అంతర్రాష్ట్ర బ్రిడ్జి పై అక్రమాలు
దిశ, కరీంనగర్ ప్రతినిధి: అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై నుంచి అక్రమంగా రేషన్ బియ్యం, మద్యం, గ్లైసిల్, పురుగుల మందులు, ఎరువులను తరలిస్తున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి సరుకు దాటిస్తే చాలు అన్నట్లుగా స్మగ్లింగ్ జరుగుతోంది. ఇక్కడి నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం మహారాష్ట్రలోని ఓ రైస్ మిల్లులోకి తరలుతున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నిషేధిత గడ్డిమందు ఇక్కడకు వస్తోంది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. […]
దిశ, కరీంనగర్ ప్రతినిధి: అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై నుంచి అక్రమంగా రేషన్ బియ్యం, మద్యం, గ్లైసిల్, పురుగుల మందులు, ఎరువులను తరలిస్తున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి సరుకు దాటిస్తే చాలు అన్నట్లుగా స్మగ్లింగ్ జరుగుతోంది. ఇక్కడి నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం మహారాష్ట్రలోని ఓ రైస్ మిల్లులోకి తరలుతున్నట్లు సమాచారం. అక్కడి నుంచి నిషేధిత గడ్డిమందు ఇక్కడకు వస్తోంది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు.
రాష్ట్ర సరిహద్దు వంతెన అక్రమ రవాణాకు అడ్డాగా తయారైంది. నిరుపేదలకు పంచే రేషన్ బియ్యం ఇటు నుంచి అటు, నిషేధించిన గ్లైసిల్ మందు అటు నుంచి ఇటు గుట్టు చప్పుడు కాకుండా రవాణా అవుతున్నాయి. ఇంతకాలంగా పల్లెల నుంచి గోదావరి నది మీదుగా అక్రమంగా సాగిన ఈ దందా ఇప్పుడు వంతెన మీదుగా జరుగుతోంది. తెలంగాణాలోని వివిధ జిల్లాల్లో సేకరిస్తున్న రేషన్ బియ్యాన్ని టన్నుల కొద్దీ అక్రమంగా తరలిస్తున్నారు. ప్రధానంగా పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు తదితర జిల్లాల నుంచి ఈ అంతర్రాష్ట్ర వంతెన మీదుగా రేషన్ బియ్యం దర్జాగా తరలి వెళ్తున్నాయి. ఇక్కడ కిలో బియ్యానికి రూ.10 వరకు వెచ్చించి మహారాష్ట్రకు తరలించి సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో 40 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు.
మహారాష్ట్రకు రేషన్ బియ్యం..
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెన మీదుగా లారీల కొద్దీ రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇంటర్ స్టేట్ వంతెన ప్రారంభం అయిన తరువాత ఇక్కడి వ్యాపారులు కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ రైస్ మిల్లుకు ఇక్కడి నుంచి రేషన్ బియ్యం వెళ్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఇక్కడి అధికారులు పొరుగు రాష్ట్రానికి వెళ్లి బియ్యాన్ని పట్టుకునే అవకాశం లేదని వ్యాపారులు జోరుగా ఈ దందాను చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఈ మిల్లుపై దాడులు చేయాలంటే అక్కడి అధికారులే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. కాళేశ్వరం వంతెన దాటిస్తే చాటు తెలంగాణ అధికారులు తమను ఏమీ చేయాలేరన్న ధీమాతో వ్యాపారులు దందాను కొనసాగిస్తున్నారు.
తెలంగాణకు గ్లైసిల్..
రాష్ట్రంలో నిషేధించబడిన గడ్డిమందు (గ్లైసిల్) మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున సరిహద్దులు దాటి వస్తోంది. ఇప్పటికే కాటారం సబ్ డివిజన్ పోలీసులు పలు మార్లు ఈ నిషేధిత పెస్టిసైడ్‌ను పట్టుకున్నారు. అయినప్పటికీ అక్రమ వ్యాపారులు మాత్రం తమ పనిని యథేచ్ఛగా సాగిస్తూనే ఉన్నారు.
సరిహద్దు వైన్స్‌లకు ఫుల్ డిమాండ్
సరిహద్దు ప్రాంతంలో మద్యం అమ్మకాలు జరిపేందుకు గత దశాబ్ద కాలంగా సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు పోటీ పడుతున్నారు. కాళేశ్వరంలో వైన్ షాపు తమకే దక్కాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వ్యాపారులు ఎక్కువ టెండర్లు వేస్తుంటారు. ప్రభుత్వానికి రెంటల్ చెల్లించే విషయంలో మద్యం వ్యాపారులు ఏ మాత్రం వెనకాడరు. ప్రధానంగా కాళేశ్వరానికి పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మద్యం నిషేధించడంతో సరిహద్దు వైన్స్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 1993లో ఆదివాసీ జిల్లా అయిన గడ్చిరోలిలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకంది.
120 గ్రామాలకు తెలంగాణ మద్యం..
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సిరొంచ, అహేరీ తాలుకాలు కాళేశ్వరానికి సమీపంలో ఉంటాయి. ఈ రెండు తాలుకాల్లో సుమారు 120 గ్రామాలకు కాళేశ్వరం నుంచి లిక్కర్ సప్లై చేసి సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచనతో ఇక్కడి మద్యం వ్యాపారులు ఏటే రెంటల్ పెంచుతూ ఉంటారు. అంతేకాకుండా కాళేశ్వరం ఆలయంతో పాటు అన్నారం, కన్నెపల్లి, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే టూరిస్టులతో కూడా మరింత లాభం చేకూరుతుందని ఆశించారు వ్యాపారులు. అయితే ఈ సారి వారి ప్లాన్ బెడిసి కొట్టిందనే చెప్పాలి. పొరుగునే ఉన్న సిరొంచ తాలుకా సీఐ అక్రమ దందాలపై కన్నెర్ర చేయడంతో అనుకున్నంతగా లిక్కర్ పొరుగు రాష్ట్రానికి తరలించలేకపోయారు. మరో వైపు కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ విధించడం వల్ల అటు పొరుగు రాష్ట్రానికి మద్యం పంపించలేక, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు టూరిస్టులు రాకపోవడంతో మద్యం వ్యాపారుల అంచనాలు తలకిందులయ్యాయి. అయినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దు గ్రామాల్లోని కొన్ని పల్లెలకు లిక్కర్ సరఫరా అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.