ఏప్రిల్ 14 వరకూ దేశమంతా లాక్‌డౌన్: ప్రధాని మోదీ

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధానికి అర్ధరాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు (ఏప్రిల్ 14 రాత్రి వరకు) దేశమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలో ప్రజలందరూ తమ గుమ్మాల వద్ద లక్ష్మణరేఖ గీసుకొని అది దాటకుండా ఉండాలని కోరారు. మంగళవారం రాత్రి కరోనా మీద ప్రధాని ప్రత్యేకంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, కరోనానెదుర్కోడానికి రూ.15వేల కోట్ల రూపాయల సాయాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులు వ్యక్తిగత రక్షణ, […]

Update: 2020-03-24 10:22 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధానికి అర్ధరాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు (ఏప్రిల్ 14 రాత్రి వరకు) దేశమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలో ప్రజలందరూ తమ గుమ్మాల వద్ద లక్ష్మణరేఖ గీసుకొని అది దాటకుండా ఉండాలని కోరారు. మంగళవారం రాత్రి కరోనా మీద ప్రధాని ప్రత్యేకంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ, కరోనానెదుర్కోడానికి రూ.15వేల కోట్ల రూపాయల సాయాన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులు వ్యక్తిగత రక్షణ, ఐసొలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, వైద్య ఉపకరణాలు తదితరాలను సమకూర్చుకోవడానికి వెచ్చించాలని రాష్ట్రాలకు సూచించారు. ఇంటి నుంచి అడుగు బయటపెడితే కరోనా లోపలికి వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులు తగ్గిపోతున్నా ప్రజల ప్రాణాల కోసం లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదన్నారు. సంక్షోభ సమయంలో సమాజంలోని ప్రతీ ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో సమిష్టి కృషి అవసరమన్నారు.

ప్రపంచంలోని ఇటలీ, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్ప మరో దారి లేదన్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం 21 రోజులు ఎవరూ బయటికి రాకుండా ఉంటే కరోనా చైన్ వలయాన్ని బ్రేక్ చేయవచ్చన్నారు. ‘ప్రధాన మంత్రిగా కాదు.. మీ కుటుంబ సభ్యునిగా అడుగుతున్నాను. చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రాకండి. ప్రాణముంటేనే ప్రపంచముంటుందని గుర్తుంచుకోవాలి’ అన్నారు. ఈ 21 రోజులు సరిగా లేకపోతే 21 ఏళ్లు కోలుకోలేని పరిస్థితి వస్తుందన్నారు. జనతా కర్ఫ్యూ కంటే లాక్ డౌన్ మరో ముందడుగని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు మొత్తం లాక్ డౌన్ అవుతాయన్నారు. కరోనా మహమ్మారిని సరిగా ఎదుర్కోకపోతే దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ డిస్టన్స్ కేవలం రోగుల కోసమేనని కొందరు అనుకుంటున్నారని, కానీ ఇలాంటి అపోహలు వారిని ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు. కరోనా కార్చిచ్చులాగా వ్యాపిస్తుందని, మొదటి లక్ష మందికి రావడానికి 67 రోజులు పడితే 2 లక్షల మందికి రావడానికి కేవలం 11 రోజులే పట్టింది అన్నారు. ఇక ఈ సంఖ్య 3 లక్షలకు చేరడానికి కేవలం 4 రోజులే పట్టింది అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా వచ్చిన వ్యక్తి మొదట ఆరోగ్యంగానే ఉంటాడని, రోగిలో కరోనా లక్షణాలు బయటపడేసరికే ఇది ఇంకొకరికి అంటుతుందని చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు కూడా ముందుకు రావడం సంతోషించదగిన పరిణామమన్నారు.

ఆరోగ్య సేవలకే రాష్ట్రాలన్నీ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ఇదే ఆలోచిస్తున్నాయని, పేదలకు నిత్యావసరాలను ప్రభుత్వాలే సమకూరుస్తాయని భరోసా ఇచ్చారు. పుకార్లను, మూఢ నమ్మకాలు వద్దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులను నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ప్రధాని మొదలు సామాన్యుడి వరకు ఇళ్ళల్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రజలంతా ఇళ్ళకే పరిమితం కావాలని కోరారు. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పాటిస్తూ ఉంటే ప్రధాని మాత్రం 21 రోజుల పాటు, అంటే వచ్చే నెల 14వ తేదీ అర్థరాత్రి వరకు, పాటించాలని కోరడంతో తెలంగాణలో కూడా వచ్చే నెల 15వ తేదీ వరకు లాక్ డౌన్ తప్పనిసరి కానుంది.

కరోనా కట్టడిలో ప్రముఖ భూమిక పోషిస్తున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియాకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఇకపైన కూడా వారు కీలక భూమిక పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గూడులేని పేదలకు ప్రభుత్వాలు, పౌర సమాజం అండగా నిలవాలని కోరారు. డాక్టర్ల సలహాలు లేకుండా ప్రజలు ఎలాంటి మందుల్ని సొంత ఆలోచనతో వాడవద్దని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల ప్రాధాన్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణే కావాలని కోరారు.

Tags: India, Corona, PM Modi, Complete Lockdown, 21 Days, April 15, Crucial Period, Government

Tags:    

Similar News