షర్మిల పార్టీ వ్యూహకర్తగా ‘పీకే’ శిష్యురాలు ప్రియ
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిల తన స్పీడ్ ను మరింత పెంచారు. జూలై 8వ తేదీన తన తండ్రి జయంతిని పురస్కరించుకొని తను పెట్టబోయే పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియను నియమించుకున్నారు. ఈ మేరకు ప్రియ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను శుక్రవారం కలిశారు. పలు అంశాలపై వారు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా చేపట్టాల్సిన గైడెన్స్ ను ఆమె షర్మిలతో జరిగిన […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిల తన స్పీడ్ ను మరింత పెంచారు. జూలై 8వ తేదీన తన తండ్రి జయంతిని పురస్కరించుకొని తను పెట్టబోయే పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియను నియమించుకున్నారు. ఈ మేరకు ప్రియ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను శుక్రవారం కలిశారు. పలు అంశాలపై వారు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా చేపట్టాల్సిన గైడెన్స్ ను ఆమె షర్మిలతో జరిగిన భేటీలో చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాతో పాటు, షర్మిల పార్టీ వ్యూహాలపై ఫోకస్ పెట్టనున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.
తమిళనాడు తిరువల్లూరు డీఎంకే పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియ. ఆమె తన తండ్రి గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా డీఎంకేకి స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్‌లోనూ ప్రియ పనిచేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో వైఎస్ షర్మిలకు పనిచేస్తారని సాక్షాత్తు వైఎస్ విజయమ్మ పార్టీ కీలకనేతలతో గతంలో చెప్పారు. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసేది లేదని ప్రకటించారు.
తాజాగా ఆయన టీంలో పనిచేసిన ప్రియ షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటంతో లోటస్ పాండ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పార్టీ ఆవిర్భావం అనంతంరం తెలంగాణలో వైఎస్సార్ టీపీ సోషల్ మీడియాను బలోపేతం చేయడంతో పాటు పార్టీ నిర్మాణంలో స్ట్రాటజిస్ట్ గా ప్రియ తన వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియ ఒక స్ట్రాటజిస్ట్ మాత్రమే కాకుండా తమిళనాడులోని ఒక మీడియా సంస్థకు అధినేతగా కూడా వ్యవహరిస్తున్నారు.