తనిఖీలకు పోయారు.. సాయం చేశారు..
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆ పల్లెను పోలీసులు చుట్టు ముట్టారు. ఇంటింటినీ పరిశీలించి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించొద్దని అవగాహన కల్పించారు. అనంతరం ఆ పల్లెజనమే తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులే ఆ ఊరి సమస్యల పరిష్కారానికి నడుం బిగించాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం శాత్రాజ్‌పల్లి గ్రామం నుంచి మిగతా గ్రామాలకు రవాణా లేదు. మానేరు నదికి అవతల ఉండే ఈ గ్రామం చుట్టూ పంట పొలాలు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆ పల్లెను పోలీసులు చుట్టు ముట్టారు. ఇంటింటినీ పరిశీలించి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించొద్దని అవగాహన కల్పించారు. అనంతరం ఆ పల్లెజనమే తమ గోడును వెల్లబోసుకున్నారు. దీంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులే ఆ ఊరి సమస్యల పరిష్కారానికి నడుం బిగించాల్సి వచ్చింది.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం శాత్రాజ్‌పల్లి గ్రామం నుంచి మిగతా గ్రామాలకు రవాణా లేదు. మానేరు నదికి అవతల ఉండే ఈ గ్రామం చుట్టూ పంట పొలాలు ఉన్నాయి. పొలాలు దాటితే కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామాలకు చేరే అవకాశం ఉంటుంది. రామగుండం కమిషనరేట్ పోలీసులు శాత్రాజ్‌పల్లి గ్రామంలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు గ్రామంలోని ఇంటింటిని వెతికాయి. అనంతరం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులు వస్తే వారిని అక్కున చేర్చుకోవద్దని సూచించాయి.
గోడు వెల్లబోసుకున్న జనం..
ఈ సందర్భంగా శాత్రాజ్‌పల్లి వాసులు పోలీసు అధికారులకు తమ గోడు వెల్లబోసుకున్నారు. మిషన్ భగీరథ వాటర్ పైప్‌లైన్ వేయలేదని, కమ్యునిటీ టాయిలెట్స్ ఊసే లేదని, ఈజీఎస్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, రోడ్డు సౌకర్యం సరిగా లేదని వాపోయారు. మానేరు నదికి అవతల ఉన్నందున తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని వివరించారు. ఈ సందర్భంగా డీసీపీ రవీందర్ గ్రామస్తులతో మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మానేరు నది నుంచి గ్రామానికి పైప్ లైన్ ఉన్నా మోటార్లు పనిచేయక పోవడంతో స్పందించిన పోలీసు అధికారులు మోటార్ రిపేరుకు రూ. 6 వేలు గ్రామస్తులకు అందించారు.
టార్గెట్ మావోయిస్టులు..
మండలంలోని ఇతర గ్రామాలతో సంబంధం లేకుండా ఉన్న శాత్రాజ్ పల్లి గ్రామంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సమాచారం. గతంలో ఈ ప్రాంతంలోని సుంకరి గుట్టల్లో మావోయిస్టు నాయకుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నించడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో గోదావరిఖని ఏసీపీ ఉపేందర్, మంథని సీఐ మహేందర్, ఎస్సైలు నరసింహ, వెంకటేశ్వర్, ఆర్ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.