హిమంతా.. బీజేపీ విశ్వాసమంతా

గువహతి: హిమంత బిశ్వ శర్మ.. ఇప్పుడీ పేరు ఈశాన్యం సహా యావత్ దేశానికి సుపరిచితం. ఎందులో అడుగుపెట్టినా అట్టడుగుకు దూసుకెళ్లి తనదైన ముద్రవేయడం, అన్నీ తానై కష్టించడం, అనుకున్నది సాధించే వరకు సడలని పంతం, ఆయన సొంతం. చాకచక్యం, అనూహ్య వేగంతో నిర్ణయాలు, అంచనాలు తారుమారు చేస్తూ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, కొండనైనా ఢీకొనే సాహసం శర్మను అనతి కాలంలోనే ఎమ్మెల్యే నుంచి సీఎం కుర్చీ వరకు తీసుకెళ్లాయి. అందుకే కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీకి అరుదైన […]

Update: 2021-05-09 11:22 GMT
హిమంతా.. బీజేపీ విశ్వాసమంతా
  • whatsapp icon

గువహతి: హిమంత బిశ్వ శర్మ.. ఇప్పుడీ పేరు ఈశాన్యం సహా యావత్ దేశానికి సుపరిచితం. ఎందులో అడుగుపెట్టినా అట్టడుగుకు దూసుకెళ్లి తనదైన ముద్రవేయడం, అన్నీ తానై కష్టించడం, అనుకున్నది సాధించే వరకు సడలని పంతం, ఆయన సొంతం. చాకచక్యం, అనూహ్య వేగంతో నిర్ణయాలు, అంచనాలు తారుమారు చేస్తూ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, కొండనైనా ఢీకొనే సాహసం శర్మను అనతి కాలంలోనే ఎమ్మెల్యే నుంచి సీఎం కుర్చీ వరకు తీసుకెళ్లాయి. అందుకే కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీకి అరుదైన అస్త్రంగా మారిన తర్వాత దిగ్గజ నేత, అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్‌‌ నుంచి పోరు తప్పదనుకున్నప్పుడు వైరి పార్టీలో చేరీ విజయబావుటా ఎగరేశారు. పార్టీ మారి నేడు సీఎం కుర్చీనే తన వద్దకు తెచ్చుకున్నారు.

హిమంతకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి. గువహతిలోని కాటన్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడే కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీగా 1991,92లలో చేశారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌లోనూ కొనసాగారు. 90వ దశకంలో రాష్ట్ర సీఎంగా ఉన్న హితేశ్వర్ సైకియా హిమంత చురుకుదనాన్ని కనిపెట్టి కాంగ్రెస్‌లోకి తీసుకున్నారు. 2001లో జలుక్‌బరి నుంచి అసోం గణపరిషద్ లీడర్ భ్రిగు కుమార్ ఫుకాన్‌ను ఓడించి తొలిసారి శాసనసభలో ఆయన అడుగుపెట్టారు. ఆ టర్మ్ మినహా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిసారి మంత్రిగా లేదా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తూ తనదైన ముద్ర వేసుకొచ్చారు. జలుక్‌బరి నుంచే 2006, 2011లలోనూ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. తరుణ్ గొగోయ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగారు.

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్..

అసోంలో తరుణ్ గొగోయ్ తర్వాత నెక్స్ట్ సీఎం అయ్యే లీడర్ అంటే అప్పుడు శర్మనే. కానీ, తరుణ్ గొగోయ్ తన కుమారుడు గౌరవ్ గొగోయ్‌కి దారివేయాలని భావించడంతో శర్మతో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ వివాదం ముదిరి పాకాన పడటంతో కాంగ్రెస్ నేరుగా సీబీఐతో శర్మపైనే శారదా చిట్ ఫండ్, మరో అవినీతి స్కాం కేసులో దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చింది. దీంతో ప్రత్యామ్నాయం దారిలో మరో పది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి మారారు. బీజేపీలో చేరకుండా సోనియా, ఖర్గే, దివంగత నేత అహ్మద్ పటేల్ బుజ్జగింపులు చేసినా, రాహుల్ తిరస్కరించారు. అంతే, శర్మ బీజేపీలో చేరి ఆ పార్టీని ఈశాన్యంలో తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చారు.

బీజేపీ, శర్మ పరస్పర ప్రయోజనాలు.. విజయాలు

శర్మ బీజేపీలో చేరిన తదుపరి ఏడాదే 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపారు. ఆయన కేవలం అసోంకే పరిమితం కాలేదు. అరుణాచల్‌లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి బీజేపీకి వేదిక నిర్మించడం, మణిపూర్‌లో 2017లో బీజేపీ అలయెన్స్‌ ఏర్పాటు, మేఘాలయాలోనూ ఆయన వ్యూహాలు ఫలించి బీజేపీకి పట్టునిచ్చాయి. క్షేత్రస్థాయి నేత కావడంతో ఈశాన్యంలో బీజేపీ పట్టుపెంచుకోవడానికి శర్మ ఉపయోగపడ్డారు. అలాగే, సీఎం పదవిని సొంతం చేసుకోవడమూ బీజేపీతో ఆయనకు సులువైంది. అసోంలో ఎన్నికలు గెలవాలంటే కాంగ్రెస్‌లో ఒక తరం మారే వరకు ఎదురుచూడాల్సిన స్థితి ఉంటుందని శర్మ అందుకే అంటుంటారు. 2016లో సీఎం ఫేస్ శర్బానందా అయినప్పటికీ ఓట్లు శర్మ పట్టుతోనే పడ్డాయంటారు. శర్బానందా ప్రభుత్వంలోనూ శర్మదే పైచేయి. ఏ నిర్ణయంలోనైనా ఆయన సమ్మతి ఉండాల్సిందే అనేంత పట్టు సాధించారు. అమిత్ షాకు నమ్మినబంటుగా సాగిన శర్మ, శర్బానందవైపే మొగ్గే నరేంద్ర మోడీ ఆమోదాన్ని సులువుగానే సంపాదించుకున్నారు. ఫలితంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అసోం సీఎంగా ప్రమాణం తీసుకోనున్నారు.

Tags:    

Similar News