర్తిగా నిజం కాదని ఇటీవల 'దిశ' వెల్లడించింది. 1983లోనూ, 1994 లోనూ ఏ విధంగా అందుకు భిన్నంగా జరిగిందో కూడా స్పష్టం చేసింది. తిరిగి ఆ సెంటిమెంటు ఈసారి బద్దలు కాబోతోందని కూడా పేర్కొంది.

'దిశ' చెప్పినట్టే రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందడం, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించడం జరిగిపోయాయి. ప్రతిసారీ చిట్టచివరి ఫలితంగా ఏ అర్ధరాత్రో, అపరాత్రో ఉరవకొండ ఫలితం వెలువడేది. అందుకు భిన్నంగా ఈసారి మొట్టమొదటి ఫలితం ఉరవకొండదే కావడం విశేషం. మెజారిటీ కూడా మొదటి సారిగా 23 వేల ఓట్లకు పైగా నమోదు చేయడం మరో విశేషం.

మరింత బలపడ్డ శింగనమల సెంటిమెంటు..

అనంతపురం జిల్లాలో మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఏ పార్టీ అభ్యర్థి శింగనమలలో గెలుపొందితే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఆ సెంటిమెంటు. టీడీపీ కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ శింగనమలలో గెలుపొందడం, అందుకు తగ్గట్టే రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయభేరి మోగించడం జరిగిపోయాయి. దీంతో శింగనమల సెంటిమెంటు మరింత బలపడినట్టయింది.

పెరిగిన మహిళా ప్రాతినిధ్యం..

జిల్లా నుంచి 2024 నాటి శాసనసభకు మహిళా ప్రాతినిధ్యం బాగా పెరిగింది. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్, శింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి మాత్రమే మహిళా ఎమ్మెల్యేలుగా ఉండేవారు. అలాంటిది ఈసారి వారి సంఖ్య రెట్టింపయింది. రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత, పెనుకొండలో సవితమ్మ, పుట్టపర్తిలో పల్లె సింధూర రెడ్డి, శింగనమలలో బండారు శ్రావణి శ్రీ టీడీపీ కూటమి తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

ఒక్క పరిటాల సునీత మాత్రం నాలుగవసారి గెలుపొందడం విశేషం. 2005, 2009, 2014, 2024లో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014-19 మధ్యకాలంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు అవకాశం ఇచ్చి తాను పోటీకి దూరంగా ఉండిపోయారు. ఈసారి తానే పోటీ చేసి గెలుపొందారు. మిగతా ముగ్గురు తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం విశేషం.

కాలవదే అత్యధిక మెజారిటీ..

రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అత్యధిక మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. 41,659 ఓట్ల మెజారిటీ సాధించి తనకు తిరుగు లేదని చాటి చెప్పారు. తనను కాదని మెట్టు గోవిందరెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జీర్ణించు కోలేకపోయారు. బీజేపీలో చేరి తన ప్రత్యర్థి కాలవ గెలుపు కోసం ఆయన పని చేయడం విశేషం.

అలుపెరుగని పోరాట యోధుడు కందికుంట

కదిరి నియోజకవర్గంలో అలుపెరుగని పోరాట యోధుడు కందికుంట వెంకటప్రసాద్. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2014, 2019 ఎన్నికల్లో చాంద్ బాషా, సిద్ధారెడ్డి చేతుల్లో ఓటమిపాలయ్యారు. అయినా, మొక్కవోని దీక్షతో పోరాటం చేసి.. టికెట్ తెచ్చుకుని గెలుపు సాధించారు. ముస్లింలు, రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రెండోసారి గెలుపొందిన బీసీ నేత ఆయన.

కళ్యాణదుర్గంలో గెలుపుతో నెరవేరిన కల

2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించిన అమిలినేని సురేంద్రబాబు.. ఎంతటి ధనవంతుడైనా ఎమ్మెల్యే కావడానికి పదహారేళ్లు పట్టింది. 2009లో అనంతపురం ప్రజారాజ్యం టికెట్, 2014లో టీడీపీ టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారాయి. దీంతో 2019లో ఎలాంటి ప్రయత్నం చేయకుండా వదిలేశారు. 2024లో కళ్యాణదుర్గం టికెట్ తెచ్చుకుని తన సుదీర్ఘకాల కల నెరవేర్చుకున్నారు.

ఎక్కడి నుంచో వచ్చి ధర్మవరంలో మెరిసిన సత్యకుమార్

పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్టు గోనుగుంట్ల సూర్యనారాయణ, పరిటాల శ్రీరామ్ మధ్య పోటీ కాస్త బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు వరంగా మారింది. ప్రొద్దుటూరుకు చెందిన ఆయన హిందూపురం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోని రీతిలో ధర్మవరం ఛాన్స్ వచ్చింది. దాన్ని ఆయన పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనంత ఎమ్మెల్యేగా మారిన ఎంపీపీ

రాప్తాడు ఎంపీపీగా పని చేసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనూహ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ టికెట్ తెచ్చుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పై పోటీ చేసి అవలీలగా ఎమ్మెల్యే అయిపోయారు. నగర ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి కేవలం నెల రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేగా మారిపోవడం ఎవరూ ఊహించని పరిణామం.

తాడిపత్రిలో తిరిగి టీడీపీ జెండా

మూడున్నర దశాబ్దాల పాటు తమ ఏలుబడిలో ఉన్న తాడిపత్రిని 2019 ఎన్నికల్లో జేసీ సోదరులు కోల్పోవాల్సి వచ్చింది. తమ చిరకాల ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి నాడు ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి వారు పడని కష్టాలు లేవు. తండ్రీ కొడుకులకు జైలుజీవితం కూడా తప్పలేదు. అలాంటి చోట గట్టి పోరాటమే చేసి తిరిగి గెలుపొందడం ద్వారా టీడీపీ జెండా ఎగురవేశారు.

గుంతకల్లులో గుమ్మనూరు

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జగన్ మంత్రివర్గంలో సభ్యుడిగా పని చేశారు. ఆ పార్టీలో తిరిగి తనకు టికెట్ లభించే అవకాశం లేకపోవడంతో అనూహ్యంగా టీడీపీలో చేరి గుంతకల్లు టికెట్ తెచ్చుకున్నారు. ఆయనపై తొలుత పార్టీలో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైనా అదేమీ ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. నెల తిరగకనే ఎమ్మెల్యేగా గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎమ్మెస్ రాజు అంటే మడకశిర రాజు

మడకశిర టీడీపీ అభ్యర్థిగా తొలుత డాక్టర్ సునీల్ కుమార్ పేరు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడైన ఆయన కొంతకాలం పాటు ప్రచారం కూడా చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి వ్యతిరేకిస్తుండడంతో చివరి క్షణంలో సునీల్ కుమార్ స్థానంలో ఎమ్మెస్ రాజును అభ్యర్థిగా ప్రకటించారు.

ఆయనపై తొలుత సునీల్ కుమార్ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. క్రమేపీ అంతా సర్దుకుంది. చివరికి కేవలం 351 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ద్వారా ఎమ్మెస్ రాజు అనూహ్యవిజయం సాధించారు.


Similar News