తల్లి కళ్లలో ఆనందం చూసేందుకు.. పోలీస్ అవతారమెత్తిన కొడుకు.. చివరకు..

దిశ, ఏపీ బ్యూరో : తన కొడుకును పోలీస్‌గా చూడాలని ఆ తల్లి ఆశపడింది. అంతేకాదు పోలీస్ శిక్షణ సైతం ఇప్పించింది. అయితే పోలీస్ సెలక్షన్స్‌లో విఫలమవ్వడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. పోలీస్ కాకపోతే తన తల్లి ఏమైపోతుందోనని ఆందోళన చెందిన ఆ కొడుకు ఇంటికి వెళ్లలేదు. తనకు పోలీస్ ఉద్యోగం వచ్చిందంటూ నమ్మించి నెలకు కొంత డబ్బు ఇంటికి పంపేవాడు. అయితే ఇంటికి వచ్చినప్పుడల్లా పోలీస్ యూనిఫామ్‌ వేసుకునే వాడు. అయితే ఈ విషయంపై కొందరు […]

Update: 2021-08-02 06:21 GMT

దిశ, ఏపీ బ్యూరో : తన కొడుకును పోలీస్‌గా చూడాలని ఆ తల్లి ఆశపడింది. అంతేకాదు పోలీస్ శిక్షణ సైతం ఇప్పించింది. అయితే పోలీస్ సెలక్షన్స్‌లో విఫలమవ్వడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. పోలీస్ కాకపోతే తన తల్లి ఏమైపోతుందోనని ఆందోళన చెందిన ఆ కొడుకు ఇంటికి వెళ్లలేదు. తనకు పోలీస్ ఉద్యోగం వచ్చిందంటూ నమ్మించి నెలకు కొంత డబ్బు ఇంటికి పంపేవాడు. అయితే ఇంటికి వచ్చినప్పుడల్లా పోలీస్ యూనిఫామ్‌ వేసుకునే వాడు.

అయితే ఈ విషయంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై నిఘాపెట్టిన పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టగా నకిలీ పోలీస్ అని నిర్ధారించారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నున్న పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. నున్న రూరల్ సీఐ హనీష్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరుకు చెందిన లుక్కా పృథ్వీరాజ్ బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. తండ్రి లేకపోవడంతో తల్లి సుజాత కూలి పనులు చేస్తూ అతడిని పెంచి పెద్ద చేసింది.

పోలీస్‌ ఉద్యోగం సాధించాలని అతడికి తన మనసులోని కోరికను పదేపదే చెప్పేది. తల్లి కోరిక మేరకు పృథ్వీరాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. 2017లో సెలక్షన్స్‌కు వెళ్లి ఫెయిల్ అయ్యాడు. అయితే తనకు విజయవాడలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని అందర్నీ నమ్మించాడు. ఓ యూనిఫామ్ కొనుగోలు చేసి అదే యూనిఫాంలో ఊరిలో తిరుగుతుండేవాడు. దీంతో, పృథ్వీరాజ్ నిజమైన పోలీస్ అని కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అంతా నమ్మేశారు.

మూడేళ్ల క్రితం కానిస్టేబుల్ ట్రైనింగ్ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. విజయవాడ శివారులోని తన స్నేహితుడి కోళ్లపారంలో పనిచేసేవాడు. అతడు ఇచ్చే జీతంతో కొంత తల్లికి పంపేవాడు. తల్లిని చూసేందుకు వచ్చిన ప్రతీసారి పోలీస్ యూనిఫామ్ వేసుకోవడంతో ఆ తల్లి మురిసిపోయేది. అయితే, పృథ్వీరాజ్ వ్యవహారంపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఆదివారం కండ్రిక సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీస్ యూనిఫాంలో బైక్‌పై వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు.

ఏ స్టేషన్‌లో పనిచేస్తున్నావ్.. ఐడీ కార్డు.. ఇతర విషయాలు ప్రశ్నించడంతో నీళ్లు నమిలాడు. దీంతో, పృథ్వీ నకిలీ పోలీస్ అని పోలీసులు నిర్ధారించి అతడిని అరెస్ట్ చేశారు. అయితే, తాను యూనిఫాంతో ఎవర్నీ బెదిరించలేదని.. కేవలం తన తల్లిని సంతోషపెట్టేందుకే వేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. మొత్తానికి తల్లి కళ్లల్లో ఆనందం చూసేందుకు కొడుకు జైలుపాలయ్యాడు. ఉద్యోగం రాలేదని చెప్పి.. వేరే ఉద్యోగం చేసినా ఆ తల్లి బాధపడకపోయేది. కానీ, పోలీస్ అని నమ్మించడం.. జైలు పాలవ్వడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. నిజం చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ ఆ తల్లి తెలిసిన వాళ్ల దగ్గర కన్నీటిపర్యంతమవుతోంది.

Tags:    

Similar News